Alleti Maheshwar Reddy

ఆరోపిస్తే కేసులు.. ఇదేం ప్రజా పాలన?

ప్రశ్నిస్తే కేసులు… ఆరోపిస్తే అరెస్టులు… ఇదీ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరి. ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు కాంగ్రెస్ ను గద్దెనెక్కించారో… అదే నియంతృత్వ బాటలో ప్రస్తుత రేవంత్ సర్కార్ నడుస్తోంది. బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తే, సమాధానం చెప్పకుండా, పైగా ఆయనపైనే కేసులు బనాయిస్తోంది. ప్రజా పాలన అని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ రాక్షస పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో రైతులు తమ పంటను స్వేచ్ఛగా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా క్షోభ పెడుతోంది. వరి ధాన్యం కొనుగోళ్లలో 40 కిలోల బస్తాకు 4 కిలోల చొప్పున అదనంగా కాంటా పెట్టి రైతులను దోచుకుంటున్నారు. తాలు, తేమ పేరుతో ప్రతి బస్తాకు 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ క్వింటాలుకు 10-15 శాతం ధాన్యాన్ని కొల్లగొడుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా, సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్‌ దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా స్పందన లేదు.

రైతుల నుంచి అధికంగా కాంటా జోకుతున్న ధాన్యం ఎవరి ఖాతాలోకి చేరుతోంది..? తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతోంది. ఇందులో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి అధికంగా కాంటా చేస్తున్నారు. రైతుల నుంచి కొల్లగొడుతున్న రూ.1600 కోట్ల విలువైన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తోంది..? ఇందులో అధికారులు, సంబంధిత మంత్రి వాటా ఎంత…? ఈ ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రంలో కొత్తగా యూ-ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రూ.500 కోట్లు చేతులు మారాయని, అందులో నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల ఖర్చు కోసం రూ.100 కోట్లు దిల్లీ అధిష్టానానికి పంపించారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఈ యూ-ట్యాక్స్ స్కాం ఒకటని అభివర్ణించారు.

తన ఆరోపణలకు బలంగా జనవరి 25న టెండర్ల కోసం కమిటీ వేశారని, ధాన్యం సేకరణకు మార్గదర్శకాలు సిద్ధం చేశారని, అదేరోజు గ్లోబల్ టెండర్లకు ప్రకటన చేశారన్నారు. ఒక్క రోజులోనే కమిటీ ఏర్పాటు, సమావేశం, మార్గదర్శకాల రూపకల్పన, అదే రోజు టెండర్లకు ప్రకటన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. టెండర్ లలో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వారిని సైతం బెదిరించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఏప్రిల్ 18న హైదరాబాద్ జలసౌధలో రైస్ మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ప్రతి క్వింటాల్ కు రూ. 216 రూపాయలు అదనంగా మిల్లర్ల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు. మిల్లర్లు బియ్యం ఇస్తామన్నా, వద్దు డబ్బులే ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలులో రూ.800కోట్ల అవినీతి జరిగిందన్నారు.

ఒప్పందం ప్రకారం మే 23లోగా మొత్తం ధాన్యం సేకరించాలి. లేకుంటే సదరు కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు. అయితే గడువు ముగిసినా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా పొడిగింపు ఇచ్చారు. 1లక్షా 59వేల మెట్రిక్ టన్నుల బియ్యం క్వింటాలుకు రూ. 2259 చొప్పున అమ్మి, మధ్యాహ్న భోజనం, హాస్టల్ లలో విద్యార్థుల కోసమంటూ రూ.5700లకు తిరిగి సన్నబియ్యం ఎందుకు కొన్నారని అడిగారు. ఇలా తక్కువ ధరకు అమ్మి, ఎక్కువ ధరకు కొనడంలో మతలబేంటని ప్రశ్నించారు. ఈ అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తున్నట్టే సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

మహేశ్వర్ రెడ్డి సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశాడు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయించి, ఆయనపై కేసులు పెట్టించారు. అయితే, ‘‘ప్రజల కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా భయపడేది లేదు. ప్రజాసేవ మీద మక్కువతో ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చాను. సమాధానం చెప్పాల్సిన మంత్రి నాపై కేసులు పెట్టడం దారుణం. ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం.’’ అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

రైతు సమస్యలు పరిష్కరించాలి

Vinati Patram

ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరుతూ మే 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా అమలు కావడం లేదని, తడిసిన ప్రతీ ధాన్యం గింజ ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని, మూడు నుంచి నాలుగు కిలోలు అదనంగా ధాన్యం తీసుకొంటున్నారని అన్నారు. కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన రైతుబంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతు రుణమాఫీ చేయాలన్నారు. కేవలం రైతుల అంశాలను మాత్రమే కాకుండా ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. మా వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే బిజెపి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. బిజెపి దేశంలో పదేళ్ళుగా సుస్థిర పాలన అందిస్తుందని, మూడోసారి మోదీ నాయకత్వంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు.

కిశోర్