పంట కోత అనంతర నష్టాలకు తెర
భారతదేశంలో వ్యవసాయ రంగం ఒక ముఖ్యమైన జీవనాధారం. కోత అనంతర నష్టాలను తగ్గించడంలో ఈ రంగం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు వంటి త్వరగా పాడైపోయే వస్తువుల విషయంలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంది. సరైన నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ వసతులు లేకపోవడం వల్ల భారీ మొత్తంలో ఉత్పత్తులు పాడైపోయి నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం రైతుల మనుగడను దెబ్బతీయడమే కాకుండా వినియోగదారులకు ధరలు పెరగడానికి, ఆహార భద్రత ప్రమాదంలో పడటానికి దారితీస్తోంది. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) లో భాగంగా ‘సమగ్ర శీతల గిడ్డంగుల గొలుసు, విలువ జోడింపు మౌలిక వసతుల పథకం’ (ICCVAY) ని ప్రారంభించింది.
శీతల గిడ్డంగుల గొలుసు పథకం లక్ష్యం
ICCVAY పథకం ముఖ్య లక్ష్యం రైతు పొలం నుంచి రిటైల్ దుకాణం వరకు ఎలాంటి అవాంతరాలు లేని శీతల గిడ్డంగుల గొలుసు వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇది కోత అనంతర నష్టాలను తగ్గించడంపై, రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది. ఈ పథకం 2016కి ముందే ప్రారంభమైనా సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడానికి, మౌలిక వసతులను సృష్టించడానికి, త్వరగా పాడైపోయే వస్తువులకు మార్కెట్ అనుసంధానతను బలోపేతం చేయడానికి 2016-17లో PMKSY కింద దీనిని పునర్నిర్మించారు. PMKSY అనేది వ్యవసాయ మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించడం, లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం, శీతల గిడ్డంగుల వ్యవస్థను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా చేపట్టిన ఒక పెద్ద కార్యక్రమం. రైతులు, ప్రాసెసర్లు, మార్కెట్లను కలుపుతూ ICCVAY వృథాను తగ్గిస్తుంది, ఉపాధిని ప్రోత్సహిస్తుంది, దేశంలోని త్వరగా పాడైపోయే వస్తువుల రంగం సామర్థ్యాన్ని పెంచుతుంది. శీతల గిడ్డంగుల గొలుసు మౌలిక వసతులు కేవలం నిల్వకు మాత్రమే పరిమితం కావు. ఇందులో పొలాల వద్ద ప్రీ-కూలింగ్ వ్యవస్థలు, అత్యాధునిక ప్రాసెసింగ్ కేంద్రాలు, సమర్థమైన పంపిణీ కేంద్రాలు, ఉష్ణోగ్రత-నియంత్రిత రవాణా కూడా ఉన్నాయి. ICCVAY పరిధిలో పాడి ఉత్పత్తులు, మాంసం, కోడి మాంసం, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు మినహా), ఉద్యాన ఉత్పత్తులు (పండ్లు, కూరగాయలు మినహా – వీటిని ఇప్పుడు వేరే పథకం, ఆపరేషన్ గ్రీన్స్ కిందకు మార్చారు) వంటి కీలక వ్యవసాయ రంగాలు ఉన్నాయి.
పథకం పునర్నిర్మాణం, సమీక్ష
సహాయాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం 2022లో ICCVAY ని పునర్వ్యవస్థీకరించింది. పండ్లు, కూరగాయలు, రొయ్యలను ఆపరేషన్ గ్రీన్స్ పథకానికి మార్చారు. ఈ ఆపరేషన్ గ్రీన్స్ PMKSY కింద ఉన్నప్పటికీ, ఉద్యాన ఉత్పత్తులలో సరఫరా గొలుసులను స్థిరీకరించడం, ధరల అస్థిరతను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఈ పునర్వ్యవస్థీకరణ ఒకే పనిని వివిధ స్థాయిల్లో చేయడాన్ని నివారించడమే కాకుండా త్వరగా పాడైపోయే వివిధ రకాల వస్తువులపై మరింత దృష్టి కేంద్రీకరించి సహాయాన్ని అందించడానికి వీలు కల్పించింది. 2020లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ జరిపిన ఒక పరిశీలన ప్రకారం, ICCVAY పథకం పండ్లు, కూరగాయలు, డెయిరీ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో వృథాను గణనీయంగా తగ్గించింది.
లక్ష్యాలు, ఆర్థిక సహాయం
ICCVAY ప్రధాన లక్ష్యం త్వరగా పాడైపోయే వస్తువులను సంరక్షించడానికి, ప్రాసెస్ చేయడానికి, రవాణా చేయడానికి బలమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా, సరఫరా గొలుసు అంతటా కోల్డ్ స్టోరేజ్, రిఫ్రిజిరేషన్, విలువ జోడింపు యూనిట్లు అందుబాటులో ఉండేలా ఈ పథకం చూస్తుంది. ఇది పొలం స్థాయిలో మౌలిక సదుపాయాలు, పంపిణీ కేంద్రాలు, ఉష్ణోగ్రత-నియంత్రిత రవాణా వ్యవస్థల మధ్య అనుసంధానతను కూడా బలోపేతం చేస్తుంది. ఈ పథకం డిమాండ్ ఆధారితమైనది. రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు (FPOలు), స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి వివిధ సంస్థలు ఆహార శుద్ధి యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న నిధులను బట్టి మంత్రిత్వ శాఖ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ సహాయం గ్రాంట్లు లేదా సబ్సిడీల రూపంలో ఉంటుంది. సాధారణ ప్రాంతాలలో ప్రాజెక్ట్ ఖర్చులో 35 శాతం వరకు, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలు వంటి దుర్గమ ప్రాంతాలలో 50 శాతం వరకు కవరేజీని ఈ పథకం అందిస్తుంది.
జూలై 2025లో కేంద్ర మంత్రివర్గం PMKSY (కిసాన్ సంపద యోజన) కోసం అదనంగా రూ.1,920 కోట్లు కేటాయించింది. దీంతో 15వ ఆర్థిక సంఘం కాలానికి (మార్చి 31, 2026 వరకు) మొత్తం బడ్జెట్ రూ.6,520 కోట్లకు పెరిగింది. పెంచిన ఈ నిధులు ICCVAY విభాగం కింద 50 బహుళ ఉత్పత్తుల ఆహార రేడియేషన్ శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు మద్దతు ఇస్తాయి. ఇది శీతల గిడ్డంగుల గొలుసు మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం నిబద్ధతను తెలియజేస్తుంది.
ఇవిగాక ICCVAY పథకానికి మద్దతుగా అనేక ఇతర కార్యక్రమాలు ఉన్నాయి:
- ఉద్యాన పంటల సమీకృత అభివృద్ధి కార్యక్రమం: కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యాల నిర్మాణం, విస్తరణ, ఆధునికీకరణకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
- ఆపరేషన్ గ్రీన్స్ పథకం: టొమాటో, ఉల్లి, బంగాళాదుంపలతో ప్రారంభమై ఇప్పుడు విస్తృత శ్రేణి పండ్లు, కూరగాయలు, రొయ్యలను కూడా కవర్ చేస్తుంది. కోత అనంతర నష్టాలను తగ్గించడం దీని లక్ష్యం.
- జాతీయ ఉద్యాన పంటల బోర్డు: ఉద్యాన ఉత్పత్తుల కోసం కోల్డ్ స్టోరేజ్, నియంత్రిత ఉష్ణోగ్రత స్టోరేజ్ సౌకర్యాల నిర్మాణానికి సబ్సిడీలు అందిస్తుంది.
- వ్యవసాయ మౌలిక వసతుల నిధి: కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ సౌకర్యాలు వంటి పంట కోత అనంతర నిర్వహణ మౌలిక వసతులను బలోపేతం చేయడానికి రూ.1 లక్ష కోట్ల నిధితో రుణాలు, వడ్డీ రాయితీలు అందిస్తుంది.
సాధించిన విజయాలు, పురోగతి
ICCVAY భారతదేశ శీతల గిడ్డంగుల గొలుసు మౌలిక సదుపాయాలను మార్చడంలో గణనీయమైన పురోగతి సాధించింది. జూన్ 2025 నాటికి ఈ పథకం కింద 395 ప్రాజెక్టులను ఆమోదించారు. వాటిలో 291 అమలులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 25.52 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) నిల్వ సామర్థ్యానికి, 114.66 LMT ప్రాసెసింగ్ సామర్థ్యానికి దోహదపడ్డాయి. అంతేకాకుండా అమలులో ఉన్న ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 1.7 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించాయి. 2016-17 నుంచి నిధుల విడుదల వేగం పుంజుకుంది. 269 ఆమోదిత ప్రాజెక్టులకు రూ.1535.63 కోట్లు కేటాయించారు. ఫలితంగా 169 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇది శీతల గిడ్డంగుల గొలుసు సామర్థ్యాలను గణనీయంగా పెంచి వివిధ రంగాలలో వృథాను తగ్గించింది.
ICCVAY దేశ వ్యవసాయ, ఆహార శుద్ధి రంగంలో కీలకమైన భాగంగా మారింది. ఇది కోత అనంతర నష్టాలను తగ్గించి, రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. నిరంతర ప్రభుత్వ పెట్టుబడి, వ్యూహాత్మక మార్పుల ద్వారా ఈ పథకం సమగ్ర శీతల గిడ్డంగుల గొలుసు మౌలిక సదుపాయాలను సృష్టించడంలో, వృథాను తగ్గించడంలో, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడంలో విజయం సాధించింది. భారత్ తన వ్యవసాయ మౌలిక సదుపాయాల ఆధునికీకరణను కొనసాగిస్తున్నందున ICCVAY భవిష్యత్తులో IOT (ఇంటర్నెట్ అఫ్ థింగ్స్), కృత్రిమ మేధ (AI), ఇంధన సామర్థ్యం గల వ్యవస్థలు వంటి అధునాతన సాంకేతికతలను ఇందుకు మరింత అనుసంధానించే అవకాశం ఉంది. ఇది దేశంలో కోత అనంతర సరఫరా గొలుసుల అభివృద్ధికి మరింత సుస్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను ఆవిష్కరిస్తుంది.

