సరికొత్త పాలనా సంస్కరణలకు తెరతీసిన మోదీ శకం
చరిత్ర ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగదు. ప్రతి తరమూ తనదైన సవాళ్లను ఎదుర్కొంటుంది, కాలానికి అనుగుణంగా పరిష్కారాలను వెతుక్కుంటుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, తీవ్రమైన వనరుల కొరత ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడం, విస్తృతమైన, వైవిధ్యభరితమైన జనాభాను ఏకం చేయడం, పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించడం, శాస్త్రీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడం, ఆర్థిక వృద్ధి వైపు పయనించడం అప్పటి నాయకత్వం ముందున్న ప్రధాన అవసరాలు. అయితే, 2014 నాటికి సవాళ్ల స్వభావం మారింది. పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో, ప్రస్తుత వ్యవస్థలను 140 కోట్ల జనాభాకు మరింత బాధ్యతాయుతంగా, సమర్థంగా, అర్థవంతమైన ఫలితాలను అందించేలా మార్చడమే ఇప్పటి ప్రధాన సవాలుగా పరిణమించింది. అనేక విషయాల్లో చూస్తే వేగంగా మారుతున్న భారతదేశ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను తీర్చిదిద్దడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన అతిపెద్ద విజయం.
గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అరుదుగా కనిపించే భారీ స్థాయి పాలనాపరమైన కార్యక్రమాలకు భారతదేశం వేదికైంది. ఇప్పటివరకు 56 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలను ప్రారంభించారు. విశేషమేమిటంటే, ఈ ఖాతాలలో సగానికి పైగా మహిళలవే కావడం వల్ల వారికి ఆర్థిక అవకాశాలు మెరుగై వ్యక్తిగత సాధికారత బలోపేతమైంది. పారిశుధ్యం, గృహ వసతి, విద్యుత్, వైద్యం, స్వచ్ఛమైన వంట గ్యాస్ వంటి కనీస అవసరాలు ప్రజలందరికీ గణనీయంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో డిజిటల్ సాంకేతికతలను కేవలం వినియోగించే స్థాయి నుంచి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలలో ప్రపంచ ఆవిష్కర్తగా భారతదేశం ఎదిగింది. ఆధార్ ఆధారిత సేవలు, యూపీఐ, కోవిన్ వంటి డిజిటల్ కార్యక్రమాలు సాంకేతికత ద్వారా పారదర్శకతను, సమ్మిళిత వృద్ధిని, సాధికారతను ఎలా సాధించవచ్చో నిరూపించాయి. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్లు, డిజిటల్ అనుసంధానత రంగాల్లో పెట్టుబడులు అపూర్వమైన వేగంతో విస్తరించాయి. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనను కేవలం ఒక అభివృద్ధి లక్ష్యంగానే కాకుండా, దేశ ప్రగతి, పెట్టుబడులు, పోటీతత్వం, జాతీయ సమగ్రతకు ఒక వ్యూహాత్మక పునాదిగా పరిగణిస్తున్నారు.
ఈ మార్పుల ప్రభావం అంతర్జాతీయంగా పెరుగుతున్న భారతదేశ ప్రతిష్ట రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది, ఇందులో ప్రధాని మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. నేడు భారతదేశం ఒక నమ్మకమైన ఆర్థిక భాగస్వామిగా, డిజిటల్ ఆవిష్కరణల్లో అగ్రగామిగా, అభివృద్ధి చెందుతున్న దేశాల బలమైన గొంతుకగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా వాతావరణ చర్యలు, ఆరోగ్య సంరక్షణ, సరఫరా గొలుసు పునరుద్ధరణ, సరికొత్త సాంకేతికతలు, వ్యూహాత్మక స్థిరత్వం వంటి అంతర్జాతీయ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం విజయవంతంగా నిర్వహించిన జీ20 (G20) సారథ్యం, అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున వినిపించిన వాదనలు, భవిష్యత్తు సాంకేతికతలను రూపొందించడంలో చూపుతున్న ప్రభావం దేశ స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి.
భారత్ చాలా కాలంగా సీమాంతర ఉగ్రవాద సవాలును ఎదుర్కొంటోంది. దీనిపై గత ప్రభుత్వాలు సంయమనం, సంసిద్ధత, ప్రతిస్పందనల మధ్య సమతుల్యతను పాటించాల్సి వచ్చింది. అయితే ప్రధాని మోదీ హయాంలో రక్షణ సంసిద్ధత, బలమైన సరిహద్దు మౌలిక సదుపాయాలు, నిఘా ఆధారిత చర్యలు, దృఢమైన దౌత్యం, ‘ఉగ్రవాదం – చర్చలు కలిసి సాగలేవు’ అనే స్పష్టమైన సందేశంతో కూడిన దృఢమైన వ్యూహం వైపు అడుగులు పడ్డాయి. ఉరీ ఉగ్రదాడి తర్వాత 2016లో నియంత్రణ రేఖ వెంట చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ భారతదేశ భద్రతా విధానంలో ఒక కీలక మలుపుగా నిలిచాయి. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై వ్యూహాత్మక దాడులు చేయడానికి తమకు ఉన్న సంకల్పాన్ని భారతదేశం నిరూపించుకుంది. పుల్వామా దాడి తర్వాత 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి ఈ సందేశాన్ని మరింత బలంగా పంపింది. ఉగ్రవాదంపై భారతదేశ ప్రతిస్పందన పాత అంచనాలకు లేదా భౌగోళిక పరిమితులకు లోబడి ఉండదని ఇది స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో భారత్ పట్టుదలను, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు దీటుగా స్పందించే సామర్థ్యాన్ని ప్రతిబింబించింది. ఈ దాడుల అనంతరం అమెరికా ఖండాల్లోని విధాన నిర్ణేతలు, చట్టసభ సభ్యులు, వ్యూహాత్మక నిపుణులు, ప్రజాభిప్రాయ నేతలతో చర్చలు జరిపిన పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగస్వామిని అయ్యే అవకాశం నాకు లభించింది. ఆ సమయంలో, ఉగ్రవాదాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని, దానిని వర్గీకరించలేమని లేదా ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించలేమని భారతదేశం వాదించే విధానం పట్ల అంతర్జాతీయంగా అవగాహన పెరగడం స్పష్టంగా గమనించాను.
ప్రధాని మోదీ ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో, దీని ప్రాధాన్యం కేవలం ఆయన పదవీకాలం నిడివిలో లేదు, ఆయన సాధించాలనుకున్న పరివర్తన పరిమాణంలో ఉంది. ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికత కేవలం ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా, స్వాతంత్య్రం వచ్చిన శతాబ్ది ఉత్సవాల నాటికి ఒక అభివృద్ధి చెందిన, సమ్మిళిత, నూతన ఆవిష్కరణలతో కూడిన, ప్రపంచాన్ని ప్రభావితం చేసే భారతదేశాన్ని నిర్మించాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. మోదీ యుగం పరిపాలన పరిధిని, స్థాయిని విస్తరించింది. ఇది ప్రభుత్వాన్ని మరింత బాధ్యతాయుతంగా, సాంకేతికతను సామాన్యుడికి అందుబాటులోకి, అభివృద్ధిని మరింత సమ్మిళితంగా, ప్రపంచంలో భారతదేశ స్థానం పట్ల మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపేలా చేయడానికి కృషి చేసింది.
తరణ్ జిత్ సింగ్ సంధు,
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ దౌత్యవేత్త

