BSK Raitu Deeksha

6 గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది 6 గురే

BSK Raitu Deeksha‘‘6 గ్యారంటీలను అమలు చేయడం మాకు చేతకాదు.. ఆదుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి లేఖ రాస్తే మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం’’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బిజెపికి లేదన్న బండి సంజయ్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ సర్కార్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా 6 గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది 6 గురు మాత్రమేనని చురకలంటించారు. బరాబర్ శ్రీరాముడి ఫోటోతో ఓట్లడుగుతాం… దమ్ముంటే బాబర్ ఫోటోతో ప్రచారం చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ ‘రైతు దీక్ష’ చేపట్టారు. ఈ దీక్షలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, రాణి రుద్రమ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి దీక్షకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా రూ.600 కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో యాడ్స్ ఇస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. సకాలంలో సర్కార్ సాగు నీరు వదలకపోవడంవల్ల రైతుల పంటలు ఎండిపోయినయ్… అకాల వర్షాలతో చాలాచోట్ల పంట నష్టం జరిగినా పైసా పరిహారమివ్వలేదు. ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాల్సిందే. వడ్లు సహా అన్ని పంటలకూ రూ.500 బోనస్ ప్రకటించాల్సిందే. కేంద్ర కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమ సాకుతో రైతులను దోచుకునే సంస్కృతికి పాతరేయాలి. పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొని తీరాల్సిందే… రుణమాఫీ చేస్తామని మాట తప్పడంతో రైతులు డిఫాల్టర్లుగా మారి అప్పులు పుట్టని స్థితికి దిగజార్చారు. రైతులు ఇంకెన్ని రోజులు అవమానంతో తలదించుకోవాలి? రైతు భరోసా కింద  రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వడం లేదు? రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది? పంటల బీమాను అమలు చేసి ఉంటే రైతులకు న్యాయం జరిగేది కదా? పరిహారమివ్వరు…పంటల బీమా అమలు చేయకపోతే రైతులు బతికేదెట్లా? నష్టపోయిన రైతులంతా కన్నీరు పెడుతున్నా పట్టించుకోరా? పార్టీలోని గేట్లు ఎత్తడం కాదు… సాగునీటి ప్రాజెక్టులు ఎత్తి నీళ్లివ్వండి..

పట్టణాల్లో మంచి నీటి కొరత ప్రారంభమైనా పట్టించుకోరా? కేసీఆర్ ఫాంహౌజ్ నుండి రాజకీయాలు చేస్తే… కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నరు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ రైతులను మోసం చేసిన పార్టీలే. రైతులకు అడుగడుగునా అండగా ఉంటూ పోరాడుతున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే. 2014లో వడ్ల మద్దతు ధర రూ.1300 ఉంటే… నేడు రూ.2200లు చేసిన ఘనత మోదీదే. యూరియా, డీఏపీ, పొటాష్, ఎన్పీకే ఎరువులకు భారీ ఎత్తున సబ్సిడీలిస్తూ రైతులను ఆదుకుంటున్న నాయకుడు మోదీ. మూసివేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6350 కోట్లు కేటాయించి తెరిపించింది మోదీ. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎకరాకు రూ.6 వేల సాయం చేస్తోంది కేంద్రమే. పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఎరువుల సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదముంది.’’ అని అన్నారు.

ప్రజల పక్షాన, రైతుల పక్షాన దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేయడం మాకు కొత్త కాదని, గత ప్రభుత్వం రైతులు సహా అన్ని వర్గాలకు చేసిన ద్రోహంపై అనేక రూపాల్లో కొట్లాడామని గుర్తు చేశారు. వందల కేసులు పెట్టి లాఠీఛార్జీ చేసి జైలుకు పంపినా భయపడలేదని చెప్పారు.