మోదీ పాలనలో గిరిజనులకు గౌరవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిరిజన సమాజానికి గౌరవం తీసుకురావడానికి, వారి జీవన విలువలను కాపాడడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సమాజానికి గౌరవం, హక్కులు, అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గౌరవం లభిస్తే అవకాశాలు, వనరులు కూడా వస్తాయని, గౌరవం పొందే నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వస్తారని అన్నారు. 3 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ జూన్ 29న హనుమకొండలో గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నేనావత్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ‘వికసిత్ తెలంగాణ కోసం గిరిజన నాయకుల సమావేశం’లో నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాల ఆరాధ్యులు సంత్ సేవాలాల్ మహారాజ్, మేడారం సమ్మక్క సారక్క, భగవాన్ బిర్సా ముండే, కొమురం భీం, రాంజీ గోండ్ తదితర గిరిజన మహనీయులను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ”దేశ చరిత్రలో తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ద్వారా గిరిజన సమాజానికి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 15ను “జనజాతి గౌరవ దివస్”గా ప్రకటించి, బిర్సా ముండా జయంతితో అనుసంధానించడం ద్వారా గిరిజన సమాజానికి, వారి పోరాట చరిత్రకు దేశవ్యాప్తంగా గౌరవం తీసుకువచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత గిరిజన సమాజానికి, వారి మహనీయులకు గౌరవం ఇవ్వడమే కాకుండా, వారి విశ్వాసాన్ని కూడా సంపాదించిన నాయకుడు ఎవరైనా ఉంటే, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే.
ఇంతకుముందు గిరిజన సమాజ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ కేవలం రూ.4-5 వేల కోట్ల పరిధిలోనే ఉండేది. ఆ పరిమిత బడ్జెట్‌తోనే గిరిజన సంక్షేమం గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గిరిజన సంక్షేమం కోసం దాదాపు రూ.15 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇది కేవలం కాగితాలపై ఉన్న ప్రణాళిక మాత్రమే కాదు. సంఖ్యలతో పరిమితమైన పథకం కూడా కాదు. ప్రతి పథకానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. 2023లో జనజాతి గౌరవ్ దివస్ సందర్భంగా సుమారు రూ.24 వేల కోట్లతో ‘పీఎం జన్మన్’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 18 రాష్ట్రాల్లో గుర్తించిన 75 పీవీటీజీ తెగలకు చెందిన సుమారు 5,500 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆ గ్రామాల్లో పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్, విద్య, పోషకాహారం, రహదారులు, టెలికమ్యూనికేషన్ వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలను కల్పించి, గిరిజనులు తమ గ్రామాలు, అడవులు, మూలాలను విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా అభివృద్ధిని వారి వద్దకే తీసుకెళ్లాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ పని చేస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గిరిజన ప్రాంతాల్లో నక్సలిజం ఒక పెద్ద సమస్యగా కొనసాగింది. దురదృష్టవశాత్తు అప్పటి రాజకీయ నాయకులు దీనిని ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలో మాత్రమే చూశారు. నక్సలిజం మూలాలను నిర్మూలించడానికి నిజమైన ప్రయత్నాలు జరగలేదు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే అడవులపై హక్కు నక్సలైట్లది కాదు.. అక్కడ నివసించే గిరిజన సోదర సోదరీమణులది. అక్కడ అభివృద్ధి జరగాల్సింది వారి కోసమే. అందుకే నక్సలిజంపై భారీ స్థాయిలో ఆపరేషన్లు చేపట్టాం. దాని ఫలితంగా బస్తర్‌కు ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతం కూడా క్రమంగా నక్సలిజం నుంచి విముక్తి పొందుతోంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు బస్తర్ ప్రాంతానికి వెళితే గిరిజన ప్రాంతాల్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అబుజ్మాడ్ అనే అడవి ప్రాంతంలో స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా భూ సర్వే జరగలేదు. దీనికి కారణం అప్పటి ప్రభుత్వాలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధి చూపకపోవడమే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బస్తర్‌లో కేవలం నక్సలిజం నిర్మూలన మాత్రమే కాదు, మొత్తం ప్రాంత పునరావాసం, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో గిరిజన కుటుంబాలకు ఇళ్లు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.
హైదరాబాద్‌లో గిరిజన మ్యూజియం నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం 10 మ్యూజియంల నిర్మాణం జరుగుతోంది. ఈ మ్యూజియంలు గిరిజన సమాజ చరిత్రను, వారి త్యాగాలను, పోరాట గాథలను భవిష్యత్ తరాలకు అందించే కేంద్రాలుగా నిలుస్తాయి. నీరు–అడవి–భూమి పరిరక్షణలో, దేశ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడడంలో గిరిజనుల పాత్రపై ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తాయి.
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది. తెలంగాణలో కూడా ఏకలవ్య పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య మోడల్ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటి కోసం సుమారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తూ గిరిజన బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంజారా విరాసత్, నగారా సంగ్రహాలయం వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి అమూల్యమైన కానుకలను అందించారు. మా ప్రభుత్వం ఒకవైపు కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతికత, తయారీ రంగం, సెమీకండక్టర్ పరిశ్రమలు వంటి భవిష్యత్ రంగాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు భారత సాంస్కృతిక వారసత్వాన్ని కూడా అదే స్థాయిలో సంరక్షిస్తోంది. అందుకే కాశీ విశ్వనాథ్, అయోధ్యలో రామ మందిరం, సోమనాథ్ దేవాలయం, అలాగే బిర్సా ముండా జన్మస్థలం వంటి చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను అభివృద్ధి చేస్తోంది. నరేంద్ర మోదీ భారతీయ సాంస్కృతిక విలువలను, ప్రజాస్వామ్య మూల్యాలను కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. 2028లో మీ ఆశీర్వాదం, గిరిజన సమాజ పెద్దల ఆశీర్వాదం మాకు లభిస్తే, “వికసిత్ తెలంగాణతో పాటు 2047 నాటికి “వికసిత్ భారత్” నిర్మాణం స్వప్నాన్ని కూడా తప్పకుండా సాకారం చేస్తాం.
కేసీఆర్ వల్లే రిజర్వేషన్లు జాప్యం
తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్. రాంచందర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అదే బిల్లులో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా చేర్చడంతో ఆ బిల్లు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుందన్నారు. ఫలితంగా గిరిజనులకు అందాల్సిన 10 శాతం రిజర్వేషన్ అమలు ఆలస్యమైందన్నారు. దీని వల్ల గిరిజన విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నష్టపోయారని తెలిపారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారిగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అలాగే జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌ను కూడా బిజెపి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. గిరిజన సంక్షేమం పట్ల బిజెపి నిబద్ధతకు ఇవి స్పష్టమైన ఉదాహరణలు. ఈ రోజు దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపి నుంచే ఉన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి పర్యటన నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన గ్రామాలకే. అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడాను. ఈ రోజుకీ అక్కడ చాలా మంది కనీస జీవన సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నారు. సరైన దుస్తులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. సెల్‌ఫోన్ టవర్లు లేవు, రహదారులు లేవు. అక్కడికి చేరుకోవడమే చాలా కష్టసాధ్యం. అలాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. చెంచు గిరిజన కుటుంబాలకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా గిరిజన సహకార సంఘాల ద్వారా వారి అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.” అని అన్నారు.
ఈ సమావేశంలో బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

