G Kishan Reddy

తెలంగాణకు కేంద్ర నిధులపై అర్థవంతమైన చర్చకు సిద్ధం

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అవాస్తవాలు, నిరాధార ఆరోపణలు, గోబెల్స్ ను మించిన దుష్ప్రచారం వెల్లువెత్తి, ప్రజలను గందరగోళ పరుస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య అర్థవంతమైన చర్చ జరగాలన్న సానుకూల సంప్రదాయం నెలకొల్పేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. 2004-2014 కాలంలో యూపీఏ హయాంలో, 2014-24 కాలంలో ఎన్డీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన కేంద్ర నిధుల విషయమై అర్థవంతమైన చర్చకు ఆహ్వానిస్తూ మే 11న  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి జి. కిషన్ రెడ్డి లేఖ రాశారు. తేది, సమయం, వేదిక చెప్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 

‘‘ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం అన్ని పార్టీలకు కల్పించింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసుకునే హక్కు కూడా పార్టీలకు ఉంది. ఈ ప్రచారంలో తాము సాధించిన ఘనతలు చెప్పుకోవచ్చు, గెలిస్తే ఏం చేస్తామనే హామీలు ఇవ్వవచ్చు, ఇంకా ప్రత్యర్థి పార్టీల లోపభూయిష్ట విధానాలనూ, తత్ఫలితంగా ఏర్పడిన దుష్పరిణామాలనూ ఎండగట్టవచ్చు. ఈ క్రమంలో సరైన సమాచారం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టి, తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరవచ్చు. ఇది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం లక్షణం. వాస్తవాలకు బదులుగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లడం, వారి నిర్ణయాన్ని ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం.

2014 ముందు వరకు కాంగ్రెస్ ఎన్నో పర్యాయాలు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా ఆ కాలంలో సాధించిన ఘనతలు, విజయాలు, సానుకూల ఫలితాలను ప్రచారం చేసుకోవచ్చు. కావాలంటే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలన వైఫల్యాలను, ప్రతికూలాంశాలను విమర్శించవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీరు, మీ మంత్రులు, మీ అభ్యర్థులు, మీ నాయకులు ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం దురదృష్టకరం. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది, సామాజిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.

2014-24 కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భాగస్వామిని అయిన కేంద్రమంత్రిగా నేను వ్యక్తిగతంగానూ తీవ్రంగా ఖండిస్తున్నాను.

మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులను ఇచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కింద రూ.2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. 2004-14 కాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ.45,000 కోట్లు మించదు. 2014 ముందు పదేళ్లతో పోలిస్తే, తర్వాత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 నుంచి 2014 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2500 కి.మీ జాతీయ రహదారులు నిర్మిస్తే, మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గత 10 సంవత్సరాల కాలంలో రూ.1.09 లక్షల కోట్లకు పైగా వెచ్చించి కొత్తగా మరో 2500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించారు. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణతో రైతుల ఎరువుల కొరతను తీర్చడమే కాకుండా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించింది. 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేయాలని కోరితే నాటి మన్మోహన్ ప్రభుత్వం తిరస్కరించింది. కానీ మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసి, నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2014 ముందు అటకెక్కించిన, నిధులు కేటాయించని ఎన్నో ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తయి, ప్రజలకు సేవలు అందిస్తోన్న ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఇందుకు ఒక ఉదాహరణ. హార్టికల్చర్ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ తదితర కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు గత 10 సంవత్సరాల్లో రూపుదిద్దుకొని ప్రజలకు సేవలందిస్తున్నాయి. మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, పసుపు బోర్డు వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఎన్నో నిర్మాణ దశలో ఉన్నాయి, అవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంకా కోవిడ్ సమయంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ సహా అనేక రకాలుగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కేంద్రం సహాయం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ అని అనడం పూర్తిగా అబద్ధాలను వ్యాప్తి చేయడమే. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మీ స్థాయినే కాదు, ముఖ్యమంత్రి పదవినే దిగజార్చుతుంది.

ఈ నేపథ్యంలో అర్థవంతమైన చర్చతో ప్రజల ముందు వాస్తవాలు ఉంచేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 2014-24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందనే అంశంపై నేను… 2004-2014 కాలంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంతానికి ఏమిచ్చిందనే దానిపై మీరు… ఆధారాలు, అంకెలు, డేటా సహకారంతో నిర్ధారిత వాస్తవాలతో ప్రజల ముందు అర్థవంతంగా చర్చిద్దాం. గత 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ.9 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. నా ఈ ప్రకటనను విభేదిస్తే చర్చకు రండి¡

కొడంగల్ లో అయినా సరే… అమరవీరుల స్తూపం వద్ద అయినా… తెలంగాణ జీవధార అయిన కృష్ణా, గోదావరి ఒడ్డున అయినా సరే… స్థలం, సమయం, తేది మీరే నిర్ణయించండి. నిర్ధారిత వాస్తవాలతో మీతో అర్థవంతమైన చర్చ జరిపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నాదొక షరతు లేదా అభ్యర్థన. అదేంటంటే ఈ చర్చ సందర్భంగా మనం ఉపయోగించే భాష అసభ్యకరంగా కాకుండా, హుందాగా ఉండాలని కోరుతున్నాను.

ప్రజల ముందు వాస్తవాలను ఉంచేందుకు నేను ప్రతిపాదిస్తున్న ఈ అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను. తద్వారా మనం ఒక మంచి సాంప్రదాయానికి తెర తీసినవారమవుతాం.’’ లేఖలో పేర్కొన్నారు. సదుద్దేశ్యంతో కిషన్ రెడ్డి అర్థవంతమైన చర్చకు ప్రతిపాదించినప్పటికీ రేవంత్ రెడ్డి నుంచి స్పందన రాకపోవడం దురదృష్టకరం.