Indi alliance

పతనం దిశగా కుటుంబ పార్టీలు

రాష్ట్ర, జాతీయ స్థాయి భారతీయ ఎన్నికలలో కనిపిస్తున్న ధోరణులు వంశపారంపర్య రాజకీయ పార్టీల పతనానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. కుల ఆధారిత ఓటింగ్ సరళి కనుమరుగవుతోంది. ప్రభుత్వ విధానాల గురించి చైతన్యం, అవగాహన పెరుగుతున్నాయి. మధ్యతరగతి, నయా మధ్యతరగతి, పేదలు వాస్తవాలను గ్రహించి, తప్పుడు ప్రచారాలను నిరాకరిస్తున్నారు. డిజిటల్ యుగం ప్రతి గ్రామంలోని అట్టడుగు స్థాయి వరకు గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కొత్త, యువతరం తప్పుడు ప్రచారాలకు లొంగకుండా, సుసంపన్నమైన సమాజం, దేశం కోసం పని చేస్తోంది. అమెరికా, యూరప్, చైనాలో చూసిన విధంగా మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధి, ఆధునికీకరణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. అందుకే యువతరం సంతోషంగా ఉంది.

అభివృద్ధి, అంతర్గత, బాహ్య భద్రతలను పట్టించుకోకుండా ప్రజలు వంశాలను, గాంధీ కుటుంబాన్ని విశ్వసించి ఓటు వేసినప్పటితో పోలిస్తే ప్రస్తుత ఆలోచనా సరళి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రజలలో పెరుగుతున్న దేశభక్తి భావాలు, అభివృద్ధి, భద్రతను కోరుకునే ధోరణి, మెరుగుపడుతున్న అంతర్జాతీయ ప్రతిష్ఠ – ఈ అంశాలు వంశపారంపర్య పార్టీల స్వార్థ ప్రయోజనాలను, ప్రజల కంటే, దేశం కంటే అధికారం ముఖ్యమనే వారి వైఖరిని ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా, వారు వివాదాలను, హింసను ఆశ్రయిస్తున్నారు. వారి చర్యలు చాలావరకు దేశానికి, దాని సంస్కృతికి విరుద్ధంగా ఉంటున్నాయి. రాహుల్, ప్రియాంక గాంధీల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, వరుసగా అత్యంత పేలవమైన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. అభివృద్ధిపై దృష్టి సారించడం, ప్రజల దృక్పథాలను మార్చడానికి స్థానికంగా పనిచేయడం మానేసి వారు తప్పుడు కథనాలతో రాజ్యాంగ వ్యవస్థలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, మన అద్భుతమైన ప్రజాస్వామ్యం ప్రతిష్టను అంతర్జాతీయంగా మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈవీఎంల ఆరోపణలు విఫలమవడంతో ఇప్పుడు వారు ‘ఓటు చోరీ’ ఆరోపణలు, ఎన్నికల సంఘంపై దృష్టి సారిస్తున్నారు. వారు ప్రతి ఎన్నికలో గెలవాలని ఆరాటపడుతున్నారు, వారి వ్యూహం హిందువులను కులాలవారీగా చీల్చి, తద్వారా ముస్లింలు, చీలిపోయిన హిందువుల మద్దతుతో గెలవడం. అయితే బీహార్ ఓటర్లు వారికి అతి తక్కువ సీట్లు ఇచ్చి తమ వైఖరిని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పరిస్థితిని ఒకసారి గమనించండి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 మంది ఎమ్మెల్యేలకు గాను ఆ పార్టీకి కేవలం ఇద్దరే ఉన్నారు. మహారాష్ట్ర: 288 మంది ఎమ్మెల్యేలకుగాను కేవలం 16 మంది ఉన్నారు. బీహార్లో మొత్తలు 243 సీట్లలో ఆ పార్టీ బలం 6. పశ్చిమ బెంగాల్లో 294 సీట్లలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా లేదు. ఇవి దేశంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగు రాష్ట్రాలు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎప్పుడూ రాహుల్ గాంధీ రాజీనామాను కోరలేదు.

ఏ పార్టీ అయినా ‘దేశం ప్రథమం’ అనే నియమాన్ని పక్కనపెట్టి ‘కుటుంబం ప్రథమం’ అనే సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇస్తే దేశప్రజల సమస్యలు, అభివృద్ధి ఎజెండా వెనుకబడిపోతాయి. దేశం గురించి ఆలోచించకుండా సమాజానికి, దేశానికి హానిచేసే ఎజెండాను ముందుకు తెస్తున్నారు. భారత్ ప్రతిష్ఠను విదేశాల్లో తీవ్రంగా దెబ్బతీయడానికి, ముఖ్యంగా తప్పుడు కథనాలతో హిందూ సమాజంలో విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి రాజకీయ ప్రచారాలు, చర్యలు భారత్ ను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శక్తులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా అధికారాన్ని పొందలేక మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు హింసాత్మక తిరుగుబాటును ప్రేరేపించడానికి యువతను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే యువతరం వారి దురుద్దేశాలు పసిగట్టి వారి వలలో పడటం లేదు. అనేక సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలను, నిరుపేదలను నేరుగా చేరుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అంకితభావం కలిగిన ‘మోదీ ఓటర్లు’ అనే కొత్త వర్గం ఏర్పడింది. బీహార్ కూడా దీనికి మినహాయింపు కాదు.

పంకజ్ జె జైస్వాల్