వరుస విజయాలతో బిజెపి దేశవ్యాప్త విస్తరణ

మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గత రెండు సంవత్సరాలుగా బిజెపి దేశవ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తూ, చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సైతం అద్భుత విజయాలతో అధికారంలోకి వస్తోంది. 

2024లో ఒరిస్సాలో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చాక తదనంతరం జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి వరుసగా విజయ దుందుభి మోగిస్తూ వచ్చింది. 2024లో హరియాణాలో మూడోసారి రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో కూడా బిజెపి కూటమి అద్భుత విజయాలతో చరిత్ర తిరగరాసింది. 2025లో జరిగిన దిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బిజెపి అధికారంలోకి రావడమే కాదు, మాయమాటలతో దేశ ప్రజలను భ్రమపెడుతున్న కేజ్రీవాల్‌ను ఎమ్మెల్యేగానూ ఓడించింది. తద్వారా దేశంలో కేవలం బిజెపి మాత్రమే రోజురోజుకు ప్రజాదరణ పెంచుకొని, విజయాలను సాధిస్తుందని మరోసారి నిరూపించుకుంది. అదే సంవత్సరం బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోమారు అద్భుత విజయాలను సాధించి ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని చావు దెబ్బ తీసింది. ఈ నెలలో వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బెంగాల్‌లో రెండింట మూడొంతుల మెజారిటీతో ఘనవిజయం సాధించి, మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడింది. బిజెపి ఈ విజయం యావద్దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్, బ్రిటిష్ పత్రికలు ది గార్డియన్, రాయిటర్స్ సహా టర్కీ లాంటి దేశాల్లోని పత్రికలు సైతం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి ఘనవిజయాలను విశేషంగా కీర్తించాయి. 

గత ఐదు దశాబ్దాలలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా, దేశం ‘కమ్యూనిస్ట్ ముక్త్ భారత్’గా అవతరించింది. పదేళ్ల లెఫ్ట్ ప్రంట్ పాలనతో విసిగిపోయిన కేరళ ప్రజలు కమ్యూనిస్టు కూటమి మీద ఉన్న ద్వేషంతో ప్రత్యామ్నాయంగా ఉన్న యూడీఎఫ్ కూటమికి అధికారం కట్టబెట్టారే తప్ప, యూడీఎఫ్ కూటమి మీదున్న ఆదరణతో కాదని రాజకీయ పండితులు స్పష్టంగా చెప్పారు. ఇది గత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కేసీఆర్ మీద ఉన్న ద్వేషంతో కాంగ్రెస్‌ను గెలిపించిన తరహా విజయమని తేటతెల్లం చేశారు.

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ సానుకూలతను, బిజెపియేతర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టంగా సూచిస్తున్నాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కూటమి పార్టీల అద్భుత విజయం (80 శాతం పైగా స్థానాలు), కాంగ్రెస్ ఘోర పరాభవం దేశ రాజకీయాల్లో వస్తున్న సుదీర్ఘ పరిణామాలను సూచిస్తున్నాయి. 2024 జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఆరు స్థానాల్లో ఆరుగురు ముస్లింలే, పశ్చిమ బెంగాల్లో గెలిచిన రెండు స్థానాల్లో ఇద్దరూ ముస్లింలే, అస్సాంలో 19 గెలిస్తే అందులో 18 మంది ముస్లింలే. ఈ పరిణామాలు కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పినట్టుగా “కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్” అన్న అన్న రీతిలో సాగుతుంది.

దేశంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలైన అస్సాం, బెంగాల్లో బిజెపి రికార్డు విజయాలు హిందువులలో వస్తున్న చైతన్యానికి మరో నిదర్శనంగా భావించవచ్చు. గత కొద్ది సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు, భారత వ్యతిరేక శక్తుల దుస్సాహసాలకు సమాధానంగా అన్నట్టు బంగ్లాదేశ్ చుట్టూ బిజెపి, బిజెపి కూటమి ప్రభుత్వాలతో దేశ సమగ్రతకు బలమైన అడుగులు పడ్డట్టు దేశ ప్రజలు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కంచెకు భూమి ఇవ్వడానికి తిరస్కరించిన మమతా బెనర్జీ దేశద్రోహ చర్యలకు బెంగాల్ ప్రజలు బుద్ధి చెప్పడంతో ఏర్పడిన సువేందు అధికారి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తొలి అడుగుగా 600 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్ కు అప్పగించింది. ఇది బిజెపి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేస్తుంది. 

తమిళనాడులో వచ్చిన ఫలితాలు ద్రవిడవాదానికి ఒక పెద్ద దెబ్బగా రాజకీయ పండితులు భావిస్తున్నారు. డీఎంకే మీది వ్యతిరేకతను తన సినీ గ్లామర్‌తో, అసాధ్యమైన హామీలతో, క్రైస్తవ సానుకూలతతో ప్రచారం చేసుకున్న జోసెఫ్ విజయ్ విజయం ఒకవిధంగా తాత్కాలికమే అయినప్పటికీ, ద్రవిడవాద నిష్క్రమణకు బలమైన అడుగుగా జాతీయవాదులు భావిస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్తు రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బిజెపికి ఒక అద్భుత అవకాశంగా జాతీయవాదులు భావిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల ఫలితాలతో ఆనందభరితంగా ఉన్న తెలంగాణ బిజెపి శ్రేణులు మోదీ సభను దిగ్విజయం చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన వ్యతిరేకతను కూడగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కుటుంబ కలహాలతో ముక్కలు చెక్కలు అవుతూ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ను మట్టికరిపించి, తెలంగాణలోనూ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌కు పట్టం కట్టే రోజులు ఎంతో దూరం లేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు కర్ణాటక ఎన్నికలు ఉండడం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, బిజెపి ఘనవిజయం అన్నట్టు వస్తున్న పరిణామాలు 2028 తెలంగాణ ఎన్నికల్లో బిజెపి విజయాన్ని పక్కా చేస్తున్నాయి.