Aleti Maheshwar Reddy

ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం

nlg aletiరాష్ట్రంలో కొనుగోలు చేసే ధాన్యంలో 7% పైగా తూకంలో కోత పెట్టి సంవత్సరానికి రూ.2800 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఈ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నవంబర్ 18న 24 గంటల పాటు చేపట్టిన రైతు నిరాహార దీక్ష కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం నిరాహార దీక్ష చేస్తున్న నాయకులతో దీక్షను విరమింపజేశారు. 

ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ లో చేసిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో చేతికి రాకుండా పోవడం బాధాకరం అన్నారు. పంట నష్ట పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో నష్టపరిహారం ఇవ్వడం లేదని, కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అమలు పరిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్రం లో అమలు పరచకుండా రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. పంట కొనుగోలులో కూడా తేమ, తరుగు పేరిట సంచికి 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాల్ కు దాదాపు 7 కిలోల మేర కోతపెడుతున్నారు. రైతు సంఘాల లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. 5 లక్షల ఎకరాలకైనా పంట నష్ట పరిహారం ఇస్తారనుకుంటే, కేవలం 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి చెప్తున్నారు. అది కూడా కేవలం ఎకరానికి రూ.10 వేలు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఎకరానికి పెట్టుబడి 30 నుండి 40 వేల రూపాయలు ఖర్చయితే పెట్టుబడి సాయం ఎగ్గొట్టి, ఇప్పుడు నష్టపరిహారం సైతం రూ.10వేలే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సీజన్ రైతుబంధు ఎగొట్టారు, రెండు సీజన్ ల బోనస్ ఎగ్గొట్టారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకు ఇస్తామంటూ ముఖ్యమంత్రి మాట మారుస్తున్నారని అన్నారు. బూటకపు మాటలు చెప్తూ ప్రజలను, రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. 

విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మహిళలను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. విద్యార్థులకు దాదాపు రూ.10వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేస్తున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500, విద్యార్థినిలకు స్కూటీలు, నిరుద్యోగులకు భృతి, ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యమాల గడ్డ నల్గొండ మీద మొదలైన ఈ ఉద్యమం ప్రతీ జిల్లాకు విస్తరింప జేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, చెల్లా శ్రీలత రెడ్డి, జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.