Jual Oram

గిరిజనులు ‘లబ్ధిదారుల’ నుంచి ‘నాయకులు’గా ఎదగాలి

Jual Oramఒకప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించబడిన గిరిజనులు ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, మార్కెట్ నాయకులుగా ఎదుగుతున్నారని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం అన్నారు. ఈ పరివర్తనకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న ఓరం ఒక వాణిజ్య పత్రికకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని వివరించారు. ఈ విధానం దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సుస్థిరమైన అభివృద్ధి, గిరిజనులకు గౌరవాన్ని అందించేందుకు వారి అభివృద్ధి కోసం తపన, వాణిజ్యం, సమ్మిళితత్వం, ఆవిష్కరణలను మేళవిస్తుంది. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: సంక్షేమ ఆధారిత మద్దతు నుంచి మార్కెట్ ఆధారిత వృద్ధికి మారడానికి గిరిజన వ్యవస్థాపకత (వ్యాపార కార్యకలాపాల) ను ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తోంది?

జ: గిరిజన వ్యవస్థాపకతను సంక్షేమ ఆధారిత నమూనాతో కాకుండా వ్యాపార సంస్థల సారథ్యంలో, మార్కెట్ ఆధారిత నమూనావైపునకు మళ్ళిస్తున్నాం. కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, భారతదేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా గిరిజన వర్గాలను శక్తిమంతం చేయడమే మా లక్ష్యం. పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సలహాదారులతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా గిరిజన వ్యవస్థాపకులు ఆధునిక మార్కెట్లు, ఆర్థిక వనరులు, సాంకేతికతను పొందుతున్నారు. ‘ట్రైబల్ బిజినెస్ కాంక్లేవ్ 2025’ వంటి కార్యక్రమాలు గిరిజన ఉత్పత్తిదారులకు, కార్పొరేట్ సంస్థలకు మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని పెంచుతున్నాయి. తద్వారా దేశవ్యాప్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR), సేకరణ, పెట్టుబడులకు అవకాశాలను కల్పిస్తున్నాయి.

  • ఇప్పటికే 4,030 వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా 12 లక్షల మందికి పైగా గిరిజన వ్యవస్థాపకులు సాధికారత సాధించారు.
  • ‘ట్రైబ్స్ ఇండియా’ కింద రూ.3,000 కోట్ల విలువైన గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేశారు.

ఆవిష్కరణ, విస్తరణకు ప్రేరణగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ విజయగాథలను మేం ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ లక్ష్యం స్పష్టం, 2047 నాటికి వికసిత భారత్ సాధనలో గిరిజన వ్యాపారాలను కీలక శక్తిగా మార్చడం.

ప్ర: దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఇళ్లు, రహదారులు, ఆరోగ్య సౌకర్యాలు, నీటిని అందించడానికి ప్రభుత్వం రూ.79,000 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల విషయంలో ఏ విధమైన శ్రద్ధ చూపిస్తోంది?

జ: రూ.79,000 కోట్ల కేటాయింపు కేవలం గణాంకాలు కాదు. ఇది ప్రతి గిరిజన కుటుంబానికి అభివృద్ధిని, గౌరవాన్ని అందించడానికి మా ప్రభుత్వం నిబద్ధతను సూచిస్తుంది. గతంలోలాగా పురోగతి తరచుగా కాగితాలకు పరిమితమయ్యే విధానానికి భిన్నంగా మా దృష్టి క్షేత్ర స్థాయిలో కనిపించే మార్పుపై ఉంది. 75 అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల (ఫైవీటిజిలు) కోసం రూ.24,104 కోట్లతో చేపట్టిన చారిత్రక కార్యక్రమం పీఎం జన్ మన్. దీని కింద:

  • 4.34 లక్షల పక్కా ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 1.04 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
  • 7,200 గ్రామాల్లో ‘హర్ ఘర్ జల్’ (ప్రతి ఇంటికి నీరు) వంద శాతం సంతృప్తత సాధించింది.
  • 687 మొబైల్ మెడికల్ యూనిట్లు 38 లక్షల మంది లబ్ధిదారులకు పైగా ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నాయి.

అదేవిధంగా, ‘ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ కింద 11.45 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, 62,515 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు మంజూరైంది. గిరిజనుల జీవితాలు మెరుగుపరిచేందుకు పట్టుదలతో పనిచేయడం, ప్రతి గిరిజన కుటుంబానికి ప్రాథమిక సౌకర్యాలను సమకూర్చడం, దేశంలో ఇతర పౌరులతో సమానమైన జీవన నాణ్యతను వారు అనుభవించేలా చూడడం మా ప్రభుత్వ లక్ష్యం.

ప్ర: గిరిజన వ్యవస్థాపకులకు ఆర్థిక వనరులు, సాంకేతికత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఇస్తున్న విధానపరమైన, సంస్థాగత మద్దతు వారికి వాస్తవంగా ఎలా ఉపయోగపడుతోంది?

జ: రుణం, సాంకేతికత, మార్కెట్ అవకాశాలను పొందడంలో గిరిజన వ్యవస్థాపకులు ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని మేం అర్థం చేసుకున్నాం. అందుకే మా విధానాలు కేవలం కాగితాలపై కాకుండా, నిజమైన అవకాశాలను సృష్టించడానికి రూపొఇందించాం. ‘ట్రైఫెడ్’, ‘టెక్ ఫర్ ట్రైబల్స్’ కార్యక్రమాలు, బ్యాంకులు, పరిశ్రమ సంస్థలతో సహకారం ద్వారా మేం రుణ సదుపాయాన్ని పెంచుతున్నాం. వ్యాపారరంగంలో శిక్షణ అందిస్తున్నాం. డిజిటల్, మార్కెటింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. వేలమంది గిరిజన వ్యవస్థాపకుల (వ్యాపారుల)కు ఇప్పటికే ఆర్థిక వ్యవహారాలపై అవగాహన, వ్యాపార ప్రణాళిక, ప్యాకేజింగ్‌లలో శిక్షణ అందించాం. ‘ట్రైబల్ బిజినెస్ కాంక్లేవ్’ వంటి వేదికలు వ్యవస్థాపకులను పెట్టుబడిదారులు, సాంకేతిక భాగస్వాములతో నేరుగా కలుపుతాయి. తద్వారా వారు జాతీయ వేదికపై తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, ఆలోచనలను పంచుకునేందుకు వీలవుతుంది. ఈ వ్యవస్థ గిరిజన వ్యాపారాలు స్థిరంగా వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. గిరిజన సమాజాల్లో ఉపాధిని, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. 

ప్ర: ‘రూట్స్ టు రైజ్’ సదస్సులు, కొనుగోలుదారులు-విక్రేతల సమావేశాలు (బయ్యర్–సెల్లర్ మీట్స్) వంటి కార్యక్రమాలు గిరిజన ఉత్పత్తిదారులను ప్రధాన స్రవంతి మార్కెట్లతో అనుసంధానించడానికి ఎలా సహాయపడుతున్నాయి?

జ: ఈ కార్యక్రమాలు మా గిరిజన ఉత్పత్తిదారులకు చాలా ఉపయోగపడుతున్నాయి. మొదటిసారిగా గిరిజన స్టార్టప్‌లు, సంస్థలు తమ ఆలోచనలను పెట్టుబడిదారులకు, ప్రభుత్వ అధికారులకు, కార్పొరేట్ నాయకులకు సమాన భాగస్వాములుగా నేరుగా సమర్పిస్తున్నాయి. ఈ సెషన్లు మార్గదర్శకత్వం, నిధుల లభ్యత, దీర్ఘకాలిక వ్యాపార అనుసంధానాలను పెంపొందిస్తాయి. కొనుగోలుదారులు–విక్రేతల సమావేశాలు ముఖ్యంగా చేతిపనులు, అటవీ ఉత్పత్తులు, సేంద్రీయ వస్తువుల ఉత్పత్తిదారులను, నిజాయితీకి, స్థిరత్వానికి విలువ ఇచ్చే టోకు కొనుగోలుదారులతో అనుసంధానించడానికి వీలు కల్పిస్తాయి. ఈ వేదికల ద్వారా మేం సంప్రదాయ జ్ఞానానికి, ఆధునిక మార్కెట్లకు మధ్య వారధులు నిర్మిస్తున్నాం. భారతదేశ గిరిజన వర్గాల సృజనాత్మకత, నైపుణ్యానికి గిట్టుబాటైన ధరలు, స్థిరమైన ఆదాయాలు, గుర్తింపు కల్పిస్తున్నాం. ఇది స్థానిక సామర్థ్యాన్ని జాతీయ స్థాయి అవకాశంగా మార్చుతుంది. 

ప్ర: కొండ ప్రాంతాల నుంచి వచ్చిన కలనాది వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని ప్రియాంక గాంధీ వాద్రా మిమ్మల్ని కోరారు. మీరు ఆమె అభ్యర్థనకు స్పందించారా?

జ: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటువంటి అభ్యర్థనలన్నింటినీ చాలా తీవ్రంగా పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకమైన, సంప్రదింపుల ప్రక్రియను అనుసరిస్తుంది. ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపాదన నిర్దేశిత ప్రమాణాలు, వివిధ స్థాయిలలోని సిఫార్సులకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ పరిశిలిస్తారు. ఎల్లప్పుడూ నిష్పాక్షికత, సమ్మిళితత్వం, రాజ్యాంగ, విధానపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండేందుకే ప్రాధాన్యమిస్తాం. 

ప్ర: ఇటీవల మీరు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఎందుకు?

జ: గిరిజన వర్గాల సంక్షేమంపై నా నిబద్ధత మారలేదు. ఎన్నికల రాజకీయాలలో ఉన్నా లేదా లేకున్నా, సాధ్యమైన ప్రతి సామర్థ్యంలో నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను.