Ind NZ FTA

మహిళల నేతృత్వంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Ind Nzబ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ కుదుర్చుకున్న కీలకమైన వంటి వాణిజ్య ఒప్పందాల కొనసాగింపుగా న్యూజిలాండ్‌తో తాజాగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ఇటువంటి ఒప్పందాలు అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత లాభదాయకమైన ఆర్థిక వ్యవస్థలలో పోటీపడే శక్తిసామర్థ్యాలను మన ఎగుమతిదారులకు అందిస్తాయి. ఈ ఉభయ తారకమైన ఒప్పందంలో ప్రధానాంశం ఏమిటంటే, అన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను వెంటనే రద్దు చేస్తామని న్యూజిలాండ్ అంగీకరించడం. ప్రస్తుతం మన ప్రధాన ఎగుమతులపై అక్కడ 10 శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. ఈ ఒప్పందంతో ఆ అడ్డంకి తొలగిపోనుంది. ఇది మన దేశంలోని దుస్తులు, తివాచీలు, నూలు, వస్త్రాలు, పాదరక్షలు, బ్యాగులు, బెల్టులు, ఆటోమొబైల్ విడిభాగాలు, యంత్రాలు, పనిముట్లు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళల ఉత్పత్తుల వంటి కార్మికులు ఎక్కువగా ఉండే రంగాలకు భారీ మద్దతును కల్పిస్తుంది. ఉపాధిని కల్పించే ఈ పరిశ్రమలు భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగ (MSME) వ్యవస్థకు వెన్నెముక వంటివి. మార్కెట్ సౌకర్యాలు పెరగడం, ధరల పరంగా పోటీని ఎదుర్కొనే సామర్థ్యం లభించడం వల్ల ఎగుమతులు పెరిగి, తయారీ కేంద్రాలు, చేతివృత్తుల సంఘాలు, చిన్న తరహా పరిశ్రమలలో భారీయెత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం అనుసరిస్తున్న వాణిజ్య విధానం స్ఫూర్తికి ఈ ఒప్పందం అద్దం పడుతోంది. సమ్మిళిత వృద్ధి, సాధికారత, సమష్టి సంక్షేమం దీనికి పునాదులు. వాణిజ్యం కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఒక జాతీయ పరివర్తన సాధనమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఒప్పందంలోని అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే, ఇది భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఈ చర్చలలో పాల్గొన్న బృందంలో దాదాపు అందరూ మహిళలే కావడం గమనార్హం. వీరిలో ప్రధాన చర్చల ప్రతినిధి, ఉప ప్రధాన ప్రతినిథి, వివిధ రంగాల నిపుణులు, న్యూజిలాండ్‌లో భారత రాయబారి కూడా మహిళలే కావడం విశేషం. మోదీ ప్రభుత్వంలో మహిళలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ మైలురాయి ప్రతిబింబిస్తోంది. పాలన, నాయకత్వం, నిర్ణయాధికార ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి జరుగుతున్న విస్తృత ప్రయత్నాలకు ఇది ప్రతీక. తద్వారా జాతీయ అభివృద్ధికి ‘నారీ శక్తి’ ఒక చోదక శక్తిగా మారుతుందని ఇది పునరుద్ఘాటిస్తోంది.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచే విధంగా ఈ ఎఫ్‌టీఏ (FTA)ను అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. కివీ, యాపిల్స్, తేనె వంటి ఉత్పత్తుల కోసం వ్యవసాయ ఉత్పాదకత కార్యాచరణ ప్రణాళికలకు న్యూజిలాండ్ మద్దతు ఇస్తుంది. ఈ కార్యక్రమాలలో మెరుగైన మొక్కల పెంపకం, పరిశోధన సహకారం, రైతుల సామర్థ్య పెంపు, కోత అనంతర చర్యలు, ఆహార భద్రతా వ్యవస్థలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. యాపిల్ సాగుదారులు, సుస్థిర పద్ధతుల్లో తేనెటీగల పెంపకం వంటి ప్రాజెక్టులు ఉత్పత్తి, నాణ్యత ప్రమాణాలను, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతాయి. అదే సమయంలో భారత్ తన కీలక వ్యవసాయ ప్రయోజనాలను దృఢంగా పరిరక్షించుకుంది. పాలు, క్రీమ్, పెరుగు, చీజ్ వంటి పాడి ఉత్పత్తులు, ఉల్లి, శనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం, చక్కెర, కొన్ని రకాల నూనెలు, కొవ్వుల వంటి ఉత్పత్తులను సుంకాల మినహాయింపు పరిధినుంచి తొలగించింది. దీనివల్ల దిగుమతుల నుంచి మన దేశీయ రైతులకు ఎటువంటి పోటీ ఎదురుకాకుండా రక్షణ లభిస్తుంది. వాణిజ్య చర్చలన్నింటిలోనూ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఈ ఒప్పందంలోని మరో ప్రధాన అంశం విద్యార్థులు, నిపుణుల కోసం కల్పించిన మెరుగైన అవకాశాలు. ఇది భారతీయ యువతకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఏ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోనూ లేని విధంగా మొదటిసారిగా న్యూజిలాండ్, భారతీయ విద్యార్థుల రాకపోకలు, చదువు తర్వాత అక్కడ పని చేసుకునే అవకాశాల కోసం ఒక నిర్మాణాత్మక వ్యవస్థను ప్రవేశపెట్టింది. భారతీయ విద్యార్థుల సంఖ్యపై ఎటువంటి పరిమితులు ఉండవు. విద్యార్థులు చదువుకుంటూనే వారానికి కనీసం 20 గంటలు పని చేసుకోవడానికి అనుమతిస్తారు. అలాగే స్టెమ్ (STEM) గ్రాడ్యుయేట్లకు మూడు సంవత్సరాల వరకు, డాక్టరల్ స్కాలర్లకు నాలుగు సంవత్సరాల వరకు చదువు ముగిసిన తర్వాత పని చేసుకునే హక్కు ఉంటుంది. ఐటీ, ఇంజినీరింగ్, ఆరోగ్య సంరక్షణ, విద్య, నిర్మాణం వంటి రంగాలతో పాటు యోగా, ఆయుర్వేదం, భారతీయ వంటకాలు, సంగీత విద్య వంటి సంప్రదాయ రంగాలలో పని చేసే 5,000 మంది భారతీయ నిపుణుల కోసం తాత్కాలిక ఉద్యోగ ప్రవేశ వీసా సదుపాయాన్ని ప్రకటించారు. వీరు ఒకేసారి మూడు సంవత్సరాల వరకు అక్కడ ఉండవచ్చు. అదనంగా, వర్కింగ్ హాలిడే వీసా పథకం ద్వారా ఏటా 1,000 మంది యువ భారతీయులు న్యూజిలాండ్‌లో 12 నెలల పాటు నివసించడానికి, పని చేయడానికి అవకాశం కలుగుతుంది, ఇది సాంస్కృతిక మార్పిడికి, అంతర్జాతీయ ఉపాధి దోహదపడుతుంది.

న్యూజిలాండ్ భారతదేశంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చింది. ఇది తయారీ, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. పెట్టుబడి హామీలు నెరవేరకపోతే భారత్ తగిన చర్యలు తీసుకునేలా ఒక ‘సర్దుబాటు నిబంధన’ (రీబ్యాలెన్సింగ్ క్లాజ్) కూడా ఈ ఒప్పందంలో చేర్చారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పరిశోధన, సాంకేతిక బదిలీ, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కూడా ప్రోత్సహిస్తుంది.

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ (FTA) మన దేశంలో కార్మికులు ఎక్కువగా ఉండే రంగాలకు మార్కెట్ అవకాశాలను కల్పిస్తూనే, దేశంలోని కొన్ని బలహీనమైన రంగాలకు రక్షణ కల్పిస్తూ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల పట్ల అనుసరించిన ఒక స్పష్టమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యూహానికి ఉదాహరణ. గతంలో వాణిజ్య ఒప్పందాలు తగిన జాగ్రత్తలు లేకుండా బలహీనమైన రంగాలను దెబ్బతీసేలా ఉండేవి, కానీ నేడు భారత్ బలమైన, విశ్వసనీయమైన హోదాలో చర్చలు జరుపుతోంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రంగాలకు పూర్తి రక్షణ లభించేలా ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ తన సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో, వాణిజ్య విధానం జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో ఎలా ముడిపడి ఉండాలో ఈ ఒప్పందాలు నిరూపిస్తున్నాయి. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యం దిశగా ప్రయాణిస్తూ, సమ్మిళిత వృద్ధిని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు అవి దోహదం చేస్తాయి.

పీయూష్ గోయల్,
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి