Eatala Padayatra

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై సమరశంఖం!

Jawahar nagar yatraహైదరాబాద్ నగరానికి చెత్త నిర్వహణ కేంద్రంగా మారిన జవహర్‌నగర్ డంపింగ్ యార్డు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర సమస్యగా మారింది. చెరువులు కలుషితమవుతున్నాయి, వ్యవసాయం దెబ్బతింటోంది, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు, ప్రజలు ఆరోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి, ఇలా చెప్పుకొంటూ పోతే ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు అన్నీఇన్నీ కావు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సమస్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డ్ బాధితులు స్థానిక బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికై మొద్దునిద్ర పోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ఈటల రాజేందర్ ‘జవహర్‌నగర్ జన సంకల్ప యాత్ర’ చేపట్టారు. అక్టోబర్ 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష మద్దతు వచ్చింది. సుమారు 60 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో డంపింగ్ యార్డు ప్రభావిత గ్రామాలను సందర్శిస్తూ ఈటల రాజేందర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. చెరువులను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీశారు. చివరిరోజు జవహర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, సమస్య పరిష్కారానికి డీపీఆర్ రూపొందించాలని, అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు.

‌జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వెనుక అసలు కథేంటి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సుమారు 50 వేల నుంచి 80 వేల మంది జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని జవహర్ నగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. అయితే 2004–05 తర్వాత హైదరాబాద్ నుంచి సేకరించే చెత్తను కూడా జవహర్‌నగర్, బాలాజీనగర్ ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. దీంతో స్థానికంగా చెత్త నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రం క్రమంగా నగర వ్యర్థాల భారీ నిల్వ కేంద్రంగా మారింది. ప్రారంభంలో ఈ ప్రాంతంలో వలస కూలీలు, నిరుపేద కుటుంబాలు ఎక్కువగా నివసించేవారు. దుర్వాసన, కలుషిత నీరు, ఆరోగ్య సమస్యలపై వారు గళమెత్తినా అప్పట్లో వారి ఆవేదనకు తగిన స్పందన రాలేదు. కాలక్రమేణా నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, ఎదులాబాద్, బాలాజీనగర్ తదితర ప్రాంతాలకు సమస్య విస్తరించడంతో స్థానికులు సంఘటితమయ్యారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకుని ఉద్యమాలు ప్రారంభించారు. 2016లో డంపింగ్ యార్డు వ్యర్థాల నిర్వహణ, కాలుష్య సమస్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ఉల్లంఘనపై ఎన్‌జీటీ లక్ష రూపాయల జరిమానా విధించింది. డంపింగ్ యార్డు నిర్వహణలో నిబంధనలు పాటించాలని ఆదేశించింది. అయిననప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదు. చెత్తలోని తేమ, వర్షపు నీరు వ్యర్థాల గుండా ప్రవహించినప్పుడు వివిధ కాలుష్య పదార్థాలను కలుపుకొని లీచేట్ అనే కలుషిత ద్రవం ఏర్పడుతుంది. దీనిని శాస్త్రీయంగా సేకరించి శుద్ధి చేయకపోతే భూగర్భ జలాలు, చెరువులు, నేల కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడే లీచేట్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా కాలువల్లోకి వదులుతున్నారు. 

డంపింగ్ యార్డు నుంచి వచ్చే లీచేట్ ఎదులాబాద్ పెద్ద చెరువులో చేరడం వల్ల చేపలు చనిపోయి వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం దెబ్బతింది. ఆ నీటిని తాగిన పశువులు, గొర్రెలు కూడా మృత్యువాత పడుతున్నాయి. వ్యవసాయానికి నీటిని వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. రాంపల్లి, సూర్యనారాయణ చెరువు, లక్ష్మీనారాయణ చెరువులదీ ఇదే పరిస్థితి. చెరువులపై ఆధారపడిన మత్స్యకారులే కాకుండా రజకులు, గౌడులు, రైతులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. కలుషిత నీటితో బట్టలు ఉతికితే రజకుల చర్మం దెబ్బతింటోంది. డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లలు అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆసుపత్రులు, మందుల కోసం సంపాదించిన డబ్బంతా ఖర్చవుతోంది. భరించలేని దుర్వాసన కారణంగా రాత్రిపూట ఇళ్లలో ఉండలేని దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. నాలుగు రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

‌నాలుగు రోజుల పాదయాత్ర

అక్టోబర్ 27న ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ పెద్ద చెరువు వద్ద ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు ముందు స్థానిక రంగనాథ స్వామి ఆలయంల ప్రత్యేక పూజలు చేశారు. తొలుత చెరువును పరిశీలించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు. మర్రిపల్లిగూడెం, చందుపట్లగూడ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, బొక్కనిగూడ, ఘనాపూర్ మీదుగా అన్నోజిగూడ వరకు యాత్ర సాగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అక్టోబర్ 28న రెండో రోజు రాంపల్లి చౌరస్తా, రాంపల్లి చెరువు, కరీంగూడ చౌరస్తా ప్రాంతాల్లో బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కలుషిత చెరువుల కారణంగా రజకులు, మత్స్యకారులు, రైతులు తమ ఇబ్బందులను ఈటలకు ఏకరువు పెట్టారు. ఈటల వెంట ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, బండారు విజయలక్ష్మి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. అక్టోబర్ 29న మూడో రోజు కీసర, చీర్యాల, బండ్లగూడ, నాగరం ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగింది. ప్రతి గ్రామంలో బాధిత మహిళలు, స్థానికులు ఈటలకు స్వాగతం పలికి తమ సమస్యలను వివరించారు. బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి అవసరమైన డీపీఆర్ తయారు చేస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత బిజెపి ఎంపీలు తీసుకుంటారని ఈటల ప్రకటించారు. అక్టోబర్ 30న నాలుగో రోజు పాదయాత్ర జవహర్ నగర్ వరకు సాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రామారావు పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇతర బిజెపి నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్థానికులు, బిజెపి కార్యకర్తలు, బాధితులు ఈ సభకు పెద్దఎత్తున తరలివచ్చారు. తలపై కుర్చీలు అడ్డు పెట్టుకొని, వర్షంలో తడుస్తూనే నాయకుల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. ఈ సభతో నాలుగు రోజుల జన సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగిసింది.

ఈ పాదయాత్రలో డంపింగ్ యార్డు సమస్యతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, బస్సు సౌకర్యం, పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు తదితర సమస్యలను ప్రజలు ఈటల దృష్టికి తీసుకొచ్చారు. వీటి పరిష్కారానికి ఆయన వారికి హామీ ఇచ్చారు. బహిరంగ సభతో పాటు పాదయాత్రలో వివిధ చోట్ల ఈటల ప్రసంగించారు. గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డు సమస్యపై ఎన్‌జీటీ, సుప్రీంకోర్టులో కేసులు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంటులోనూ ఈ సమస్యను ప్రస్తావించానని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్క కిలో చెత్త కూడా వృథా కాకుండా వినియోగించుకునే అవకాశం ఉందంటూ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఈటల పలు సూచనలు చేశారు. ”తడి చెత్త నుంచి వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రీయ ఎరువులు తయారు చేయాలి. పొడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి రోడ్ల నిర్మాణానికి ఉపయోగించే డాంబర్ తయారీలో వినియోగించాలి. లీచేట్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేసి కాలుష్యం లేకుండా నిర్వహించాలి. హైదరాబాద్‌కు దూరంగా, జనావాసాలు లేని ప్రాంతాల్లో ఆధునిక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్లు అవసరమవుతాయి.” అని ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేస్తే, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత బిజెపి ఎంపీలుగా తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒకవేళ నిధులు తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను సమీకరించి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.