Modi at Bastar

అంతర్గత భద్రత బలంగా ఉంటేనే.. బాహ్య శత్రువులకు అడ్డుకట్ట!

Modi at Bastarఅంతర్గత భద్రత బలంగా ఉన్నప్పుడే దేశం బాహ్య శత్రువులను సమర్థంగా ఎదుర్కోగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో భద్రతా బలగాల పాత్ర సరిహద్దులను రక్షించే సైనికుల సేవలకు ఏమాత్రం తీసిపోదని ప్రధాని కొనియాడారు. సీఆర్‌పీఎఫ్, కోబ్రా, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, రాష్ట్ర పోలీసు బలగాలు, బస్తర్ ఫైటర్స్, మహిళా కమాండోలు చేసిన త్యాగాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో ఉన్న కోబ్రా ఆపరేషన్స్ బేస్‌లో భద్రతా బలగాలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. బస్తర్, అబూజ్‌మడ్ ప్రాంతాల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలకు శిక్షణా కేంద్రంగా, కార్యాచరణ స్థావరంగా పనిచేస్తున్న ఈ బేస్‌లో జవాన్లతో ముచ్చటిస్తూ వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నక్సలిజంపై దశాబ్దాల పోరాటంలో దేశం విజయం సాధించి, ప్రతి జిల్లాను నక్సల్ రహితంగా మార్చిన తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో 2026 పండుగ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయాన్ని సాధ్యం చేసిన భద్రతా సిబ్బందికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేయడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు.

ఒకప్పుడు దేశంలోని సుమారు 20 రాష్ట్రాల్లో 230కి పైగా జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉండేదని, నక్సలిజం కారణంగా ప్రజలు భయంతో జీవించాల్సి వచ్చేదని, ఓటు హక్కుకు సైతం దూరమయ్యారని అన్నారు. 2004-2013 మధ్య కాలంలో మావోయిస్టుల చేతిలో అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య, మరణించిన మావోయిస్టుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. 2014 తర్వాత నక్సలిజంపై పోరాటంలో వ్యూహాత్మక మార్పులు తీసుకొచ్చామని, భద్రతా బలగాలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కల్పించామని మోదీ తెలిపారు. నక్సలైట్లు, వేర్పాటువాదుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడంతో పాటు నకిలీ కరెన్సీ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేశామని చెప్పారు. గత ఏడాది విధి నిర్వహణలో ఒక్క సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోలేదని, 47 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారని వెల్లడించారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 15 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు, 9,500కు పైగా మొబైల్ టవర్లు, సుమారు 175 ఏకలవ్య పాఠశాలలు, 50 ఐటీఐలు, 50 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వేల సంఖ్యలో పోస్టాఫీసులు, బ్యాంకు శాఖలు, ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించడంతో పాటు పీఎం జన్‌మన్ పథకం ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు తొలిసారిగా తాగునీరు, విద్యుత్, రహదారి సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. బస్తర్‌లో వస్తున్న మార్పులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న బస్తర్ ఒలింపిక్స్ నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఒకప్పుడు హింస, భయంతో గుర్తింపు పొందిన ప్రాంతం నేడు క్రీడలు, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యానికి వేదికగా మారడం సానుకూల పరిణామమన్నారు.