jubilee hills board

జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు కోల్పోయిన బీఆర్ఎస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిటింగ్ సీటు కోల్పోయింది. మాగంటి గోపీనాథ్ మృతి వచ్చిన ఈ ఉపఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునితను బరిలో దింపి సానుభూతితో ఓట్లను సొంతం చేసుకోవాలనుకున్న బీఆర్ఎస్ పాచికలు పారలేదు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే సానుకూలతలరీత్యా ఈ సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అదీ ఎంఐఎం మద్దతు తీసుకొని, మద్యం పారించి, డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగానికి పాల్పడి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించింది. నియోజకవర్గంలోనే రాష్ట్ర మంత్రులు మకాం వేసి, ముఖ్యమంత్రి చివరి ఏడు రోజులు ర్యాలీలు, సభలు, సమావేశాలతో ప్రచారం నిర్వహించి చచ్చీచెడి గెలిచింది. సాధారణంగా ఒక ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఈ స్థాయిలో ప్రచారంలో పాల్గొనరు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన నిరాశలో కూరుకుపోయి ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకున్నారు. తనకు బాగా అలవాటైన గాలి మాటలు, బూటకపు హామీలు, అబద్ధపు వాగ్దానాలు గుప్పించారు.

98,988 ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో గెలిచాడు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితకు 74,259 ఓట్లు పోలయ్యాయి. తీవ్రమైన వ్యతిరేక పరిస్థితుల్లోనూ బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 17,061 ఓట్లు సాధించారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కాదు, అది ఎంఐఎంకు ఇచ్చిన తీర్పు. మజ్లిస్ అండతో కాంగ్రెస్ గెలిచింది. ఓవైసీలు చెప్పారని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నుండి పోటీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి, అజారుద్దీన్ కు అకస్మాత్తుగా మంత్రి పదవి ఇచ్చి, పెద్దసంఖ్యలో ఓట్లు ఉన్న ముస్లింల సంతుష్టీకరణను పరాకాష్టకు చేర్చి హస్తం పార్టీ గట్టెక్కింది. సహజంగా ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దీనిని రేవంత్ పాలనకు రిఫరెండంగా భావించలేం. రేవంత్ రెడ్డి ఏం చేశాడని జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటు వేస్తారు? నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందుకు ఓటేశారా? డబ్బులు పంచి కాంగ్రెస్ గెలిచింది.

బిజెపికి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయనడంలో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బిజెపి, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 8 సీట్లు సొంతం చేసుకుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను చూస్తే 57 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడింట్లో రెండుచోట్ల గెలిచింది. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, టీచర్లు బిజెపిని గెలిపించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి మరింత విస్తరిస్తుంది.

జూబ్లీహిల్స్ ఫలితాలపై రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పందిస్తూ.. ‘‘జూబ్లీహిల్స్‌లో బిజెపికి ఓటు వేసిన ప్రజలకు, పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. అది బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు అయినప్పటికీ, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించాం. ఇది ప్రజల తీర్పు కాదు. డబ్బు, అధికారం, ప్రలోభాలతో కాంగ్రెస్ అక్కడ గెలిచింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయం మారుతుంది, తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ప్రజా వంచన పార్టీ అయిన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతాం. రేపు రాబోయే ఎన్నికల్లో బిజెపిదే విజయం అవుతుంది.’’ అని అన్నారు.

కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏనాడూ గెలవలేదు. కార్పొరేటర్ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో గెలవలేదు. అయినా ప్రయత్నం చేస్తున్నాం. బిజెపి ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డాం. రాజకీయ పార్టీగా మేం చేయాల్సిన పనిని చేశాం. ఫలితాన్ని సమీక్షించుకుంటాం. మరింత కష్టపడి పనిచేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తాం. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కోట్లాది రూపాయలను పంచాయి. పోలింగ్ బూత్ ముందు, ఎన్నికలకు ఒకరోజు ముందు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. దీనికి బాధ్యులెవరో తెలియదా? డబ్బులు పంపిణీ చేసినందుకే కాంగ్రెస్ గెలిచింది.’’ అని అన్నారు.