కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడాలి..!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. గ్రామగ్రామానా బిజెపిని బలోపేతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బిజెపియేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా బిజెపి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘బిజెపి మహాపాదయాత్ర’ అశేష జనవాహిని మధ్య ఉత్సాహభరితంగా సాగింది. శాంతినగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర వివేకానంద చౌక్ వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ రేఖా శర్మ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, జి. నగేష్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సహా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, కాంగ్రెస్ అరాచక రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్మల్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొని, బహిరంగ సభలో బిజెపి నేతల ప్రసంగాలను ఆసక్తిగా తిలకించారు. పాదయాత్ర, బహిరంగ సభ ప్రాంగణాలు భారత్ మాతా కీ జై, మోదీ నినాదాలతో మార్మోగిపోయాయి.
సభలో ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి.. దిల్లీకి వెళ్లి ‘ఓట్ చోరీ’ అంటూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు ఓట్ చోరీ జరగలేదని, అసలు ఆయన బ్రెయిన్‌నే చోరీ అయిందని ఎద్దేవా చేశారు. గాంధీ పేరును దొంగిలించి రాహుల్ గాంధీ ‘నామ్ చోరీ’కి పాల్పడ్డారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఇద్దరు కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని అవినీతికి మారుపేరుగా నిలిచిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. అందుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ.. వాటిని ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చనిపోయిన వారి ఓట్లు తొలగించాలా? వద్దా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR)పై కాంగ్రెస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తప్పుబట్టారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఎమ్మెస్సార్ వంటి నేతలు మరణించి ఏళ్లు గడుస్తున్నా ఓటర్ల జాబితాలో పేర్లు కొనసాగుతున్నాయని, చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లేకుండానే రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారని, ఆయన కుటుంబ సభ్యుల హయాంలోనూ ఇలాంటి ప్రక్రియలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. ఈ దేశ ప్రధానిని, ఎంపీలను, ఎమ్మెల్యేలను నిర్ణయించేది భారత పౌరులేనని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చెందిన చొరబాటుదారులు దేశ నాయకత్వాన్ని నిర్ణయించే పరిస్థితిని సహించబోమని హెచ్చరించారు. సీఏఏ, ఎన్ఆర్సీ వంటి అంశాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఒక రాక్షస సేనలా వ్యవహరిస్తోందని, వారి నిందలను ప్రధాని మోదీ గరళకంఠుడిలా భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు మద్యం గ్లాసులు అందించే సంస్కృతి, దిల్లీ పెద్దలకు డబ్బు సంచులు పంపే రాజకీయాలు తెలియవని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో కరెంట్, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెన్షన్లు అందక వృద్ధులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, హామీలు నెరవేరక మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ నేతలు దిల్లీకి వెళ్లి ఎస్ఐఆర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాంచందర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకొస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దిల్లీలో కొందరిని సమీకరించుకుని కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ చేస్తున్నది ఓటు చోరీ ఆరోపణలు కాదని, పేరు చోరీ రాజకీయాలని ఎద్దేవా చేశారు. విదేశీ కుట్రలతో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలను భారత్‌లోనూ సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే దేశ యువత, ముఖ్యంగా జెన్ జీ ఇలాంటి కుట్రలను అనుమతించబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూటల మేస్త్రీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం మానేసి, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు సంధించారు. రూ.4 వేల పెన్షన్, యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రైతు భరోసా వంటి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా దిల్లీలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ, ఎన్ని ఓట్లు తొలగించారో ఆధారాలతో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల పేరుతో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన వెనుక కారణమేంటని నిలదీశారు. ఎన్నికల సంఘంపై నమ్మకం లేదంటున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

