Modi Karimnagar

ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులు

Modi Karimnagar‘ఇండీ కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు. ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా? భారత్‌ అభివృద్ధి చెందుతుందా’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘పది మంది రైతులు నీళ్ల కోసం బోరు వేసుకోవాలని అనుకున్నారు. నీళ్లు ఎక్కడ ఉంటాయో అన్వేషించారు. చివరకు ఒకరి పొలంలో వంద మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. వంద మీటర్ల పైపు వేస్తే నీళ్లు వస్తాయి. కానీ ఆ రైతులు ఎవరి పొలంలో వారు పది మీటర్ల పైపు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇండీ కూటమిలో నేతలు ఇలానే ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. మే 8న ఆయన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని వేములవాడలో, వరంగల్‌ నియోజకవర్గం పరిధిలోని ఖిలావరంగల్‌ మండలం లక్ష్మీపురంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడారు. ‘చర్మం రంగు ఆధారంగా ప్రజల యోగ్యతను నిర్ణయిస్తారా? అలా నిర్ణయించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? నా దేశ ప్రజల్ని అవమానిస్తే ఒప్పుకొనేదిలేదు. నన్ను నిందించండి సహిస్తా… చర్మం రంగు ఆధారంగా నా దేశ ప్రజల గౌరవాన్ని నిర్ణయిస్తే ఎంతమాత్రం సహించను’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘2014లో ప్రజలు నాకు దేశానికి సేవ చేసే అవకాశం కల్పించారు. మొదటిసారి అవకాశం వస్తే దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. రెండోసారి అవకాశం ఇస్తే ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఈ రెండింటిని కాంగ్రెస్‌ పూర్తిగా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌కు ముర్ముపై ఎందుకంత కోపం అని ఆలోచిస్తూ ఉండేవాడిని. చాలా రోజులు నాకు అర్థంకాలేదు. ఈ రోజు నాకు అర్థమైంది. అమెరికాలో ఉండే ఓ అంకుల్‌ రాకుమారుడికి ఫిలాసఫర్‌, గైడ్‌. రాకుమారుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన సలహాలు తీసుకుంటారు. ఆ ఫిలాసఫర్‌ ఒక రహస్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎవరి రంగు అయితే నల్లగా ఉంటుందో వారంతా ఆఫ్రికా సంతతి అని. ఆ రంగు అంటే వారికి నచ్చదు. అందుకే ద్రౌపదీ ముర్మును ఓడించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? నల్లరంగులో ఉన్న శ్రీకృష్ణుడిని మనం పూజిస్తాం కదా’’ అని మోదీ అన్నారు.

ఒట్టు పెడతారు… సనాతన ధర్మాన్ని తిడతారుblurb01

‘‘కాంగ్రెస్‌ అబద్ధాల మాస్టర్‌. ఈ అంశం తెలంగాణ ప్రజలకు తెలిసినట్లు వేరెవరికీ తెలియదు. ఆ పార్టీ అతిపెద్ద నేత జన్మదినం రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 15కు పొడిగించారు. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. తర్వాత చేతులెత్తేస్తారు. వేములవాడ రాజన్నపై ఒట్టు పెడతారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడతారు. మరి వీళ్ల ఒట్లను ఎలా నమ్మాలి? తెలంగాణలో విద్యుత్‌ కోతలు ఎంతగా పెరిగాయంటే ప్రజల జీవనమే కష్టంగా మారింది.blurb02 ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజంలో ప్రతిభావంతులైన యువత అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. కేంద్ర ప్రభుత్వం సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. 2014లో బీఆర్ఎస్.. దళితుణ్ని సీఎం చేస్తామని చెప్పి ఎవర్ని చేసిందో అందరికీ తెలుసు. దళితబంధు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసింది. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింల కోసం ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫ్యామిలీ ఫస్ట్‌ అనే లక్ష్యంతోనే కాంగ్రెస్ నాడు ప్రధాని పీవీని అవమానించింది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్‌ కార్యాలయానికి తీసుకురానీయలేదు. పీవీకి ఎన్డీయే భారతరత్న ఇచ్చి గౌరవించింది.

మే 13న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పండి. కరీంనగర్‌లో బండి సంజయ్‌ గెలుపు ఎప్పుడో నిర్ణయమైంది. పార్టీ అభ్యర్థులు బండి సంజయ్‌, గోమాసె శ్రీనివాస్‌(పెద్దపల్లి), గోడం నగేశ్‌(ఆదిలాబాద్‌), అరూరి రమేశ్‌(వరంగల్‌), సీతారాంనాయక్‌(మహబూబాబాద్‌)లకు వేసే ఓటు నేరుగా మోదీకి చేరుతుంది. వరంగల్‌ ఎప్పుడూ బిజెపికి మద్దతుగా నిలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ గుప్పిట నుంచి వరంగల్‌ను బయటకు తీసుకురావాలి’’ అని మోదీ అన్నారు.