Gajendra Singh Shekawat

పర్యాటకులకు భారత్ అత్యంత సురక్షితం

Gajendra SinghShekawat‘అతిథి దేవో భవ’ అనే సంప్రదాయాన్ని విశ్వసించే భారత్.. దేశానికి వచ్చే అతిథులను గౌరవంగా, సురక్షితంగా చూసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఒంటరిగా ప్రయాణించే మహిళా పర్యాటకులకు కూడా భారత్ అత్యంత సురక్షితమైన దేశంగా నిలుస్తోందన్నారు. భారత్‌కు ఏటా సుమారు రెండు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారని, ఇలాంటి సందర్భంలో ఎక్కడో ఒకటి రెండు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే.. వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ కొన్ని మీడియా ఛానళ్లు టీఆర్పీల కోసం 24 గంటల పాటు ప్రసారం చేస్తుంటాయని పేర్కొన్నారు. దేశానికి వచ్చే ప్రతి పర్యాటకుడికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రతి సందర్శకుడికి సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక రంగ అభివృద్ధితో పాటు జెన్ జీ నిరసనలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు, పార్టీల ప్రధాన లక్ష్యం జెన్ జీ యువతను ఆకట్టుకోవడమే. ఇటీవల ‘అండర్-18 వరల్డ్’ వీడియోలో మీరు మిమ్మల్ని మీరు 15 ఏళ్ల కుర్రాడిగా భావిస్తూ కౌమారదశలో ఉన్న పిల్లలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మీలో ఈ మార్పునకు కారణమేంటి? ఇది జెన్ జీ గాలి ప్రభావమా?

జ: లేదు, అది అలాంటిదేమీ కాదు. ఆ పిల్లలు నా గదికి వచ్చారు. అందులో 16 ఏళ్ల ఒక బాలిక తనను తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా, అలాగే తనతో పాటు డిప్యూటీ సీఎం, స్పీకర్, ప్రతిపక్ష నేత, ప్రధాన కార్యదర్శి, 12 ఏళ్ల కార్యదర్శి ఉన్నారని పరిచయం చేసుకుంది. వారు నా వయస్సు ఎంత అని అడిగారు. నేను 58 అని చెప్పినప్పుడు, ఆ వయస్సు ఇక్కడ కుదరదని, తమతో సమానంగా ఉండాలని ఆమె చెప్పడంతో నేను 15 ఏళ్లవాడిగా ఉండటానికి అంగీకరించాను. పిల్లలతో మాట్లాడాలంటే వారి ఆలోచనా సరళికి మనం తగ్గాల్సిందే. ఇది యాదృచ్ఛికంగా జరిగింది తప్ప ముందస్తుగా అనుకున్న జెన్ జీ ట్రెండ్ ఏమీ కాదు.

ప్ర: అంటే జెన్ జీ యువతకు బాగా చేరువకావాలని పార్టీ తీసుకున్న కొత్త నిర్ణయంతో దీనికి సంబంధం లేదా?

జ: పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను సహజమైన ప్రక్రియగా చూస్తున్నాను. భారతదేశం యువత అధికసంఖ్యలో ఉన్న దేశం అని మనమందరం చెబుతుంటాం. నేటి యువతలో ఎంతో జిజ్ఞాస ఉంది, వారు దేశానిర్మాణంలో భాగస్వామ్యం కోరుకుంటున్నారు. మేం చిన్నతనంలో ఉన్నప్పుడు మా చదువులు, ఆటలు, స్నేహితులు తప్ప ఆలోచించేవాళ్లం కాదు. కానీ నేటి యువతకు అరచేతిలో సమాచారం అందుబాటులో ఉంది. ఇంతటి చైతన్యవంతమైన తరం వద్దకు మరింత శక్తితో చేరువ కావాల్సి ఉంటుంది. నేడు జెన్ జీగా ఉన్నవారే రాబోయే ఎన్నికల్లో ఓటర్లుగా మారతారు, కాబట్టి వారితో సంభాషణ ప్రారంభించడం అత్యంత అవసరం.

ప్ర: అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి భాషను సమర్థంగా మాట్లాడగలవని మీరు భావిస్తున్నారా?

జ: వారితో మన సంభాషణ నిరంతరం సాగే ప్రక్రియ. కానీ ఈ తరం, ముఖ్యంగా గడిచిన ఐదారు సంవత్సరాలలో, అపారమైన మార్పును అనుభవించింది. నేను ఒక గ్రామంలో జన్మించాను, విద్యుత్ లేని ఇల్లు చూశాను, కానీ ఇప్పుడు గ్రామాల్లోని పిల్లలు ఏఐ (కృత్రిమ మేధ) ని ఉపయోగిస్తుండటం చూస్తున్నాను. కాలేజీ రోజుల్లో కొత్త సమాచారం కావాలంటే లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చేది. ఈ రోజు కేవలం ఒక ప్రశ్న అడిగితే సరిపోతుంది. ఈ తరం సమాచారంతో నిండిపోయింది, కాబట్టి వారితో వ్యవహరించాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మార్పు అనే సునామీలో వంగే సామర్థ్యం కలిగిన చెట్లు మాత్రమే నిలిచి ఉంటాయి.

ప్ర: జెన్ జీ యువత ఉపాధి గురించి మాట్లాడుతోంది, పర్యాటకం, సంస్కృతి రెండూ వారి భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. వారి ఆందోళనలను పరిష్కరించడానికి మీరు ఏమి చేస్తున్నారు?

జ: మొత్తంగా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ గత 10-12 ఏళ్లలో రెండు ట్రిలియన్ల డాలర్ల (ట్రిలియన్ లక్షకోట్లు) నుంచి 4 ట్రిలియన్లకు పెరిగింది. మౌలిక సదుపాయాలు పెరిగాయి, ప్రయాణం సులభతరమైంది, పన్నులు తగ్గాయి, వేతనాలు పెరిగాయి, ఖర్చు చేయగల ఆదాయం పెరిగింది. ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ కూడా అందిస్తోంది, ఇది ఒక కుటుంబానికి నెలకు రూ 1,000-1,500 వరకు ఆదా చేస్తుంది. ఉజ్జయినిలోని మహాకాల్‌లో వార్షిక సందర్శకుల సంఖ్య 2014లో 40 లక్షల కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం 7 కోట్లకు పెరిగింది. కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యాటకమే కాదు, దేశీయ ప్రయాణాలు అపారంగా పెరిగాయి. గత ఏడాది ప్రజలు వేరే ప్రాంతాల్లో కనీసం ఒక రాత్రి విడిది చేసిన దేశీయ ప్రయాణాలు 420 కోట్లుగా నమోదయ్యాయి. భారతదేశంలో సంపన్నమైన సాంస్కృతిక విభిన్నత, చరిత్ర, స్మారక కట్టడాలు, అటవీ ప్రాంతాలు, వంటకాలు, దుస్తులు, సంగీతం ఉన్నాయి. నేడు పర్యాటకరంగం జీడీపీలో దాదాపు 6 శాతం వాటాను అందిస్తోంది, ప్రధాని మాకు 10 శాతాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే, వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించే రంగంగా పర్యాటకం నిలుస్తుంది.

ప్ర: ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి అంటే ప్రజల వద్ద వెచ్చించే ఆదాయం పెరిగిందనా, లేక ఆధ్యాత్మికత పెరిగిందనా? ఆధ్యాత్మికేతర పర్యాటకం కూడా ఇలాగే పెరిగిందా?

జ: ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యాటకం మాత్రమే కాదు. భారత్‌లో ఏ ప్రాంతానికి వెళ్లినా అతిపెద్ద సవాలు ‘ఓవర్ టూరిజం’ (అధిక సంఖ్యలో పర్యాటకుల రాక). ఆధ్యాత్మిక ప్రాంతం కాని కాశ్మీర్‌లో 2019, 2026 మధ్య 40,000 కొత్త గదులు అందుబాటులోకి వచ్చాయి, అయినప్పటికీ పహల్గామ్‌లో వేసవిలో కూడా గదులు దొరకడం కష్టమైంది. తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో పెరగడం వల్ల అన్ని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య పెరిగింది.

ప్ర: ప్రయాణానికి, ముఖ్యంగా విదేశీ పర్యాటకులు, ఒంటరి మహిళా ప్రయాణికులకు భద్రత అత్యంత కీలకం. భారత్‌లో వేధింపులు లేదా దొంగతనాలు జరిగితే, వారు ఆ చెడు అభిప్రాయంతోనే తిరిగి వెళ్తారు. భద్రతపై భరోసాకు మీరు ఏం చేస్తున్నారు?

జ: అలాంటి ఒక చిన్న సంఘటన జరిగినా అది దేశానికి మచ్చ తెస్తుంది. మొత్తంమీద దేశానికి 2 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. సాధారణంగా అందులో 50 శాతం మంది మహిళలే ఉంటారని నేను భావిస్తున్నాను. గత ఐదేళ్లలో అలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి? మీరు ఇటలీకి వెళ్తే, మీ విలువైన వస్తువులను బట్టల లోపల దాచుకోవాలని మీకు హెచ్చరిక ఇస్తారు. అమెరికాలోని న్యూయార్క్‌లో కూడా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ప్రధాన రహదారిని విడిచి సందుల్లోకి వెళ్లవద్దని చెప్పేవారు. అంతమాత్రాన అమెరికా సురక్షితం కాదని ఎవరైనా అంటున్నారా? అమెరికాలో నెలకు రెండు కాల్పుల సంస్కృతి సంఘటనలు జరుగుతాయి. ఇటీవల ఒక వ్యక్తి నరికిన భారతీయుడి తలతో ఫుట్‌బాల్ ఆడుతున్న దృశ్యాన్ని చూశాం. భారతదేశానికి రెండు కోట్ల మంది వస్తారు. ఎక్కడో రెండు సంఘటనలు జరిగితే, మన మీడియా ఛానెళ్లు టీఆర్పీల కోసం వాటిని 24 గంటల పాటు ప్రసారం చేస్తాయి. మన ప్రయాణికులకు భద్రత కల్పించడం మన బాధ్యత. భారత్ ‘అతిథి దేవో భవ’ అని నమ్మే దేశం. నేడు భారతదేశం ఒంటరి మహిళా ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన దేశమని నేను చెప్పగలను.

ప్ర: జీడీపీలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచే క్రమంలో, సంఖ్య పెరిగినప్పుడు రైల్వేలు, జాతీయ రహదారుల ద్వారా ఎంతమంది పర్యాటకులు ప్రయాణిస్తారనే దానికి స్పష్టమైన ప్రణాళిక ఉందా? ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పర్యాటకులు పెరగడం వల్ల తలెత్తే పర్యావరణ ఆందోళనల మాటేమిటి?

జ: అన్ని రంగాల్లోనూ సమానంగా వృద్ధి ఉంటుంది. గత 10 ఏళ్లలో భారత విమానయాన రంగం పెరిగిన తీరు, విమానాశ్రయాల సంఖ్య పెరిగిన విధానం మనకు తెలుసు. నేడు మనకున్న అతిపెద్ద సవాలు తక్కువ విమానాలు ఉండటమే. భారతీయ సంస్థలు- ఎయిర్ ఇండియా, ఇండిగో లేదా ఆకాసా – అన్నీ కలిసి ప్రపంచంలోనే అత్యధిక విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా భావించడం వల్ల భారతదేశంలో ఎక్కడికైనా తమ సొంత కార్లలో వెళ్తున్నారు. రోడ్డు నెట్‌వర్క్ విస్తరించింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ సమాన వేగంతో పెరుగుతాయి. సుస్థిరత పెద్ద సవాలు, ఇది ప్రపంచమంతటా జరుగుతోంది. పర్యాటకానికి సంబంధించిన అంతర్జాతీయ లేదా బహుళపక్ష వేదికలపై నేను ఎక్కడకి వెళ్లినా ఈ ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇతర దేశాలు వీసాల ద్వారా పర్యాటకుల సంఖ్యను నియంత్రించగలవు. కానీ భారతదేశంలో షిమ్లాకు వెళ్లేవారికి మనం అనుమతులు ఇవ్వాల్సి వస్తే అది సరైనది కాదు. దీనిని పరిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నగరాల్లో సాధారణ ప్రదేశాలకు అతీతంగా ఇతర ఆకర్షణలను సృష్టించడం. తీరప్రాంతాల్లో రద్దీని తగ్గించి, కొత్త అనుభూతులను అందించడానికి గోవా ‘గోవా బియాండ్ బీచెస్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ స్థాయికి చెందిన 50 కొత్త కీలక పర్యాటక ప్రాంతాలను నిర్మించాలనే ఆలోచనను ప్రధాని కూడా ముందుకు తెచ్చారు. అయితే, మనం 50 నిర్మించే నాటికి డిమాండ్ ఐదు రెట్లు పెరుగుతుంది కాబట్టి ఈ సమస్య అలానే ఉంటుందని నేను భావిస్తున్నాను.

మేం కేవలం లభ్యత వైపు మాత్రమే పనిచేయడం లేదు; డిమాండ్ వైపు కూడా పనిచేయడం ప్రారంభించాం. పర్యాటకుల ప్రవర్తన మరింత బాధ్యతాయుతంగా ఎలా ఉండగలదు? మనం వేరే దేశానికి వెళ్లినప్పుడు భారతీయులు వారంతట వారే బాధ్యతాయుతంగా మారుతారు. కానీ భారతదేశంలో ఇది మన హక్కు అని భావిస్తాం; ఇది మన దేశం, మనం ఏమైనా చేయవచ్చని అనుకుంటాం.

ప్ర: భారతదేశంలో ప్రయాణ వ్యయం ఎక్కువగా ఉండటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానం, ముఖ్యంగా హోటళ్లపై పన్నులు ప్రధాన కారణం. థాయ్‌లాండ్‌లో 5 శాతం ఉంటే మన దగ్గర 18 శాతం ఉంది. దీని గురించి మీరు ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారా?

జ: నేను వ్యక్తిగతంగా ఆర్థిక మంత్రికి లేఖ రాసి ఈ రంగానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. మా పోటీ దేశాలన్నింటి నుండి సమాచారాన్ని సేకరించి, జీఎస్టీ మండలి పరిగణనలోకి తీసుకోవడానికి ఆమెకు సమర్పించాను. కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం, లడఖ్, గోవా, అండమాన్ నికోబార్ దీవులకు ఒక్కో ఓటు ఉంటుంది. దీనిపై జిఎస్టీని పునఃపరిశీలించేలా ప్రతీ ఒక్కరూ తమ తమ ప్రాంతాల నుండి ఈ డిమాండ్‌ను జిఎస్టీ కౌన్సిల్‌‌కు తీసుకురావాలి.

ప్ర: జంతర్ మంతర్ నిరసన ప్రారంభమైనప్పుడు, మొదటి 20 రోజుల్లో ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు. ప్రభుత్వం స్పందించడంలో ఆలస్యం చేసిందని మీరు భావిస్తున్నారా?

జ: ప్రారంభంలో, ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఆధారాలు లేదా కారణాలు లేని ధర్నాగా చూసింది. కానీ అది విస్తరించి యువతను ఆందోళనకు గురిచేయడం, రాజకీయ పార్టీలు ప్రయోజనం పొందాలని చూడటంతో ప్రభుత్వ స్పందన అనివార్యమైంది. అండర్-18 వరల్డ్ పిల్లలు నన్ను ఒక ప్రశ్న అడిగారు- యువత నిరసనల తర్వాత రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంటులో పూలమాలలతో స్వాగతం ఎందుకు పలికారు? మీరు వారి గాయాలపై కారం చల్లుతున్నారా? అని అడిగారు. మీ ఇంట్లో ఎప్పుడైనా మారాం చేశారా? పిల్లవాడు చెప్పింది సరైనదని కాకపోయినా వారి భావోద్వేగాలను గౌరవించడం కోసం కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మాటను అంగీకరిస్తారని వివరించాను.

ప్ర: కానీ మీరు ఆయనను పూలమాలలతో ఎందుకు ఆహ్వానించారు?

జ: మా నాయకుడు పిల్లల పట్టుదలను అంగీకరించి రాజీనామా చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ 30 ఏళ్ల పాటు తన రాజకీయ ప్రాబల్యాన్ని నిర్మించుకున్న నాయకుడిలో మనోధైర్యాన్ని పెంపొందించడం మా బాధ్యత. ఆయనేమీ బలిపశువు కాదు. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారు, మా నాయకుడిని చూసుకోవడం మా బాధ్యత.

ప్ర: ఈ తరం ఆలోచనా ధోరణి స్థాయికి మనం తగ్గాలని మీరు అన్నారు, కానీ ‘పిల్లలను ముద్దు చేయడానికి’ ఒక మంత్రి రాజీనామా చేశారని మీరు చెప్పినప్పుడు, మీరు వారిని తక్కువ చేసి మాట్లాడటం లేదా?

జ: సత్యం సత్యమే. నేను మాట్లాడిన పిల్లలు చాలా తెలివైనవారు. వారు నన్ను ఒక కష్టమైన ప్రశ్న అడిగారు, నా సమాధానంతో వారు సంతృప్తి చెందారు.

ప్ర: కాశ్మీర్‌లో భద్రతా ఉల్లంఘన జరిగినప్పుడల్లా పర్యాటక ప్రాంతాలను రెండు మూడు నెలల పాటు మూసివేస్తారు. దానికి బదులుగా భద్రతా బలగాలను మోహరించకూడదా?

జ: పహల్గామ్ ఘటన జరిగిన రోజున భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, ప్రతి ప్రయాణికుడి భద్రతను మనం నిర్ధారించాలి. కాబట్టి పహల్గామ్ తర్వాత భద్రతా ముప్పు ఉండే ప్రదేశాలను మూసివేశాం. అంతమాత్రాన పర్యాటక అవకాశాలు హఠాత్తుగా తగ్గిపోయాయని కాదు; మనం 100 శాతం అనుభూతులను అందుబాటులోకి తేలేకపోవచ్చు, కానీ 70 శాతం అందుబాటులోనే ఉన్నాయి.

ప్ర: భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ) లో ఉన్న 8,000 పోస్టుల్లో 3,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, ఇది వారసత్వ పరిరక్షణను ప్రభావితం చేస్తుంది.

జ: ఏఎస్ఐలోని 3,000 ఖాళీలలో దాదాపు 80 శాతం మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎంటీఎస్ ఖాళీలు ప్రకటిస్తే, ప్రత్యక్ష ఎంపిక ఉన్నందున, ఎస్ఎస్‌సీ మాకు నివేదించి సంఖ్యలను ఇస్తుంది. కానీ ఒక వ్యక్తికి అస్సాంలోని ఒక క్షేత్రం భద్రత కోసం పోస్టింగ్ వచ్చిందని తెలిసినప్పుడు వారు ఉద్యోగంలో చేరరు. ఒకవేళ చేరినా దాదాపు ఏడు రోజులు మాత్రమే ఉంటారు. ఎవరో చేరడం, ఆపై ఇతర ప్రాంతాల్లో మంచి ఉద్యోగం రావడం వల్ల వారు వెళ్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఖాళీలు కొనసాగుతూనే ఉంటాయి. దానికారణంగా అక్కడ ఎవరూ పనిచేయడం లేదని కాదు. ఒప్పంద కార్మికులు ఇప్పటికే పనిచేస్తున్నారు. శాశ్వత ఉద్యోగి వచ్చినప్పుడు వారిని తొలగిస్తారు.