Draught Karuvu

20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా పట్టని రేవంత్ ప్రభుత్వం

తెలంగాణలో ఇప్పటికే సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నదుల నీళ్లన్నీ కండ్లముందే సముద్రంలో కలుస్తున్నా వాటిని ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపకుండా ప్రభుత్వం మొండికేయడంతో పంట పొలాలు నెర్రెలు బారుతున్నాయి. దానికి తోడుగా ఎల్ నినో ప్రభావం పెరగడంతో తెలంగాణలోని సాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోయి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, ఇప్పటివరకు కనీసం ఒక్కరంటే ఒక్క మంత్రిగానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేగానీ రైతుల వద్దకు వెళ్లలేదు, వారికి భరోసా కల్పించనూ లేదు. ఎన్నికల సమయంలో రైతులను రాజులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ తీరా అధికారంలోకి వచ్చాక తమను నట్టేట ముంచుతున్నదని రైతులు మండిపడుతున్నారు. ఒకవైపు సాగు నీళ్ల కొరత, మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది. కరువుతో పంటలు ఎండిపోవడంతో రైతులకు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ యూనివర్సిటీ లెక్కతేల్చింది. అయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలకు రావడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి కరువుపై అధికారులు, మంత్రులతో మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నప్పటికీ వారిని ఆదుకొనేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టడం లేదు. సాగునీరు లేక, అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. అవసరమైన నీరు అందకపోవడంతో పంట దిగుబడి తగ్గుతున్నది. ఈ ప్రభావంతో ఈ ఒక్క సీజన్‌లోనే రైతులకు భారీగా పంటనష్టం వాటిల్లుతున్నది.  పరిస్థితి ఇలానే ఉంటే నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అంత భారీ నష్టం వాటిల్లినా రైతులకు పరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వం మౌనంగానే ఉన్నది. ఇప్పటివరకూ పైసా పరిహారం ప్రకటించలేదు. కాస్త దూరం వెళ్లడానికి సైతం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. కానీ, పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు ఆర్థిక సాయం చేయడానికి మాత్రం ఆర్థిక పరిస్థితి అడ్డువస్తుంది. పరిహారం ఆర్థిక అంశంతో కూడినందున ఇవ్వలేకపోతున్నారు. రైతులను పలుకరించేందుకు ఏ ఆర్థిక అంశం అడ్డు వస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వర్షాభావం, వర్షానికి వర్షానికి మధ్య సుదీర్ఘ అంతరం ఉండటంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటలను తలకిందులు చేశాయి. చెరువులు ఎండిపోవడంతో ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. అలాగే బోరుబావుల్లోనూ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఫలితంగా వీటిపై ఆధారపడి నాటిన వరి పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ప్రస్తుతం ఇదే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 17 శాతం వర్షపాతం లోటు నమోదైంది.  ప్రాథమిక సమాచారం ప్రకారం 331 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆయనే స్వయంగా 13 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు తెలిపారు. కాది ఇది 16 లక్షల ఎకరాల వరకు ఉంటుందని వ్యవసాయశాఖ తేల్చింది. దీనికి తోడు మరో 4-5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సైతం ఎండిపోయినట్టు తేల్చింది. ఇక మిగిలిన పంటలు కలిపి మరో 2 లక్షల ఎకరాల వరకు ఉంటుందని అంచనా వేసింది.

నిరుటితో పోల్చితే ఈ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ముఖ్యంగా వరి సాగు భారీగా తగ్గింది. ప్రభుత్వం సీజన్‌ ముందు నుంచే వరి వేయొద్దని పిలుపునివ్వడంతో రైతులు దూరంగా ఉన్నారు. నిరుటితో పోల్చితే సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గడం గమనార్హం. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం ఈ సీజన్‌లో 1.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వీటిలో 56.79 లక్షల ఎకరాల్లో వరి, 48.33 లక్షల ఎకరాల్లో పత్తి, 5.93 లక్షల ఎకరాల్లో మక్క, 5.58 లక్షల ఎకరాల్లో కంది సాగయ్యాయి. గత ఏడాది 1.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా ఇందులో వరి 67.33 లక్షల ఎకరాలు, పత్తి 46 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నిరుటితో పోల్చితే ఈ సీజన్‌లో మొత్తం సాగు 7.39 లక్షల ఎకరాలు తగ్గింది. వరి 10 లక్షల ఎకరాలు తగ్గగా పత్తి మాత్రం 2.33 లక్షల ఎకరాల్లో పెరిగింది. ఇలా వరితో పాటు మొత్తం పంటల సాగు తగ్గించినా ప్రయోజనం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు స్వయంగా కొంత మేర సాగు తగ్గిస్తే ఇప్పుడు కరెంట్‌, నీటి కరువుతో అదీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 

ఉత్తర తెలంగాణలోని జిల్లాలతో పోలిస్తే, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంతటా కరవు ఛాయలు అలముకున్నాయి. ఈ జిల్లాలో సాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఎండల ధాటికి వాగులు, వంకల్లో ఉన్న ఊట నీరు కూడా ఆవిరైపోతుంది.

కృష్ణ చైతన్య