Eleti

ఏలేటి సవాల్‌కు ఉత్తమ్ పరార్

హైద‌రాబాద్ ఇండస్ట్రియల్‌ ల్యాండ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ (HILT) పాలసీలో అవినీతి లేదంటే దమ్ముంటే చర్చకు రావాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విసిరిన సవాల్‌కు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జడుసుకున్నాడు. హిల్ట్ పాలసీపై వస్తోన్న విమర్శలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ విధానం ప్ర‌తిప‌క్షాల‌కు అర్థం కాలేద‌ని వ్యాఖ్యానించారు. దీనికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ప్ర‌భుత్వ విధానంలో పార‌ద‌ర్శ‌క‌త ఉంటే, దానిపై చ‌ర్చించేందుకు నవంబర్ 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింటుకు ర‌మ్మ‌ని సవాల్ విసిరారు. ఒకవేళ తన ఆరోపణల్లో తప్పు ఉంటే రాజీనామా చేస్తానని, తప్పు లేదంటే ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయాలని అన్నారు. చెప్పిన సమయానికి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహేశ్వర్ రెడ్డి వేచి చూశాడు. చర్చించే దమ్ము లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి రాలేదు. కనీసం ఎందుకు రాలేకపోయాడన్న వివరణ కూడా ఇవ్వలేదు. మహేశ్వర్ రెడ్డి స‌వాలును ఉత్త‌ం స్వీక‌రించ‌లేదంటే హిల్ట్ పాల‌సీలో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని రుజువైన‌ట్టే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ”కోకాపేటలోని భూములకు HMDA రెండో విడత వేలంలో ఎకరానికి రూ.151 కోట్ల ధర పలికింది. ఈ లెక్క‌న హిల్ట్ పాల‌సీలో భాగంగా 22 పారిశ్రామిక వాడ‌ల్లో ఉన్న భూముల ధ‌ర స‌గ‌టున ఎక‌రం సుమారు రూ.68 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా. ఆ మేర‌కు ప్ర‌భుత్వం క‌న్వ‌ర్ష‌న్ చేస్తున్న 9292 ఎక‌రాలకు మార్కెట్ ధ‌ర ప్ర‌కారం వ‌చ్చే మొత్తం రూ.6 ల‌క్ష‌ల 29 వేల కోట్లు. ఈ భూములను ఎకరం రూ.54 లక్షలకే ఇచ్చేయడం లూటీ కాక మరేమిటి? నాడు గ్రిడ్ పాల‌సీతో బీఆర్ఎస్ వంద‌ల ఎక‌రాల పారిశ్రామిక భూముల‌ను కొల్ల‌గొడితే, నేడు కాంగ్రెస్ స‌ర్కార్ హిల్ట్ పాల‌సీ ద్వారా ఏకంగా 22 పారిశ్రామిక వాడ‌ల‌నే మింగిస్తోంది. పారిశ్రామిక భూముల లూటీకి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ త‌లుపులు తెరవడం కాదు, ఏకంగా గోడ‌ల‌నే కూల్చేసింది. క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ఏనాడు హైద‌రాబాద్ పారిశ్రామిక భూముల అంశాన్ని చర్చించ‌లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ చేసిన రూ.వేలకోట్ల డ‌బ్బుమూట‌ల‌కు ఆశ‌ప‌డిన న‌లుగురు మంత్రులు దుష్ట‌చ‌తుష్ట‌యంగా మారి క్యాబినెట్ స‌బ్ క‌మిటీలో చ‌ర్చించామంటూ అబ‌ద్ధాలు చెబుతున్నారు. లై డిటెక్ట‌ర్ టెస్టులు నిర్వ‌హిస్తే వీరి బండారం, రూ.ఆరు ల‌క్ష‌ల 29 వేల కోట్ల ల్యాండ్ లూటీ స్కామ్ బ‌య‌ట‌పడుతుంది

హిల్ట్ పాలసీకి కాలుష్య‌మే ప్ర‌ధాన కార‌ణ‌మైతే మ‌నుగ‌డ‌లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను ఔట‌ర్ రింగ్ రోడ్డు బ‌య‌ట‌, ఫ్యూచ‌ర్ సిటీలో ఉన్న వేలాది ఎక‌రాల్లో రీ లోకేట్ చేసి, భూమికి భూమి ఇచ్చి హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న 9292 ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వ‌మే స్వాధీన‌ప‌రుచుకోవ‌చ్చు క‌దా. అలా చేయ‌కుండా SRO విలువలో 30 శాతానికే ల్యాండ్ క‌న్వ‌ర్ష‌నుకు అనుమ‌తివ్వ‌డం స్కాము కాక మ‌రేంటి? మరి ఈ 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి? వాటి వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయనే అంశంపై నిపుణుల నివేదిక ఏమైనా ప్రభుత్వం వద్ద ఉందా? ఎన్విరాన్ మెంట‌ల్ స్ట‌డీ ఏమైనా చేసారా? ఏ ప్రాతిపదికన ఈ పరిశ్రమలన్నీ కాలుష్య కారకాలని ప్రభుత్వం నిర్ధారించింది. మరి 50 ఏళ్లుగా ఈ పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయనిక వ్యర్థాలు భూమిలో ఇంకిపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి నివాసానికి అనుమతించినట్టయితే విషతుల్యమైన భూగర్భ జలాల వల్ల అక్కడ నివసించే ప్రజలకు అనారోగ్య సమస్యలు రావా? ఇలాంటి అంశాలపై లోతైన అధ్యయనం ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎలాంటి ఎన్విరాన్మెంటల్ స్టడీ చేయకుండా కాలుష్యకారక పరిశ్రమల స్థానంలో నివాసాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. ఇది ప్రజారోగ్యంతో చెలగాటం కాదా?” అని అన్నారు.