BJP Manifesto

బిజెపి మేనిఫెస్టో ‘మోదీ కీ గ్యారెంటీ’ విడుదల

BJP Manifesto releaseవచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ‘మోదీ కీ గ్యారెంటీ 2024’ పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీనిని ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో రూపొందించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు సూచనలు పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీనిని రూపొందించారు.

నాలుగు స్తంభాలపై మేనిఫెస్టో: మోదీ

కీలకమైన నాలుగు స్తంభాలపై బిజెపి మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను తయారు చేశామని ప్రధాని మోదీ అన్నారు. గరీబ్‌, యువశక్తి, అన్నదాత, నారీశక్తిని దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారని చెప్పారు. దేశ యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. అంబేడ్క్‌ర్‌ జయంతి రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. చైత్ర నవరాత్రులు కొనసాగుతున్న సమయంలో ఆవిష్కరించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. బిజెపి మేనిఫెస్టో కోసం యావత్తు దేశం వేచిచూసిందని మోదీ అభివర్ణించారు. పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతే అందుకు కారణమన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం చేసిన కృషిని అభినందించారు. దేశం నలుమూలల నుంచి సలహాలు, సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, అంకురాలకు మద్దతు, వివిధ రంగాల్లో గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటుపై ‘సంకల్ప పత్ర’లో దృష్టి సారించామన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. వారందరూ మరింత ఉన్నతస్థితికి చేరేందుకు మద్దతు కొనసాగిస్తామన్నారు.

పేదల కోసమే బిజెపి సర్కార్‌: నడ్డా

ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పదేళ్లుగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని బిజెపి జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా అన్నారు. వచ్చే ఐదేళ్లు కూడా దాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజు మేనిఫెస్టోను విడుదల చేయడం సంతోషంగా ఉందని నడ్డా అన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన సూచించిన మార్గంలోనే తమ పార్టీ నడుస్తోందన్నారు. 2014లో అధికారంలోకి రాగానే బిజెపి సర్కార్‌ పేదల కోసమే పని చేస్తుందని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లు ఎలా పనిచేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుందన్నారు.

మోదీ హామీలను ప్రజలు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా భావిస్తున్నారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. అధికరణ 370 రద్దు, రామమందిర నిర్మాణం సహా పదేళ్లలో అనేక అభివృద్ధి పథకాలు చేపట్టామన్నారు.

బిజెపి మ్యానిఫెస్టోలో చెప్పిన ముఖ్యాంశాలు

  1. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌ పంపిణీ కొనసాగిస్తాం. పేదలకు ఆకలి బాధలు లేకుండా చూస్తాం.
  2. స్వచ్ఛమైన తాగునీరు మరియు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద జీరో విద్యుత్ బిల్లులతో నాణ్యమైన గృహాలను అందిస్తాం.
  3. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాలు మరియు ఆరోగ్య మందిరాలను బలోపేతం చేయడం ద్వారా పేదలకు ఉచిత వైద్య సదుపాయం కొనసాగిస్తాం.
  4. బస్తీ (స్లమ్) ప్రజలకు నాణ్యమైన గృహాలను అందిస్తాం.
  5. సొంతింటి కలను నెరవేరుస్తాం.
  6. AIIMS, మెడికల్ కాలేజీలు, జన్ ఔషది కేంద్రాలు, ఆయుష్, యోగా ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తాం, IITలు, IIMలు, AIIMS వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలను విస్తరణ, విశ్వవిద్యాలయాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను ప్రోత్సహిస్తాం.
  7. మూడు కోట్ల మంది గ్రామీణ మహిళలు లక్షాధికారులుగా (లఖ్ పతి దీదీలు) మారేందుకు వారికి సాధికారత కల్పిస్తాం మరియు కీలక సేవలలో నైపుణ్య శిక్షణతో SHGలకు సాధికారత కల్పిస్తాం, ODOP, ఏక్తా మాల్, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్‌ ద్వారా వారికి మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తాం.
  8. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించేందుకు నారీ శక్తి వందన్ అధినియం అమలు చేస్తాం.
  9. పేపర్ లీక్‌లను నిరోధించడానికి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ పారదర్శకంగా ప్రభుత్వ ఖాళీల భర్తీని కొనసాగిస్తాం…
  10. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడం, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌ను అధిక-విలువ సేవలకు, ఉపాధి అవకాశాలకు హబ్ గా మారుస్తాం..
  11. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ యోజనను విస్తరిస్తాం.
  12. తపాలా మరియు డిజిటల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని సామాజిక భద్రతా ప్రయోజనాలు మరియు ప్రభుత్వ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూస్తాం..
  13. పీఎం కిసాన్ మరియు పీఎం ఫసల్ బీమా యోజన కింద నిరంతర ఆర్థిక సహాయం అందిస్తాం.
  14. తృణధాన్యాలను సూపర్‌ఫుడ్‌గా ప్రచారం కల్పిస్తాం మరియు భారత్‌ను ప్రపంచ తృణధాన్యాలకు కేంద్రంగా (గ్లోబల్ మిల్లెట్ హబ్‌) చేస్తాం.
  15. పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం… ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వంటి వ్యాధులను నివారిస్తాం…
  16. ఫిషింగ్ ఓడలకు బీమా సదుపాయంతో PM మత్స్య సంపద యోజనను పొడిగిస్తాం… మౌలిక వసతుల అంతరాలు తగ్గిస్తాం..
  17. ప్రాసెసింగ్ క్లస్టర్‌లను అభివృద్ధి చేయడం ద్వారా… ముత్యాల సాగు (పెర్ల్ ఫార్మింగ్) మరియు సముద్రనాచు (సీవీడ్) పెంపకం వంటి ఇతర కార్యకలాపాలను ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం…
  18. గిగ్ వర్కర్లు, ఆటో, టాక్సీ, ట్రక్, ఇతర డ్రైవర్లు సహా ప్రతి కార్మికుడిని ఇ-శ్రమ్ కింద నమోదు చేస్తాం… అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తాం..
  19. చిన్న వ్యాపారులు మరియు MSMEల వృద్ధికి తోడ్పడేందుకు మూలధన పెట్టుబడి (వర్కింగ్ క్యాపిటల్) కోసం డిజిటల్ క్రెడిట్ సొల్యూషన్స్.
  20. వినియోగదారులకు, ముఖ్యంగా MSMEలు మరియు చిన్న వ్యాపారులు యక్సెస్ చేసేలా GST పోర్టల్‌ను సరళీకృతం చేస్తాం.
  21. విశ్వకర్మ కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను బలోపేతం చేస్తాం.
  22. MSMEలు, చిన్న వ్యాపారులు మరియు విశ్వకర్మ కుటుంబాలు సులభంగా ఎగుమతులు చేసేలా డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాల (పోస్టాఫీస్ ఎక్స్ పోర్ట్ సెంటర్) నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తాం.
  23. గిరిజన పరిశోధనా సంస్థలకు నిధులు పెంచి, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంలను ఏర్పాటు చేసి, 2025 సంవత్సరాన్ని జనజాతీయ గౌరవ్ వర్ష్‌గా ప్రకటించి, గిరిజనుల భాషలు, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తాం, సంరక్షిస్తాం.
  24. ముద్రా రుణం పరిమితి రెట్టింపు, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ యోజన పథకాల విస్తరణ వంటి చర్యల ద్వారా OBC, SC & ST వర్గాల జీవనోపాధిని పెంచుతాం
  25. ABHIM ద్వారా AIIMS, జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేయడం మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అన్ని స్థాయిల ఆరోగ్య సంరక్షణ సంస్థలను అభివృద్ధి చేస్తాం.
  26. 7 IITలు, 16 IIITలు, 7 IIMలు, 15 AIIMS, 315 మెడికల్ కాలేజీలు మరియు 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పిన మా రికార్డుతో మరిన్ని ఉన్నత విద్యా సంస్థలను స్థాపిస్తాం.
  27. భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం..
  28. భారత్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చుతాం… ఉపాధిని మెరుగుపరుస్తాం మరియు EV, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, చిప్‌మేకింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో హైటెక్ తయారీలో ముందంజ వేస్తాం.
  29. వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించడానికి రైల్వేల సామర్థ్యాన్ని పెంచుతాం మరియు వందే భారత్, అమృత్ భారత్ నమో భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టి రైల్వేను ఆధునీకరిస్తాం.
  30. ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను 15,000 కి.మీలకు విస్తరించడంతోపాటు మారుమూల ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను విస్తరిస్తాం.
  31. ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి మరియు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యల ద్వారా 2047 నాటికి ఎనర్జీ ఇండిపెండెన్స్ (ఇంధన స్వేచ్ఛ) సాధిస్తాం.
  32. ప్రపంచవ్యాప్తంగా తిరువల్లువర్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
  33. వివిధ సమస్యలను వినిపించేందుకు మరియు సంక్షోభాలలో మొదటి ప్రతిస్పందనదారుగా విశ్వసనీయ ప్రపంచ భాగస్వామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తాం.
  34. తీవ్రవాద గ్రూపులు, వామపక్ష తీవ్రవాద సంస్థలు, ఇతర బాహ్య మరియు అంతర్గత భద్రతా ముప్పులకు వ్యతిరేకంగా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటూ భారత రక్షణను కొనసాగిస్తాం.
  35. కాశీ విశ్వనాథ్ కారిడార్ స్థాయిలో మరిన్ని అధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలను అభివృద్ధి చేస్తాం.
  36. భారతీయ సంస్కృతి కోష్ ద్వారా ప్రాచీన భారతీయ నాగరికత రక్షణ మరియు పరిరక్షణ కొనసాగిస్తాం.
  37. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) తీసుకొస్తాం.
  38. భారతీయ న్యాయ్ సహిత త్వరితగతిన అమలు చేస్తాం.
  39. ఒక దేశం, ఒకే ఎన్నికలను వాస్తవ రూపం దాల్చుతాం.