రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిదే విజయం
రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి పూర్తి ఐక్యతతో పనిచేస్తుందని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి విజయం కోసం కృషి చేస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఐక్యత, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటామని తెలిపారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ (ఫామ్-18) అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల క్షేత్రంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా సెప్టెంబర్ 29న హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన కీలక సన్నాహక సమావేశం జరిగింది. ఉమ్మడి పది జిల్లాలను, దాదాపు 76 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఈ రెండు ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడంతో పాటు, బూత్ స్థాయి నుంచే బలమైన కార్యాచరణను రూపొందించేందుకు పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనసంఘ్ కాలం నుంచే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో బిజెపికి బలమైన ప్రజాదరణ, క్షేత్రస్థాయి పట్టు ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రద్దయిన శాసనమండలిని పునరుద్ధరించాలని బిజెపి బలంగా డిమాండ్ చేసిందని, పార్లమెంటులో కౌన్సిల్ పునరుద్ధరణకు సంబంధించిన చట్టం ఆమోదం పొందడంలో బిజెపి మద్దతు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. 2015లో పట్టభద్రుల నియోజకవర్గంలో బిజెపి ఘన విజయం సాధించిందని, ఆ తర్వాతి ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ రాజకీయ, ఆర్థిక, అధికార యంత్రాంగాన్ని విస్తృతంగా వినియోగించినప్పటికీ బిజెపి గట్టిపోటీ ఇచ్చిందని అన్నారు. తదనంతరం జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాలు విద్యావంతులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో పార్టీకి ఉన్న మద్దతును ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులు, విద్యావంతులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని రాంచందర్రావు ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కారణంగా ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఉద్యోగులు, పట్టభద్రులు, నిరుద్యోగ యువతలో అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, పెన్షన్ సమస్యలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు అనేక వర్గాల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శించారు. తెలంగాణ సమాజం ఈ పరిణామాలను గమనిస్తోందని, ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును వెల్లడిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ప్రజలు కలలు కన్న ఆకాంక్షలు నెరవేరాయా అనే అంశాన్ని విద్యావంతులు, పట్టభద్రులు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాలకులను ప్రశ్నించి జవాబుదారీగా నిలబెట్టే బాధ్యత సమాజంలోని చైతన్యవంతులపై ఉందని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణకు ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులకు ఒక అవకాశం అని పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు ఎన్నికల్లో చురుకుగా పాల్గొని తమ గళాన్ని వినిపించాలని రాంచందర్రావు పిలుపునిచ్చారు.

