ఉద్రిక్తంగా గాంధీ భవన్ ముట్టడి
కాంగ్రెస్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవలంబిస్తున్న దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎండగడుతూ జూలై 22న బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ చేపట్టిన ‘గాంధీ భవన్ ముట్టడి’ కార్యక్రమంతో బిజెపి రాష్ట్ర కార్యాలయ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో సీనియర్ నాయకులు, యువమోర్చా, పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీగా గాంధీ భవన్ వైపు బయలుదేరగా, పోలీసులు అప్రజాస్వామికంగా అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా బిజెపి శ్రేణులు చేపట్టిన ఆందోళనలు, నినాదాలతో రాష్ట్ర కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ రౌడీలను, గూండాలను ఉసిగొల్పి బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు పంపింది. అధికార మదంతో కళ్ళుమూసుకుపోయిన కాంగ్రెస్ గూండాలు బిజెపి కార్యాలయంపై, కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఆఖరికి రక్షణగా నిలవాల్సిన పోలీసు వాహనాలపైకే ఎక్కి, రాళ్లతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గూండాలు జరిపిన ఈ దాడిలో విధి నిర్వహణలో ఉన్న ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు కీలక సమావేశాలు జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాహుల్ గాంధీ, సభను బహిష్కరించి వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. నీట్ (NEET) పరీక్ష లీకేజీ అంశంపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, చర్చ నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు, చట్టసభల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంటే, తట్టుకోలేక రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ప్రేరణతో విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో రైతు ఉద్యమం ముసుగులో, షాహీన్ బాగ్ ఆందోళనలో ఏ విధంగానైతే దేశవ్యతిరేక శక్తులు ప్రవేశించాయో, అదేవిధంగా ‘సీజేపీ’ పేరుతో ధర్నా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో నిరసనకు దిగిన వారిలో అసలు నీట్ విద్యార్థులే లేరని, కేవలం యాంటీ సోషల్, అల్ట్రా లెఫ్ట్ మూకలను జమ చేసి ఆందోళనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. సదరు నిరసనల్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణతో పాటు చైనా, పాకిస్తాన్లకు మద్దతుగా దేశవ్యతిరేక నినాదాలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల మాయలో పడి రాహుల్ గాంధీ విదేశీ ఏజెంట్లా మారి యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే భారతీయ యువత దేశభక్తి కలిగిన వారని, దేశం కోసం ప్రాణాలిస్తారు తప్ప ఇలాంటి కుట్రలకు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సాగిస్తున్న ఈ విధ్వంసకర, ‘తుక్డే తుక్డే’ రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగుతుంతుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాంచందర్ రావు అరెస్టును కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహా బిజెపి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.

