ప్రజ్వరిల్లిన స్వావలంబన స్ఫూర్తి
గత కొద్ది నెలలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తులను, స్వావలంబనను స్వీకరించాలని ప్రజలకు నిరంతరం పిలుపునిస్తున్నారు. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’ వంటి కార్యక్రమాల ద్వారా పరాధీనతను తగ్గించి, ఆత్మనిర్భరత (స్వావలంబనను) సాధించేందుకు గట్టిగా కృషి చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ దార్శనికత ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం) కార్యక్రమంగా రూపాంతరం చెందింది. ఆగస్టు 15న, ‘మన్ కీ బాత్’, అనేక బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన సందేశాన్ని పునరుద్ఘాటించారు. స్వదేశీని స్వీకరించడం కేవలం నినాదం కాదు, అది జాతీయ బాధ్యత.
ఈ రెండు మూడు నెలల కాలం దేశవ్యాప్తంగా పండగల సమయం. వినాయక చవితి, విజయదశమి, దీపావళి, ఛట్ పూజ, వాటికి సంబంధించిన అనేక మతపరమైన పండుగలు, కొన్ని రాష్ట్రాలలో ఆయా నూతన సంవత్సరాల ప్రారంభం, ముస్లింలు జరుపుకునే ఈద్ – ఇవన్నీ సమాజంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకువస్తాయి. ఇళ్లు అలంకరించుకోవడం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం, మిఠాయిలు పంచుకోవడం, కొత్త దుస్తులు ధరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేవి సహజమైన సామాజిక పద్ధతులు. ఈ కాలంలో అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతిని ఖాదీ దినోత్సవంగా కూడా జరుపుకొన్నాం. ఈ సంప్రదాయం, ఉత్సాహం స్వదేశీ, ఆత్మనిర్భరతకు పునాది అయ్యేందుకుగాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని, స్వదేశీ ఉత్పత్తులతో ఇళ్లను అలంకరించాలని, స్వదేశీ ఉత్పత్తులతో జీవితాలను మెరుగుపరుచుకోవాలని’ పిలుపునిచ్చారు. గణేశ్ నవరాత్రుల సమయంలో కూడా దేశంలో తయారు చేసిన బహుమతులు, దేశంలో నేసిన దుస్తులు, ఇక్కడే తయారు చేసిన అలంకరణ సామాగ్రి, దేశంలో తయారు చేసిన దీపాలతో సహా స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా చెప్పారు. శ్రామికులు, కార్మిక వర్గంపై దృష్టి సారిస్తూ ఆయన ఇలా అన్నారు, “ఎవరిదో డబ్బు, మన వస్తువులు, మన ఉత్పత్తి కానీ సువాసన నా దేశపు నేలది, నా భరతమాతది.” ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు కేవలం భావోద్వేగమైనది కాదు; దాని మూలాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారతలో ఉన్నాయి. ఈ భావన భావోద్వేగం కంటే ఎక్కువ, ఎందుకంటే ఇది భారతదేశ కార్మిక వర్గాన్ని ఉద్ధరించడం లక్ష్యంగా చేసుకున్న ఆర్థిక తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చారిత్రకంగా భారతీయ సమాజం స్వయంసమృద్దమైన సమూహాల వ్యవస్థగా పనిచేసింది.
ప్రతి ఒక్కరూ సాంప్రదాయ నైపుణ్యాలు, హస్తకళల ద్వారా పరస్పర అవసరాలు తీర్చుకునేవారు. మహాత్మా గాంధీ ‘హింద్ స్వరాజ్’లో రాసినట్టుగా ఈ స్వయంసమృద్ధి భారతదేశ స్థితిస్థాపకతకు (పరిస్థితులకు అణుగుణంగా మారే స్వభావానికి) పునాదిగా ఉంది. దీపావళి సందర్భంగా ఉపయోగించే దీపాలు, ఖాదీ, చేనేత ఉత్పత్తులు, కొవ్వొత్తులు, బాణాసంచా, పూలదండలు, బొమ్మలు, పూజా సామాగ్రి, బూట్లు, ఆభరణాలు, మిఠాయిలు మొదలైన అనేక ముఖ్యమైన పండుగ వస్తువులు కుమ్మరులు, చర్మకారులు, కుటీర, చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే మహిళల ద్వారా, గిరిజన వర్గాల అటవీ ఉత్పత్తుల నుంచి తయారవుతాయి. అయితే దిగుమతి చేసుకున్న వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తడం ప్రారంభించినప్పుడు ఈ కార్మికులలో చాలా మంది తమ జీవనోపాధిని కోల్పోయారు. విదేశీ తయారీ ఉత్పత్తుల నీడలో పేదవాడి దీపావళి మసకబారిపోయింది.
దేశీయ వాణిజ్యానికి పునరుత్తేజం
ఈ సంవత్సరం పండుగ సీజన్లో దేశీయ వాణిజ్యం అద్భుతంగా పుంజుకుంది. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) ‘దీపావళి 2025’ సర్వే ప్రకారం వ్యాపార కార్యకలాపాలు 2024లో రూ.4.25 లక్షల కోట్లు ఉండగా అది ఈ ఏడాది రూ 5.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే 25 శాతం వృద్ధి. సహకార, వ్యవసాయ రంగాలు కాక మిగిలిన రంగాల్లో దాదాపు 9 కోట్ల చిన్న సంస్థల వ్యాపారంలో ఈ వృద్ధి చోటుచేసుకుంది. ఒక్క సేవా రంగంలోనే రూ.65,000 కోట్ల వ్యాపారం జరిగింది. వ్యాపారులలో దాదాపు 72 శాతం మంది ఈ వృద్ధికి జీఎస్‌టీ తగ్గింపు ఫలితమేనని నమ్ముతున్నారు. అయితే 87 శాతం మంది కొనుగోలుదారులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వదేశీ పిలుపునకు మద్దతుగా దేశీయ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారు. ఈ కాలంలో సుమారు 50 లక్షల మంది స్వల్పకాలిక ఉపాధి అవకాశాలను కూడా పొందారు, మొత్తం అమ్మకాలలో 28 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలో జరిగాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కుమ్మరుల సాధికారత కార్యక్రమం, అలాగే వస్త్ర, లోహపు పని, వడ్రంగి పని, వెదురు రంగాలను ప్రోత్సహించే పథకాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాల ద్వారా ఈ రంగాల్లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తోంది. తాజా మార్కెట్ విశ్లేషణ నివేదిక ప్రకారం భారతదేశ పండుగ సీజన్ లో వినియోగదారుల వ్యయం రూ.12–14 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రధానమంత్రి ‘ఖద్దర్ ఫర్ నేషన్, ఖద్దర్ ఫర్ ఫ్యాషన్’ అనే పిలుపునిచ్చిన తరువాత ఖాదీ అమ్మకాలు 2014తో పోలిస్తే అద్భుతమైన 447 శాతం వృద్ధి నమోదు చేసుకున్నాయి. ఖాదీ ఉత్పత్తుల విలువ 2014లో రూ.3,154 కోట్ల నుంచి 2025లో రూ.1.71 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ అద్భుతమైన వృద్ధి ఖాదీ రంగంలో పది లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించింది.
అంత్యోదయ స్ఫూర్తి
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయను దేశ నిర్మాణానికి కేంద్రబిందువుగా పరిగణించారు. ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి సమాజంలోని అన్ని వర్గాలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వెనుకబడిన వర్గాలను, దళితులను, మహిళలను సాధికారీకరించింది. జీవనోపాధి అవకాశాలను అందించింది. ఈ పండుగ సీజన్ లో వచ్చే ఆదాయం సాధారణ పౌరుల కొనుగోలు శక్తిని పెంచుతుంది, మార్కెట్‌ను ఉత్తేజపరుస్తుంది, మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. తద్వారా భారత్ అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలను నిబ్బరంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది.
శివ్ ప్రకాష్,
బిజెపి సంస్థాగత జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి

