Revanth Reddy

బెనిఫిట్‌ షోలపై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్‌

మాట చెప్పడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలకు ఆయన పరిపాలన పూర్తి భిన్నం. ముఖ్యంగా సినిమా పరిశ్రమ వారి పట్ల మొదటి నుండి దాగుడుమూతలు ఆడుతున్నారు. ఒక సారి బెదిరిస్తారు, మరోసారి వారి ముందు సాగిలపడతారు. గతంలో హరిహరవీరమల్లు, ఓజీ, గేమ్‌ ఛేంజర్‌ సినిమా విషయాల్లో వెనక్కి తగ్గి తీవ్ర విమర్శలకు గురైన ఆయన తీరు ఇప్పుడు అఖండ 2 విడుదల వేళ కూడా పునరావృతం అయింది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం ‘ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవు.. సినిమావాళ్ల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అది జరిగి నెలలు కూడా తిరక్కముందే హరిహరవీరమల్లు, గేమ్‌ ఛేంజర్‌, ఓజీ సినిమాల విడుదల వేళ బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపునకు అవకాశం కల్పించి తామంతే అన్నట్టుగా వ్యవహరించారు. తాజాగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రానికి స్పెషల్‌ ప్రీమియర్‌ షోలతో పాటు టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలకు తిలోదకాలిచ్చిన్నట్లు అయింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ-2 నేడు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదీకాకుండా గురువారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే ప్రీమియర్‌ షోలకు టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించడం, డిసెంబర్‌ 5 నుంచి 7 వరకు సింగిల్‌ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునేందుకూ రేవంత్‌ ప్రభుత్వం  అనుమతి ఇచ్చింది. నాడు ప్రిమియర్‌ షోలకు అనుమతిచ్చే ప్రసక్తేలేదని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గతంలో సమైక్య పార్టీలో పనిచేసిన సందర్భంలో ఆంధ్రా నేతలతో ఉన్న సఖ్యత, వారి ఒత్తిడితోనే అఖండ-2 బెనిఫిట్‌ షోకు అనుమతిచ్చారని కాంగ్రెస్ వారే వాపోతున్నారు.

చిన్న నిర్మాతలు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆందోళనలకు, చివరకు సినిమాల బంద్ వరకు వెళ్లిన కూడా ప్రభుత్వంలో చెప్పుకోదగిన కదలిక కనిపించడం లేదు. నాగార్జున కుటుంబంపై మొదట్లో కక్షసాధింపుగా వ్యవహరించి, చివరకు ఓ మహిళా మంత్రి వారి కుటుంబంపై వ్యక్తిగతమైన విమర్శలకు దిగినా పట్టించుకోని ముఖ్యమంత్రి, ఇటీవల ఆ మంత్రితో ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పించి, కోర్టులో పరువునష్టం దావాను ఉపసంహరించుకొనేటట్లు చేశారు. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే డ్రగ్స్ వ్యతిరేక సందేశాలతో హీరోలు వీడియోలు విడుదల చేయనిదే సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శింపబోమని బెదిరించే ప్రయత్నం చేశారు. మంత్రి కోమటిరెడ్డి అయితే తాను సినిమాటోగ్రఫీ మంత్రిని అయినా సినీ ప్రముఖులు ఎవ్వరూ తనను కలవడం లేదంటూ బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో విధంగా సినీ పరిశ్రమలపై వత్తిడులు తీసుకురావడం, బెదిరింపులతో వారిని లొంగదీసుకొనే ప్రయత్నం చేయడం పరిపాటిగా ఈ ప్రభుత్వానికి మారిపోయింది. 

సినీ ప్రముఖులను బెదిరించి, తన ప్రభుత్వ ప్రచారం కోసం వారిని ఉపయోగించుకొనే ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలలో వారిని బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం మినహా సినీ పరిశ్రమ అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎటువంటి ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. ఈ సందర్భంగా చెప్పే మాటలకు, ప్రభుత్వం వ్యవహరించే తీరుకు సంబంధం ఉండటం లేదు. అదే విధంగా బెనిఫిట్ షోల విషయంలోనూ స్పష్టమైన విధానం అంటూ లేకుండా పోయింది. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రభుత్వ నేతలకు పరమావధిగా కనిపిస్తున్నాయి.

కృష్ణ చైతన్య