Agri development

పంటల దిగుబడి దాటి ప్రగతి వైపు పయనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా భారత వ్యవసాయ రంగం అద్భుతమైన మార్పులను చూస్తోంది. ఆహార కొరతను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న పాత రోజులను దేశం ఎప్పుడో దాటేసింది. నేడు వ్యవసాయాన్ని కేవలం ఉత్పత్తి రంగంగా మాత్రమే కాకుండా రైతుల సంక్షేమం, పోషకాహార భద్రత, వాతావరణ సమతుల్యత, గ్రామీణాభివృద్ధి, సుస్థిర ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిగా చూస్తున్నారు. హరిత విప్లవం తర్వాత మొదటిసారిగా కేవలం దిగుబడిని పెంచడంపైనే కాకుండా రైతుల ఆదాయాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం, పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సరికొత్త దృక్పథం పప్పుధాన్యాలు, నూనెగింజల కార్యక్రమం, పత్తి కార్యక్రమం, జాతీయ సహజ వ్యవసాయ కార్యక్రమం, ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన, ఖేత్ బచావో అభియాన్, డిజిటల్ వ్యవసాయ కార్యక్రమం, పరిశోధనల ఆధారిత ఆవిష్కరణల వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

గ్రామీణ భారతం బలోపేతం

భారత్ తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 37.66 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించింది. వరి, గోధుమలు, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అయితే ఈ ఘనత కేవలం అధిక ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాలేదు, అంతకంటే మిన్నగా ఇది ఒక బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విస్తరణను సూచిస్తోంది. ఈ మార్పులో రైతు సంక్షేమమే కేంద్ర బిందువుగా నిలిచింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్) కింద 22 విడతల్లో రూ.4.27 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. దీని ద్వారా తొమ్మిది కోట్లకు పైగా రైతు కుటుంబాలకు నిశ్చితమైన ఆదాయ భద్రత చేకూరింది. దీనికి తోడు ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ ప్రకృతి వైపరీత్యాలు, ఇతర నష్టాల నుండి పంటలకు బీమా రక్షణను కల్పిస్తూ రైతుల ఆర్థిక భద్రతను మరింత పెంచింది. నీటిపారుదల రంగాలు, గ్రామీణ రోడ్లు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దయెత్తున పెట్టిన పెట్టుబడులు.. ఉత్పత్తి, నిల్వ, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరిచాయి. వ్యవసాయం ఇప్పుడు డెయిరీ, మత్స్య పరిశ్రమ, కోళ్ల పెంపకం, ఉద్యాన రంగం, తేనెటీగల పెంపకం, ఆహార ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ పరిశ్రమలతో ముడిపడి ఉంది. ఇది ఉపాధిని సృష్టించడమే కాకుండా, ఆదాయ వనరులను వైవిధ్యభరితం చేస్తూ, ఒడిదొడుకులను తట్టుకోగల గ్రామీణ సమాజాలను నిర్మిస్తోంది.

‌‌స్వయంసమృద్ధి వైపు అడుగులు

భారతదేశం పప్పుధాన్యాలు, వంట నూనెల కోసం చాలా కాలంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. మరోవైపు పత్తి రైతులు తరచూ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయ సాగు నుంచి కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెట్ మద్దతు వరకు మొత్తం విలువ గొలుసుకు వర్తించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక మిషన్లను (కార్యక్రమాలను) ప్రారంభించింది. ‘జాతీయ పప్పుధాన్యాల కార్యక్రమం’ ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, మెరుగైన వంగడాలు, క్లస్టర్ ఆధారిత సాగు, మెరుగైన మద్దతు ధర, సేకరణ, నిల్వ, ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. అదేవిధంగా, ‘నూనె గింజల కార్యక్రమం ‘ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఉత్పాదకత పెంపుదల, బలమైన మార్కెట్ అనుసంధానాల ద్వారా ఆవాలు, సోయాబీన్, సన్‌ఫ్లవర్, నువ్వులు, పామాయిల్‌పై దృష్టి సారించి, జాతీయ వంట నూనెల భద్రతకు దోహదం చేస్తోంది. ‘పత్తి కార్యక్రమం’ అధిక దిగుబడినిచ్చే, తెగుళ్లను తట్టుకునే రకాలను, సమగ్ర తెగుళ్ల యాజమాన్యాన్ని, మెరుగైన వ్యవసాయ పద్ధతులను, జౌళి రంగానికి తగిన మార్కెట్ అనుసంధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ కలిసి భారతదేశ వ్యవసాయ స్వయంసమృద్ధిని బలోపేతం చేస్తూ రైతుల ఆదాయాన్ని పెంచేలా రూపొందాయి. 

‌‌పర్యావరణం కోసం ప్రకృతి వ్యవసాయం

క్షీణిస్తున్న భూసారం, మితిమీరిన రసాయన ఎరువుల వాడకం, భూగర్భ జలాలపై పడుతున్న ఒత్తిడి కారణంగా మరింత సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లడం అనివార్యమైంది. ‘జాతీయ సహజ వ్యవసాయ మిషన్’ ఒక కోటి మంది రైతులకు అవగాహన కల్పించడం, దాదాపు 18 లక్షల మంది రైతులను దీనికి సిద్ధం చేయడం, క్రమంగా దాదాపు 75 లక్షల హెక్టార్ల భూమిని సహజ వ్యవసాయం కిందికి రావడం లక్ష్యంగా పెట్టుకుంది. శాస్త్రీయ ఆధారాలు, రైతుల అనుభవాల ద్వారా ఈ మార్పును క్రమక్రమంగా అమలు చేస్తున్నారు. రైతులు ఈ పద్ధతిని స్వీకరించేలా ప్రోత్సహించడానికి వారికి శిక్షణ, స్థానికంగా లభించే ఎరువులు, విత్తనాల మద్దతు, ధృవీకరణ, బ్రాండింగ్, మార్కెట్ లింకేజీలు కల్పిస్తున్నారు. సహజ వ్యవసాయం సాగు ఖర్చులను తగ్గిస్తుంది, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని ఇస్తుంది, వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.

‌తక్కువ దిగుబడి ప్రాంతాలపై దృష్టి

దేశవ్యాప్తంగా వ్యవసాయ ప్రగతి అస్థిరంగా ఉంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి, ‘ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (పీఎం-డిడికెవై) జాతీయ సగటు కంటే తక్కువ దిగుబడి ఉన్న దాదాపు 100 తక్కువ ఉత్పాదకత గల జిల్లాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం 11 శాఖలకు చెందిన 36 ప్రభుత్వ కార్యక్రమాలను ఒకే సమగ్ర చట్రంలోకి తీసుకువచ్చింది. ఇందులో నీటిపారుదల, నేల ఆరోగ్యం, మెరుగైన విత్తనాలు, పంటల వైవిధ్యీకరణ, ఉద్యానవన రంగం, పశుసంవర్ధక శాఖ, యాంత్రీకరణ, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మార్కెట్ సౌకర్యాలు ఉన్నాయి. విడివిడిగా కాకుండా సమన్వయంతో కూడిన ప్రణాళికతో అమలు చేయడం ద్వారా ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడం, సమతుల్య గ్రామీణాభివృద్ధిని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

‌భూసారం, నీటి సంరక్షణ

నిరంతర వ్యవసాయ వృద్ధి అనేది సహజ వనరుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. రసాయన ఎరువుల మితిమీరిన వాడకం, భూగర్భ జలాల క్షీణత, లోపభూయిష్టమైన పంట మార్పిడి పద్ధతులు అనేక ప్రాంతాలలో నేల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘ఖేత్ బచావో అభియాన్’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, పోషకాల సమతుల్య వినియోగం, సూక్ష్మ పోషకాలు, బయో-ఫెర్టిలైజర్లు, నానో-ఫెర్టిలైజర్లు, పచ్చిరొట్ట, సేంద్రీయ ఎరువులు, సమగ్ర పోషకాల యాజమాన్యం, నకిలీ విత్తనాలు, ఎరువులపై నిఘాతో పాటు వాతావరణ మార్పులను తట్టుకునే సహజ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించేలా ప్రోత్సహిస్తుంది. దీని ఉద్దేశం ఎరువుల వాడకాన్ని విచక్షణారహితంగా తగ్గించడం కాదు, సరైన సమయంలో సరైన పోషకాలను అందించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సాగు ఖర్చులను తగ్గించడం, దీర్ఘకాలిక ఉత్పాదకతను కాపాడటం.

‌సైన్స్, డిజిటల్ వ్యవసాయం, ఆవిష్కరణలు

వ్యవసాయ పరివర్తనలో సైన్స్, టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2014-2025 మధ్య కాలంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్), జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థ దాదాపు 3,000 వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేశాయి. అదే సమయంలో ఉత్పాదకత, పోషకాహార భద్రతను మెరుగుపరచడానికి 3,800 కి పైగా అధిక దిగుబడినిచ్చే, 200 బయో-ఫోర్టిఫైడ్ (పోషకాలు జోడించిన) రకాలను విడుదల చేశారు. ‘డిజిటల్ వ్యవసాయ కార్యక్రమం’, ‘అగ్రిస్ట్యాక్’ ద్వారా రైతు ఐడీలు, డిజిటలైజ్డ్ భూ రికార్డులు, డ్రోన్ సేవలు, తెగుళ్ల నిఘా, వాతావరణ ఆధారిత సలహాలు, ప్రదేశం ఆధారిత సిఫార్సులను ప్రవేశపెడుతున్నారు. ఇది వ్యవసాయాన్ని మరింత కచ్చితమైనదిగా, సమర్థమైనదిగా మారుస్తోంది. ఇ-నామ్, కిసాన్ సారథి, కృషి విజ్ఞాన కేంద్రాలు, మొబైల్ మెసేజింగ్, వాట్సాప్ గ్రూపులు, కమ్యూనిటీ రేడియో, సోషల్ మీడియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫారంలు శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతుల మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి. మెరుగైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో కలిసి, ఈ ఆవిష్కరణలు మరింత అనుసంధానిత, పోటీతత్వం గల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నాయి.

పంటలను దాటి ప్రగతివైపు‌

భారతదేశ భవిష్యత్ వ్యవసాయ ప్రస్థానం ఆహార భద్రత, పోషకాహారం, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలి, అదే సమయంలో రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందేలా చూడాలి. పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, ప్రకృతి వ్యవసాయం, ఖేత్ బచావో అభియాన్, ధన ధాన్య కృషి యోజన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా రైతులను, సహజ వనరులను, గ్రామీణ జీవనోపాధిని రక్షించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. ఇప్పుడు కేవలం ఉత్పత్తిని పెంచడంపైనే కాకుండా లాభదాయకమైన, సుస్థిరమైన, సాంకేతికత ఆధారిత, అంతర్జాతీయంగా పోటీ పడే వ్యవసాయ రంగాన్ని సృష్టించడంపైనే నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టింది. సైన్స్, ఆవిష్కరణలు, సమగ్ర గ్రామీణాభివృద్ధి భారతీయ వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తున్న తరుణంలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తిలో స్వయం సమృద్ధి, మెరుగైన గ్రామీణ సంక్షేమం, రైతులకు అధిక ఆదాయాల దిశగా దేశం అడుగులు వేస్తోంది. వ్యవసాయం వర్థిల్లితేనే రైతులు బాగుంటారు. రైతులు బాగుంటేనే గ్రామీణ భారతం బలోపేతమవుతుంది. గ్రామీణ భారతం బలోపేతమైనప్పుడే, భారతదేశం సురక్షితమైన, సంపన్నమైన, స్వయం సమృద్ధి సాధించి భవిష్యత్తు వైపు ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ వ్యవసాయ రంగం సరికొత్త దార్శనికత ఇదే – పంటల దిగుబడిని మించి శాశ్వతమైన ప్రగతి పథంలో పయనించడం!

శివరాజ్ సింగ్ చౌహాన్,
కేంద్ర వ్యవసాయ మంత్రి