ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి సరికొత్త బాటలు
చరిత్రాత్మకమైన ‘భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’ (సెటా) భారతీయ రైతులు, మత్స్యకారులు, చేతివృత్తి కళాకారులు, చిన్న తరహా వ్యాపారాలు అంతర్జాతీయంగా వృద్ధి చెందడానికి, ఉపాధి, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది సామాన్య పౌరులకు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకే అందుబాటులోకి తెస్తుంది. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోది సంకల్పించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. జూలై 15 నుండి అమలవుతోన్న ఈ పరివర్తనాత్మక, ఉభయతారక ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో భారతీయ వస్తువులకు, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా పనిచేసే రంగాలకు పూర్తిస్థాయి మార్కెట్ ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఇది దాదాపు 99 శాతం సుంకాలను తక్షణమే రద్దు చేస్తుంది. ఇది మొత్తం వాణిజ్య విలువలో దాదాపు 100 శాతానికి వర్తిస్తుంది, భారతీయ ఎగుమతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది.
ప్రజాప్రయోజనమే కేంద్రబిందువు
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రూపొందిన ఈ ‘సెటా’ ఒప్పందంపై గత ఏడాది ప్రధాని మోది, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఇది సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా:
- రైతులు తమ దేశీయ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రీమియం ఎగుమతి మార్కెట్లను పొందుతారు.
- మత్స్యకారులు విస్తారమైన బ్రిటన్ మార్కెట్‌కు సముద్ర ఆహార (సీఫుడ్) ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
- కార్మికులు శ్రమశక్తి ఎక్కువగా అవసరమయ్యే రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలను పొందుతారు.
- మహిళా పారిశ్రామికవేత్తలు, యువత, స్టార్టప్‌లు, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు అంతర్జాతీయ విలువ గొలుసులలో మెరుగైన భాగస్వామ్యాన్ని సాధిస్తారు.
- నిపుణులు అంతర్జాతీయ గుర్తింపును, సులభతరమైన రాకపోకల అవకాశాలను పొందుతారు.
వ్యవసాయ రంగానికి రక్షణ
‘సెటా’ ఒప్పందం భారతీయ రైతులకు బ్రిటన్ ప్రీమియం మార్కెట్ తలుపులను తెరిచింది. ఇతర యూరోపియన్ దేశాలు పొందుతున్న ప్రయోజనాలతో సమానమైన లేదా అంతకంటే మెరుగైన లబ్ధిని ఇది భారత్‌కు చేకూరుస్తుంది. పసుపు, మిరియాలు, యాలకులు, మామిడి గుజ్జు, ఊరగాయలు, పప్పుధాన్యాలు వంటి ప్రాసెస్ చేసిన వస్తువులకు సుంకాలు లేని ప్రవేశం లభిస్తుంది. వ్యవసాయ ఎగుమతులు పెరగడం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా నాణ్యత, ప్యాకేజింగ్, ధృవీకరణ ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది వ్యవసాయ విలువ గొలుసువ్యాప్తంగా అనేక ఉద్యోగాలను సృష్టిస్తుంది. అదే సమయంలో దేశీయ రైతులను, ముఖ్యంగా పాడి పరిశ్రమ, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఆపిల్స్, ఓట్స్, వంట నూనెల రంగాలలో ఉన్నవారిని రక్షించడానికి అత్యంత భారత్ వ్యవసాయ రంగంలోని అత్యంత సున్నితమైన భాగాలను ఈ ఒప్పందం నుండి మినహాయించారు. ఆహార భద్రత, దేశంలో ధరల స్థిరత్వం, వెనుకబడిన రైతు వర్గాలకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వ వ్యూహానికి ఈ మినహాయింపులు నిదర్శనం.
తయారీ రంగానికి ఊతం
విస్తారమైన బ్రిటిష్ మార్కెట్‌కు వెంటనే సుంకాలు లేని ప్రవేశం లభించడం వల్ల భారతీయ తయారీ రంగం పరుగులు పెట్టనుంది. సంప్రదాయ చేతివృత్తి నిపుణులు, భారీ కర్మాగారాలు, ప్రాంతీయ పారిశ్రామిక కేంద్రాలు అంతర్జాతీయంగా సమర్థంగా పోటీ పడేందుకు ఇది దోహదపడుతుంది. ప్రత్యర్థులపై భారతీయ ఉత్పత్తులకు స్పష్టమైన పైచేయి లభించడంతో చిన్న వ్యాపారాలు వర్ధిల్లుతాయి. ఫుట్‌బాల్‌లు, క్రికెట్ కిట్లు, రగ్బీ బంతులు, బొమ్మలు వంటి వస్తువులను తయారు చేసే కంపెనీలు బ్రిటన్‌లో తమ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సుంకాల రద్దు వల్ల, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఉండే రంగాలలో దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఎగుమతుల రంగంలో తక్షణ ప్రయోజనాలు లభిస్తాయి. తిరుపూర్ మగ్గాల నుంచి బెంగళూరు లాబ్‌ల వరకు, సూరత్‌లోని వజ్రాల కళాకారుల నుంచి హైదరాబాద్‌లోని కోడర్‌ల వరకు ఈ ఒప్పందం వాస్తవ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని స్పృశిస్తుంది.
నిపుణుల రాకపోకలకు మార్గం సుగమం
భారత్ లో ఎగుమతులకు అవకాశాలు ఉన్న అన్ని ప్రధాన సేవా రంగాలు, 137 ఉపరంగాలకు సంబంధించి సేవలను పొందేందుకు బ్రిటన్ చరిత్రలోనే అత్యంత సమగ్రమైన అంగీకారాన్ని ప్రకటించింది. మెరుగైన మార్కెట్ లభ్యత, స్థిరమైన నియంత్రణల వల్ల ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఆర్థిక సేవలు, వృత్తిపరమైన సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్లు, కన్సల్టెన్సీ సేవలలో భారతీయ సేవా సంస్థలకు భారీ మద్దతు లభిస్తుంది. ఒప్పంద సేవలు అందించేవారు, వ్యాపార పర్యాటకులు, పెట్టుబడిదారులు, యోగా శిక్షకులు, సంగీతకారులు, చెఫ్‌లతో సహా నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం భారత్ తనకు అనుకూలమైన రాకపోకల నిబంధనలను ఒప్పందంలో సాధించింది. వ్యాపార సందర్శకులు, అంతర్గత కార్పొరేట్ బదిలీదారులు, స్వతంత్ర నిపుణులకు కూడా ఈ ఒప్పందం స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ఒప్పందం ప్రకారం ఏటా 1,800 మంది భారతీయ చెఫ్‌లు, యోగా శిక్షకులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు ప్రత్యేక రాకపోకల అవకాశాలను పొందగలుగుతారు.
ఒప్పందాల సరికొత్త మైలురాళ్ళు
ప్రధాని మోదీ నాయకత్వంలో, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కేవలం వస్తువులు, సేవలకే పరిమితం కాకుండా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి.
- ఈఎఫ్ టిఏ దేశాలు (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, లీచ్టెన్‌స్టెయిన్): ఈ దేశాలతో జరిగిన ఒప్పందాల ద్వారా భారత్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి హామీలను సాధించింది, ఇది పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.
- న్యూజిలాండ్: ఈ దేశంతో జరిగిన ఎఫ్టీయే ద్వారా 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిహామీ లభించింది.
- ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందం ద్వారా భారతీయ ఐటీ కంపెనీలను పీడిస్తున్న ద్వంద్వ పన్నుల సమస్య పరిష్కారమైంది.
ఉభయతారక ఒప్పందాలు
2014 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి, పెట్టుబడిదారులు భారత్ పై నమ్మకాన్ని కోల్పోయారు. పదేళ్ళ విధాన స్తబ్దత, తారస్థాయికి చేరిన అవినీతి కుంభకోణాల తర్వాత భారత్ ప్రపంచంలోని ‘ఫ్రాజైల్ ఫైవ్’ (అత్యంత బలహీనమైన ఐదు) ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణించబడింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి దృఢమైన విధానాన్ని అవలంబించింది. అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం ఇందులో తదుపరి అడుగు. వాణిజ్య విధానాలపై అనిశ్చితిని తగ్గించడం ద్వారా ఎఫ్‌టీఏలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా పెంపొందిస్తాయి. భారత్ ప్రధాన వాణిజ్య ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, పెద్ద మార్కెట్లను అందించే అభివృద్ధి చెందిన దేశాలతో ప్రభుత్వం ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంది. పోటీదారులకు భారతదేశ తలుపులను ఇష్టారాజ్యంగా తెరిచి, దేశీయ వ్యాపారాలను ప్రమాదంలో నెట్టిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరమైన వాతావరణాన్ని సృష్టించింది.
నవ భారత వాణిజ్య శైలి
ప్రధాని మోదీ నాయకత్వంలో నేటి అస్థిర ప్రపంచంలో భారత్ ఒక స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థగా, నమ్మకమైన భాగస్వామిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతోంది. ఇది ఆకర్షణీయమైన మార్కెట్ కలిగిన విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపడింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. సమూల సంస్కరణలు, ‘వాణిజ్య సౌలభ్యం’లో పురోగతి, చిన్నపాటి ఉల్లంఘనలను నేరాల జాబితా నుంచి తొలగించడం, ప్రధాని అంతర్జాతీయ ప్రతిష్ట… భారత్ ను ఒక బలమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడంలో సహాయపడ్డాయి. నేడు ప్రపంచం భారతదేశ వృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశీయ మార్కెట్‌ను క్రమంగా బలోపేతం చేస్తున్నాయి. ఇది భారతీయ మార్కెట్‌ను మరింత పోటీతత్వంతో కూడినదిగా మారుస్తుంది, స్థానిక తయారీదారులు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇది ప్రధాని ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో కీలకమైన అంశం. ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య సమానత్వంతో కూడిన, ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందాలకు ‘సెటా’ ఒక ఆదర్శం. ఇది భారత్ కీలక ప్రయోజనాలకు భంగం కలగకుండా వెనుకబడిన వర్గాలకు ఆకర్షణీయమైన అంతర్జాతీయ ఆర్థిక అవకాశాలను కల్పిస్తుంది. ‘నవ భారతం’ వ్యాపారం చేసే శైలికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ.
పీయూష్ గోయల్,
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి

