nm nn

ఈ విజయం చరిత్రాత్మకం, అపూర్వం: మోదీ

శ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనవిజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భయంపై విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, రాజకీయ పక్షాలన్నీ ‘ప్రతీకారం కాదు.. మార్పు (బద్లా కాదు.. బద్లావ్)’ అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయాల అనంతరం దిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనదని, ఇది దేశానికి ఉజ్వల భవిష్యత్తును సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకానికి నిదర్శనం

ఈ ఫలితాలు దేశంలోని కీలక అంశాలపై ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని అన్నారు. “ఇది భారతదేశ అద్భుత ప్రజాస్వామ్యంపై నమ్మకం, పనితీరు ఆధారిత రాజకీయాలపై నమ్మకం, స్థిరత్వానికి ఇచ్చే ప్రాధాన్యంపై నమ్మకం, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిపై అచంచల విశ్వాసం,” అని ఆయన అన్నారు. బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. 

గంగా తీర రాష్ట్రాల్లో కమల వికాసం

గత ఏడాది నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాల సమయంలో గంగమ్మ బీహార్ నుండి గంగాసాగర్ వైపు ప్రవహిస్తుందని తాను చెప్పిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. “నేడు పశ్చిమ బెంగాల్ విజయంతో, గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు కమలం పూర్తిస్థాయిలో వికసించింది,” అని ఆయన అన్నారు. ప్రస్తుతం గంగా నది ప్రవహించే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బిజెపి-ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

“పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో భయం ఓడిపోయి, ప్రజాస్వామ్యం గెలిచింది. ఇక్కడ మనకు కావాల్సింది ప్రతీకారం (బద్లా) కాదు, మార్పు (బద్లావ్). భయం (భయ్) కాదు, భవిష్యత్తు (భవిష్య).” గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ఐదు రాష్ట్రాల ప్రజలు భారతదేశాన్ని ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అని ఎందుకు అంటారో నిరూపించారని మోదీ ప్రశంసించారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదని, అది మన నరనరాల్లో ప్రవహించే సంప్రదాయమని ఆయన అభివర్ణించారు.

రికార్డు స్థాయి ఓటింగ్

పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 93 శాతం పోలింగ్ నమోదు కావడం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయని, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం అసాధారణంగా ఉందని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని “చారిత్రాత్మకం”, “అపూర్వం”గా అభివర్ణిస్తూ ఎన్నికల కమిషన్, భద్రతా దళాలు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ నాయకత్వంపై మహిళల విశ్వాసం

“దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలకు గట్టి సమాధానం ఇచ్చినట్టు స్పష్టంగా చూపిస్తున్నాయి. టీఎంసీ బెంగాల్‌లో రాజకీయ హింసకు ప్రేరేపించి, బంగ్లాదేశీలు, రోహింగ్యాల దొంగ ఓట్లతో 15 ఏళ్లు పరిపాలించింది. ఇప్పుడు అక్కడి ప్రజలు టీఎంసీ చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయం. అటు అస్సాంలో గతం కంటే ఎక్కువ సీట్లతో బిజెపి గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ అనేక అబద్ధాలను ప్రచారం చేసి, వివాదాలు, విభేదాలు సృష్టించి చేసిన ప్రయత్నాలను అస్సాం ప్రజలు తిప్పికొట్లారు. ఎక్కడెక్కడైతే బిజెపి ప్రభుత్వం ఉంటే.. అక్కడ మళ్లీ బిజెపి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. మరోవైపు ఇండీ కూటమిలో ఉన్న పార్టీలను తిరస్కరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను.”

-ఎన్. రాంచందర్ రావు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు 

బెంగాల్ ప్రజలకు మంచి రోజులు ‌‌

“ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోదీకి తమ ఆశీర్వాదం అందజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజల ఆశీస్సులతో బిజెపి భారీ మెజారిటీతో ఆ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. 15 ఏళ్లుగా టీఎంసీ ప్రభుత్వం బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని జంగల్‌రాజ్‌గా మార్చింది. బంగ్లాదేశ్ నుంచి లక్షలాదిగా వలస వచ్చిన అక్రమ వలసదారులు బెంగాల్ ప్రజలపై దాడులు చేశారు. తృణమూల్ అండతో వారు చేయని దౌర్జన్యం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం రావడం చాలా గొప్ప మార్పునకు నాంది. బిజెపి గెలుపుతో బెంగాల్ ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. డబుల్ ఇంజన్ సర్కారు బెంగాల్‌లో అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో పూర్తిగా కనుమరుగైంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతోంది.”

-జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

విభజన కుట్రలకు గుణపాఠం‌‌

“ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయి. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు. బిజెపి కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే బెంగాల్‌లో అధికారం దక్కింది. మమతా బెనర్జీ ప్రభుత్వ దాడులను తట్టుకుని పోరాడి విజయం సాధించారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బెంగాల్‌లో చొరబడి ఓట్లేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అక్రమ చొరబాటుదారుల చెంప చెళ్లుమనిపించేలా బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారు. దేశంలో మోదీ తప్ప ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరూ లేరని ప్రజలకు తెలుసు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం తథ్యం. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు, కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోంది.”

-బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి