Students in despair

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్

న్నికల హామీలకు తిలోదకాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని సైతం పరిపూర్ణంగా అమలు జరపడం లేదు. మొక్కుబడిగా కొన్ని పథకాలు అమలు పరుస్తున్నా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా, తెలంగాణ విద్యారంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌ ప్రక్రియలో సంస్కరణల పేరుతో ఆ పతకాన్ని నిర్వీర్యం కావించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడి అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలో కీలక సంస్కరణను తీసుకొచ్చారు. రాష్ట్రంలో విద్యార్థులు ట్యూషన్ ఫీజ్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పదో తరగతి మెమోలో ఉన్న పేరు, ఆధార్‌లోని పేరు, ఇంటిపేరు ఒకేలా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఈ రెండు సరిపోలకపోతే విద్యార్థి దరఖాస్తు ప్రాసెస్ చేయరు. అక్కడే ఆగిపోతోంది. ఈ మేరకు విద్యార్థులు పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఏ సంవత్సరంలో పదో తరగతి పూర్తయ్యింది వంటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి ఈ వివరాలన్నీ సరిపోలితేనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం వస్తుంది.

ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కాలేజీ యాజమాన్యాలకు కాకుండా విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాల్లోనే నేరుగా జమ (డీబీటీ) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానితో జీవో-7 కారణంగా పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అడ్మిషన్‌ సమయంలోనే విద్యార్థులు కాలేజీ ఫీజు చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో అమ్మాయిలు చదువు ప్రమాదంలో పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కాలేజీలో సీటు రాగానే మొత్తం ఫీజు కట్టాలి. ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలియదు. ఆ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో తెలియదు. ఎంత సమకూర్చుకోవాలో తెలియదు. ఏడాది తిరగ్గానే మళ్లీ ఫీజులు కట్టాల్సిందే. ఉంటే స్థలం అమ్ముకోవాలి. లేదంటే ప్లాట్‌ కుదువపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టడంతో పేద వర్గాలకు ఫీజుల బాధలు తప్పాయి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ తీరుతో మళ్లీ పాత రోజులు వస్తున్నాయనే భయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. దానితో బకాయిలు పేరుకుపోయి కళాశాలలు మూసివేస్తామని పలు సందర్భాలలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరికలు జారీచేస్తుండటాన్ని చూస్తున్నాము. 

గతంలో అమ్మాయిలు పాఠశాల విద్య దాటటమే గగనంగా ఉండేది. ఇంటర్‌ పూర్తి చేస్తే చాలు అన్నట్టుగా పరిస్థితులుండేవి. కానీ, గత కొంతకాలంగా పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. అడ్డంకులను అధిగమించి అమ్మాయిలు ముందడుగేశారు. తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అందుకు ప్రధానంగా దోహదం చేస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉచిత విద్య అందిస్తుండటంతో అమ్మాయిలు చదువుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల తరగతి గదిలో సగటున 60 మంది విద్యార్థులుంటే వీరిలో బాలికలు 10-12 మంది మాత్రమే ఉండేవారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ స్థాయికి వచ్చేనాటికి బాలికల సంఖ్య ఇంకా తగ్గేది. అయితే, ఈ పథకంతో పరిస్థితి మారింది. విద్యాసంస్థల్లో బాలుర కంటే బాలికల సంఖ్య అధికంగా నమోదవుతున్నది. ప్రతి తరగతి గదిలో 50 శాతానికిపైగా అమ్మాయిలే కనిపిస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌ సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేస్తుండటంతో ఈ మార్పు కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అమ్మాయిల అడ్మిషన్లు తగ్గడం, డ్రాపౌట్స్‌ పెరగడం వంటి పరిస్థితి ఎదురవుతుందునే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో మొత్తం సీట్లు భర్తీ కావడం లేదు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి కొర్రీలతో వర్సిటీల్లోను డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని భయం కలుగుతుంది. 

రాష్ట్రంలో ట్యూషన్ ఫీజుల కోసం ఏటా 12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికి ప్రభుత్వం రూ.2400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు గతంలో ఆధార్‌ ధ్రువీకరణ చేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరయ్యేది. తెలంగాణలో జాతీయ ఉపకార వేతనాల విధానం ప్రకారం ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు చెల్లిస్తున్నట్లుగా ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు వారి వ్యక్తిగత బ్యాంకు అకౌంట్‌లలో నేరుగా ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు 20 శాతం మంది ఆధార్‌లో పేరు సవరించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ వేసవి సెలవులు ముగిసేలోగా ఆధార్‌లో పేర్కొన్న పేరు, ఇంటిపేరులో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమయ్యే నాటికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మొత్తం పక్రియను సంక్లిష్టం చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ప్రవీణ్