Nitin Nabin Padayatra

అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్న రాహుల్

Nitin Nabin Delhi Padayatraకాంగ్రెస్, రాహుల్ గాంధీ వారసత్వ రాజకీయాలతో పాటు అరాచక ధోరణులను ప్రోత్సహిస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అర్హులైన భారతీయుల పేర్లను చేర్చడంతో పాటు, చొరబాటుదారుల పేర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 28న దిల్లీలో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి – అరాచకత్వాన్ని అంతం చేయండి’ మహా పాదయాత్రలో నితిన్ నబీన్ పాల్గొన్నారు. పురాతన జైన్ లాల్ మందిర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో దిల్లీ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఎంపీలు ప్రవీణ్ ఖండేల్వాల్, రామ్‌వీర్ సింగ్ బిధూరీ, మంత్రి పరివేష్ వర్మ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా‌‌ ప్రక్షాళన తప్పనిసరి

ఓటర్ల జాబితాల ప్రక్షాళనను కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని నబీన్ ఆరోపించారు. దీపావళి సందర్భంగా వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను పరిశీలించి నకిలీ నమోదులను తొలగించినట్లే, ఓటర్ల జాబితాను కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఖాతా పుస్తకం వంటిదని, అర్హులైన ప్రతి భారతీయుడి పేరు అందులో ఉండాలని, చొరబాటుదారుల పేర్లు తొలగించాలని స్పష్టం చేశారు. మరణించిన వారి పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం, ఆచూకీ తెలియని కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో ఉండటం వంటి లోపాలను సరిదిద్దే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో ఆచూకీ లభించని మూడు కోట్ల మంది పేర్లపై రాహుల్ గాంధీ ఎందుకు ఆందోళన చెందుతున్నారని నబీన్ ప్రశ్నించారు. చొరబాటుదారులపై కాంగ్రెస్‌కు ఎందుకంత మమకారమని నిలదీశారు. భారతదేశంలోని 140 కోట్ల మంది పౌరులపై నమ్మకం లేక బయటి వ్యక్తుల ఓట్లపై ఆధారపడాలని చూస్తోందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించి, వాటిపై చర్చకు నిలబడకుండా వెనుదిరుగుతున్నారని విమర్శించారు. మీడియా ముందు ప్రెజెంటేషన్లు ఇవ్వడం తప్ప, వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదన్నారు. ఆయన చేసే ప్రతి ప్రకటనకు సమాధానం చెప్పే సత్తా బిజెపి మండల స్థాయి అధ్యక్షుడికి సైతం ఉందని వ్యాఖ్యానించారు. 

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నిజమైన గౌరవం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఒక కుటుంబం తీసుకునే నిర్ణయాలే పార్టీ నాయకులందరికీ శిరోధార్యంగా మారాయని ఆరోపించారు. ఈ కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పతనానికి కారణమవుతున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను 90కి పైగా సందర్భాల్లో రద్దు చేసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజలు ప్రతిసారీ ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్‌కు తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు.జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మహిళల పట్ల అనుచిత ప్రవర్తన చోటుచేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఒకప్పుడు ‘కాంగ్రెస్ (ఇందిర)’గా గుర్తించినప్పటికీ, ఇప్పుడు అది ‘ఇటాలియన్ కాంగ్రెస్’గా మారిందంటూ నబీన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇతరులపై నిందలు వేయడమే ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారని, బిజెపి కార్యకర్తలు మాత్రం ప్రజల మధ్యకు వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహించారని నబీన్ అన్నారు. త్రివర్ణ పతాకం గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు గతంలో కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేయడానికి బిజెపి కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 2011లో బిజెపి చేపట్టిన తిరంగా యాత్ర సందర్భంగా లాల్‌చౌక్‌లో పాకిస్థాన్ జెండాలు ఎగురుతున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని ఆరోపించారు. నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి రాజధాని వరకు త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడుతోందన్నారు.

‌‌2029లోనూ మోదీనే ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ 2029లోనూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, వారసత్వ పరిరక్షణ దిశగా ముందుకు సాగుతుండటం కాంగ్రెస్‌లో అసహనాన్ని పెంచుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం వల్లే పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. బిజెపి సిద్ధాంతాన్ని, దేశ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోలేవని స్పష్టం చేశారు. 2013 నాటి నిరాశానిస్పృహల నుంచి బయటపడిన దేశ యువత నేడు కొత్త ఆశలు, విశ్వాసంతో మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నా యువత వాస్తవాలను గుర్తిస్తోందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని నితిన్ నబీన్ తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అవరోధాలను ప్రజల ఆశీస్సులతో అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీధుల్లో జరిగే నిరసనలతో పాటు చట్టసభల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కూడా సమర్థంగా సమాధానం చెప్పేందుకు బిజెపి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు.