Amit Shah Padayatra

ప్రతి చొరబాటుదారుడినీ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తాం!

SIR Padayatraదేశంలో అక్రమంగా చొరబడిన ప్రతి చొరబాటుదారుడినీ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని, దేశం నుంచి బయటకు పంపిస్తామని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బోగస్‌ ఓట్లు, చొరబాటుదారుల ఓట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో తొలగించిన ఓట్లలో మూడు కోట్లు అక్రమ వలసదారులవేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. వారంతా బంగ్లాదేశ్‌ చొరబాటుదారులని, వారిలో ఒక్కరికీ ఓటు హక్కు దక్కనివ్వబోమని ప్రకటించారు. ”ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం” నినాదంతో నవంబర్ 2న బిజెపి తెలంగాణ హైదరాబాద్‌లో మహా పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఓ చేత జాతీయ జెండా పట్టుకొని, మరో చేత్తో ప్రజలకు అభివాదం చేస్తూ, అమిత్ షా ఉత్సాహంగా ముందుకు సాగారు. అమిత్ షా వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రుల జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడిచారు. బషీర్‌బాగ్‌ నుంచి మొజంజాహీ మార్కెట్‌ వరకు సాగిన ఈ పాదయాత్రలో బిజెపి నాయకులు, కార్యకర్తలే కాకుండా పెద్దఎత్తున ప్రజాస్వామికవాదులు, సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొన్నారు. దీంతో భాగ్యనగర వీధులు కాషాయ సంద్రాన్ని తలపించాయి. పాదయాత్ర పొడుగునా భారత్ మాతా కీ జై!, జై బిజెపి!, జై శ్రీరాం! నినాదాలు మిన్నంటాయి. మొజంజాహీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ముగింపు సభలో ప్రసంగించిన అమిత్ షా బిజెపి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

అమిత్ షా ప్రసంగిస్తూ.. నవంబర్ 1న దిల్లీలో జరిగింది ఓట్‌ బచావో ర్యాలీ కాదని, చొరబాటుదారులను కాపాడే ‘ఘుస్‌పైటియా బచావో’ ర్యాలీ అని విమర్శించారు. ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ చొరబాటు దారులకు చోటు కల్పించేందుకే ర్యాలీ తీశారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌లో తొలగించిన 13 కోట్ల ఓట్లలో 10 కోట్ల ఓట్లు మరణించిన, చిరునామా మార్చిన, రెండుచోట్ల నమోదైన వారివేనని చెప్పారు. 6.25 కోట్ల మంది వేరేచోట నివాసం ఉంటున్నారని, వారికి రెండు చోట్ల ఓట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. దాదాపు మూడు కోట్ల మంది చనిపోయారని, చనిపోయినవారి ఓట్లు తొలగించాలా, వద్దా? అని నిలదీశారు. ఎస్ఐఆర్‌ వల్లే బిజెపి గెలిచిందంటున్న కాంగ్రెస్‌ ఎస్‌ఐఆర్‌కు ముందు చాలా ఎన్నికలు తాము గెలిచిన విషయం గుర్తు చేసుకోవాలని అమిత్‌ షా అన్నారు. 2014, 2019లలో ఎస్‌ఐఆర్‌ లేకున్నా మోదీ గెలిచారని చెప్పారు. 2024 తర్వాత మహారాష్ట్ర, హరియాణాలో భారీ మెజారిటీతో గెలిచామని, దిల్లీలో ఏళ్ల తర్వాత విజయం సాధించామని, బిహార్‌, అసోంలోనూ గెలిచామని, బెంగాల్‌లో మమతను అధికారం నుంచి తప్పించామని అన్నారు. తెలంగాణలోనూ గెలిచి అధికారంలోకి వస్తామని ప్రకటించారు. తాము ఈవీఎంల మోసం చేస్తే రేవంత్‌ సీఎం ఎలా అయ్యారని అమిత్ షా ప్రశ్నించారు. కేరళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా వచ్చిందని, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఎలా వచ్చాయని నిలదీశారు. గెలిస్తే ప్రజల ఓట్లతో, ఓడితే ఈవీఎంల వల్లేనా? అని ప్రశ్నించారు. 

రాహుల్‌కు ఏటీఎంగా తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అమలవుతోందని అమిత్‌ షా విరుచుకుపడ్డారు. అది రేవంత్‌ ద్వారా రాహుల్‌గాంధీకి చేరుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏటీఎంలా మార్చుకుందని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పటికీ క్షమించరన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు ఇచ్చి విస్మరించిందని, అవన్నీ ‘చటాచట్‌’ అయిపోయాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ మాక్‌ పార్లమెంటులోనే ప్రధాని కాగలరని షా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఆయన విదేశాలకు వెళ్తుంటారని, ఎన్నికల్లో గెలవాలంటే దేశంలో ఉండి చెమటోడ్చాలని చురకలంటించారు. చేతిలో రాజ్యాంగం పెట్టుకుని రాజ్యాంగాన్ని గౌరవించరని విమర్శించారు. ఎస్ఐఆర్‌పై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కాంగ్రెస్ పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని సవాల్‌ విసిరారు. చర్చలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతారని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లు కుంభకోణాలేనని, ఏకంగా రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు చేశారని అమిత్‌ షా ఆరోపించారు. వారి చేతుల్లో మళ్లీ ప్రభుత్వం పెడదామా? అని ప్రజలను ప్రశ్నించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో పావలా కుంభకోణం కూడా జరగలేదని, మోదీపై ఆరోపణలే లేవని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ క్రమంగా కనుమరుగవుతోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. తమిళనాడులో 64 ఏళ్లుగా, బెంగాల్‌లో 54 ఏళ్లుగా, గుజరాత్‌, యూపీలో 40 ఏళ్లుగా, త్రిపురలో 26 ఏళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో లేదని ప్రస్తావించారు. ఆ రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ వల్లే ఓడిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌పై ఉందని, అది మోదీతో పరిగెత్తలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ యువమోర్చా అధ్యక్షుడు కూడా రాహుల్‌ను ఓడించగలరని అన్నారు. 

అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని, రామమందిరం కడతామని, త్రిపుల్‌ తలాక్‌ రద్దు చేస్తామని చెప్పామని, అన్నీ చేశామని షా ప్రస్తావించారు. ఆపరేషన్‌ సిందూర్‌, సర్జికల్‌ స్ట్రైక్‌చేశామని, నక్సలైట్లను నిర్మూలించామని చెప్పారు. 2029 డిసెంబరు 31 లోగా దేశాన్ని డ్రగ్స్‌ రహితంగా మారుస్తామని ప్రకటించారు. దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత బీమా, 16 కోట్ల ఇళ్లకు నీళ్లు, 13 కోట్ల మందికి పీఎం కిసాన్‌ నిధి, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల ఉజ్వల గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చామని తెలిపారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అమ్మడానికి జరుగుతున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌, ఓవైసీ, బీఆర్‌ఎస్‌ అడ్డుకోగలవా? అని అమిత్‌షా ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మాత్రమే ఈ దోపిడీని అడ్డుకోగలరన్నారు. ఎన్‌డీఏ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్‌పై వాస్తవాలు వివరించాలని అమిత్‌ షా సూచించారు. తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆ రోజు నిజాం మెడలు వంచకపోతే ఈ రోజు హైదరాబాద్‌ దేశంలో భాగం అయ్యేది కాదని వ్యాఖ్యానించారు. బిజెపి మహా పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించి, విజయవంతం కావడం పట్ల అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును ఆయన అభినందించారు.

కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగట్టేందుకే..‌‌

హైదరాబాద్‌లో బిజెపి నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ మహా పాద యాత్రకు ప్రజలు, బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు కొనియాడారు. పాదయాత్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, దేశ రాజ్యాంగబద్థ సంస్థలపైనా కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలు పచ్చి అబద్థాలతో విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని ఎండగట్టేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ గడ్డపై రెండు కిలోమీటర్ల మహా పాదయాత్రలో మనతో కలిసి అడుగులు వేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి అసత్య ప్రచారాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో

ఒకరోజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులు, సిరిసంపదలతో ఎల్లప్పుడూ వర్థిల్లాలని అమ్మవారిని మనసారా ప్రార్థించినట్లు తెలిపారు.

‌అమిత్‌షాను కలిసిన చిరంజీవి, రాంచరణ్

హైదరాబాద్‌ పర్యటనకువచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేసిన అమిత్‌ షాను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్ షాను షాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. వీరి మధ్య జరిగిన భేటీలు సినిమాలతో పాటు డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మైహోం అధినేత రామేశ్వరరావు, గ్రీన్‌కో సంస్థకు చెందిన అనిల్‌ కూడా విడివిడిగా అమిత్ షా కలిశారు.

దిగ్విజయంగా మహా పాదయాత్ర‌‌

padayatra crowd‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం-అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ నినాదంతో బిజెపి-తెలంగాణ నిర్వహించిన మహా పాదయాత్రకు భారీ స్పందన లభించడం కమలనాథుల్లో సంతోషాన్ని నింపింది. గ్రేటర్‌తో పాటు పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. దీంతో బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్‌ వరకు యాత్రా మార్గం కాషాయమయంగా మారిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొనగా… ఆయన వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, కేంద్రబొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఉన్నారు. దారి పొడవునా మోదీ నినాదాలతో, సర్‌ ప్రక్రియకు సంబంధించిన పలు రకాల ప్లకార్డులను ప్రదర్శిస్తూ, జాతీయ జెండా, బిజెపి జెండాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

భద్రతా కారణాల రీత్యా గన్‌పౌండ్రీ ఎస్‌బీఐ చౌరస్తా నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి మోజాంజాహి మార్కెట్‌ క్రాస్‌రోడ్‌ వరకు నడిచారు. యాత్రా మార్గంలో ఇరువైపుల ఉన్న బహుళ అంతస్తుల భవనాలపైకి అభిమానులు చేరి.. జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు పాదయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌, గోరక్షక దళ్‌, సంఘ్‌ పరివార్‌ సంస్థల నాయకులు.. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి మెడికల్‌ సెల్‌ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను అంపశయ్యపై పెట్టి యాత్రలో పాల్గొన్నారు.