Revanth Cab

రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు సమానంగా సలహాదారులు!

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రుల సంఖ్యకు దాదాపు సమానంగా సలహాదారులు ఉన్నారు. మరీ విడ్డూరం ఏమిటంటే! కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పేరుతో ఇప్పటికే ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించగా, మరో ముగ్గురు సలహాదారుల నియామకం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇలా కొన్ని శాఖలకు క్యాటగిరీలవారీగా సలహాదారుల నియామకం జరిగింది. వీరిచ్చేవి ‘ఉచిత’ సలహాలు కాదు. 

2023 డిసెంబర్‌ 7న సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే గత ప్రభుత్వం నియమించిన ఏడుగురు సలహాదారులను తొలగించారు. ‘రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించడంలో సలహాదారుల పాత్ర ఉన్నది. మా ప్రభుత్వానికి సలహాదారుల అవసరమే లేదు’ అని ఆ సందర్భంగా ఘనంగా చెప్పుకొన్నారు. అయితే, జనవరి 20న అంటే అధికారంలోకి వచ్చిన నెలన్నరకు ముఖ్యమంత్రి తనతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్‌ రెడ్డిని ప్రధాన సలహాదారుగా నియమించారు. క్యాబినెట్‌ హోదా కల్పించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ శాఖ ల ప్రధాన సలహాదారుగా, మరో సీనియర్‌ నేత హర వేణుగోపాల్‌ను ప్రొటోకాల్‌, ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించి క్యాబినెట్‌ హోదా ఇచ్చారు. అప్పటి నుండి సలహాదారుల పోస్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ పునరావాసం కోసం వాడుకొంటూ వస్తుంది. పార్లమెంటు ఎన్నికల ముందు బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఏపీ జితేందర్‌రెడ్డిని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా, బీఆర్‌ఎస్‌ నుంచి గోడ దూకిన పోచారం శ్రీనివాస రెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కేశవ రావును పబ్లిక్‌ ఎఫైర్స్‌ సలహాదారుగా నియమించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ పనులు ప్రారంభించిన రెండు రోజుల్లోనే సొరంగం కూలి, 8 మంది కూరుకుపోయారు. కనీసం వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టలేని ప్రభుత్వం ఇటీవల ఆ టన్నెల్‌ కోసమే ఇద్దరిని సలహాదారులుగా నియమించింది. మరో ముగ్గురు సలహాదారులను పెట్టుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని సమాచారం. తాజాగా డీజీపీగా ఉద్యోగ విరమణ పొందిన శివధర్‌రెడ్డికి రాష్ట్ర భద్రతా సలహాదారు అనే పోస్టు సృష్టించి మరీ నియమించారు. శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా రేవంత్‌ ప్రభుత్వం శాసనసభా వ్యవహారాల సలహాదారు పోస్టును సృష్టించింది. సూర్యదేవర ప్రసన్నకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. పలు మంత్రిత్వ శాఖలలో మంత్రుల కన్నా ఈ సలహాదారులు ఆధిపత్యం వహిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయా మంత్రులకు తెలియకుండానే ప్రభుత్వ వ్యవహారాలను నడిపిస్తున్నారు. ముఖ్యంగా బడుగు వర్గాలకు చెందిన మంత్రుల శాఖల్లో ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారుల పెత్తనం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా మంత్రులను పట్టించుకోకుండానే సలహాదారులతో పనులు కానిచ్చేస్తున్నట్టు చెబుతున్నారు. 

ఈ మధ్య వివిధ సంక్షేమ శాఖల గురుకులాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షను ఆయా శాఖల మంత్రులు లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతోపాటు కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థుల కిట్ల పంపిణీపై సమీక్షించారు. వస్తువుల సరఫరా కోసం కొత్తగా తీసుకొస్తున్న సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంపైన చర్చించారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ కీలక సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల మంత్రులు ఎవ్వరూ ఈ సమీక్షలో పాల్గొనలేదు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌, పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లేకుండానే రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, సీఎం మాజీ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి ఉండడం గమనార్హం. దీంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన అంశంలో బడుగు వర్గాలకు చెందిన మంత్రులను కాకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని సమీక్ష చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఎవరో ఒక మంత్రి రాలేదంటే ఏదైనా వ్యక్తిగత కారణంతో రాలేదని అనుకోవచ్చు. కానీ ముగ్గురు మంత్రుల్లో ఒక్కరు కూడా రెండు సమీక్షల్లో లేకపోవడం కాంగ్రెస్ వర్గాలలో గందరగోళాన్ని వెల్లడి చేస్తుంది. సంక్షేమ, గురుకుల హాస్టళ్ల విద్యార్థులకు 24 వస్తువులతో కూడిన కిట్లను రూ.1700 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సందర్భంగా ఈ సమీక్షలు జరగడం గమనార్హం. ఈ భారీ కాంట్రాక్టును ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు కట్టబెట్టేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఏకంగా 40 శాతం కమీషన్‌ కొట్టేసేందుకు స్కెచ్‌ సిద్ధం చేశారని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సెంట్రలైజ్డ్‌ టెండర్లలో, వస్తువుల కిట్స్‌ పంపిణీలో వేరెవరినీ జోక్యం లేకుండా నివారించేందుకు సమీక్షల సమయంలో బడుగు వర్గాలకు చెందిన మంత్రులను పక్కన పెట్టారని భావిస్తున్నారు. లక్షలకు లక్షల జీతాలు, భత్యాలు అందుకుంటున్న సలహాదారులు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారు? అన్నది మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. వారు ఎవ్వరికీ సలహాలు ఇస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. నేరుగా ముఖ్యమంత్రికి సలహా ఇస్తారా? ఆయా శాఖల మంత్రులకు ఇస్తారా? లేక సంబంధిత అధికారులకు ‘ఆదేశాలు’ జారీ చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కృష్ణ చైతన్య