బిజెపి రథసారథి నితిన్ నబీన్
నితిన్ నబీన్ సిన్హా.. భారతీయ జనతా పార్టీ కొత్త సారథి! వెనకబడిన బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడయ్యారు. 45 సంవత్సరాల పిన్న వయస్సులోనే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ పగ్గాలందుకున్నారు. జాతీయ రాజకీయాల్లో పెద్దగా పేరు లేని అనూహ్యంగా పార్టీలో అత్యున్నత స్థానానికి చేరారు. ఇది ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం!
నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించినా అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. యువ మోర్చా కార్యకర్త నుంచి ఇటీవలి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి వరకు పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుసగా ఐదు సార్లు గెలిచి ప్రజల మన్ననలు అందుకున్నారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రజా నాయకుడిగా దేశసేవ పట్ల అంకితభావం ప్రదర్శిస్తూ, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా సిద్ధాంతాలకు నిబద్ధుడై, కార్యసాధకుడిగా నిలిచాడు కాబట్టే నితిన్ నబీన్ నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడయ్యారు.
జనవరి 20న దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఇతర అతిరథ మహారథుల సమక్షంలో లాంచనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం కేంద్ర కార్యాలయంలో అభినందన సభను నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన అధ్యక్షుడికి పూలమాల వేసి సాదరంగా ఆహ్వానించారు. పూర్వ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు తదితరులు నితిన్ నబీన్‌ను అభినందించారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించాలంటే పార్టీ నిబంధనల ప్రకారం కనీసం 50 శాతం రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావాలి. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలలో 30 రాష్ట్రాలకు అధ్యక్షులు ఎన్నికయ్యారు. అవసరమైన దాని కన్నా చాలా ఎక్కువ రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. దీంతో బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. జనవరి 16, 2026న షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడింది, అనంతరం ఓటర్ల జాబితా ప్రచురితమైంది. షెడ్యూల్ ప్రకారం, 19 జనవరి 2026 (సోమవారం)న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్‌కు అనుకూలంగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో రాష్ట్ర బృందం కూడా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసింది. అన్ని నామినేషన్ పత్రాల సెట్లు నిర్దిష్టమైన ఫార్మాట్‌లో చెల్లుబాటు అయ్యే విధంగా ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ పేరును మాత్రమే ప్రతిపాదించారని బిజెపి సంస్థాగత ఎన్నికల జాతీయ రిటర్నింగ్ అధికారి హోదాలో రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నితిన్ నబీన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు మరునాడు జనవరి 20న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముందు బిజెపి ఎన్నికల జాతీయ రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. అధ్యక్ష నియామక పత్రాన్ని లాంచనంగా ఆయనకు అందించారు. అనంతరం నరేంద్ర మోదీ, జె.పి. నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ సమక్షంలో జాతీయ అధ్యక్ష స్థానంలో ఆసీనులై బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం ముందు నితిన్ నబీన్ దిల్లీలోని జెండేవాలన్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ కార్యాలయంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ఆశీష్ శేలార్
బిజెపి జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే నితిన్ నబీన్ సంస్థాగత నియామకాలు చేపట్టారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు, మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జీలు, కోఇంచార్జీలను నియమించారు. ఇందులో భాగంగా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ శేలార్ ను ఇంచార్జిగా, రాజస్థాన్ బిజెపి మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామీ, జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్, హరియాణా రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలను కోఇంచార్జీలుగా నియమించారు.
ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను ఇంచార్జీగా, కేంద్రమంత్రి శోభా కరంద్లాజేను కోఇంచార్జీగా నియమించారు. వినోద్ తావ్డేకు చండీఘడ్ మేయర్ ఎన్నికల అబ్జర్వర్ గాను బాధ్యతలు అప్పజెప్పారు. గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ కు ఇంచార్జీగా సీనియర్ నాయకుడు రాంమాధవ్, కోఇంచార్జీలుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా, మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయను నియమించారు. ఈ మేరకు జనవరి 20న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో సంబురాలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సంబురాలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, మిఠాయిలు తినిపించుకుంటూ, ఆనందం వ్యక్తం చేశారు. “జై బిజెపి” నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంబురాల్లో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, వేముల అశోక్, బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
45 ఏళ్ల వయసులోనే నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం భారతీయ జనతా పార్టీలో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని డా. బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి కుటుంబ పార్టీల్లో పదవులు వంశపారంపర్యంగా, సీల్డ్ కవర్‌లో నిర్ణయిస్తారని అన్నారు. బిజెపిలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్త కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. బిజెపి యువతకు, సామాన్య కార్యకర్తలకు అవకాశాలు ఇస్తుందని నితిన్ నబీన్ ఎన్నిక స్పష్టం చేస్తోందన్నారు. నితిన్ నబీన్ నాయకత్వంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేసి, ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ నబీన్‌కు కానుక ఇచ్చేలా ప్రతి బిజెపి కార్యకర్త పని చేయాలని డా. బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

