Bandi Sanjay Kumar

హిందుత్వం ఆగిపోయిందంటే నా శ్వాస ఆగిపోయినట్లే!

bsk karimnagarవరేమనుకున్నా హిందుత్వం గురించి మాట్లాడుతూనే ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. నా నోటి నుండి హిందుత్వం ఆగిపోయిందంటే అదే రోజు నా శ్వాస ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. హిందుత్వ నినాదాన్ని గడప గడపకూ తీసుకెళ్లి తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. అన్నికలొస్తే మసీదుల్లో ఇమామ్, మౌలానాలంతా ముస్లింలందరితో ప్రతిజ్ఞ తీసుకుని బిజెపికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. 

నవంబర్ 18న హుజూరాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకుల సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలపై రూపొందించిన ‘కరపత్రం’తో పాటు సంతకాల సేకరణ పత్రాలను విడుదల చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనా, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై ఈనెల 26న కరీంనగర్ పార్లమెంట్ పరధిలో ఇంటింటికీ వెళ్లి సంతకాల సేకరణ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ.. ‘‘పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వవానికి చిత్తశుద్ధి లేనేలేదు. కేవలం కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఏ ఒక్క గ్రామ పంచాయతీకైనా నయాపైసా ఇచ్చిందా? రేపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేస్తే ఎక్కడి నుండి పైసలు తీసుకొస్తారు? ఎమ్మెల్యేకు కూడా సొంతంగా నిధులు లేనేలేవు. పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాదు. పంచాయతీల నిధులు ఇచ్చేది కేంద్రమే. 15వ సంఘం నిధులు, ఎంపీ లాడ్స్, జాతీయ ఉపాధి హామీ, సడక్ యోజన సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ కేంద్రమే నిధులిస్తోంది. అట్లాంటప్పుడు కాంగ్రెస్ కు ఓటేసి ఏం లాభం? బిజెపిని గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’ నిర్వహించాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ఏం సాధించారని తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ‘‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’’ కాదు…. ‘‘తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ (తెలంగాణ పతన వేడుకలు) నిర్వహించుకుంటే బాగుండేది. లేకపోతే కాంగ్రెస్ సింకింగ్ ఫెస్టివల్ (కాంగ్రెస్ దిగజారుడు ఉత్సవాలు) నిర్వహిస్తామంటే బాగుండేది. మార్పు తెస్తామంటూ కాంగ్రెస్ ‘‘అభయ హస్తం’’ పేరుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు కదా? ఎన్ని అమలు చేశారో చెప్పండి. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊదరగొట్టారు కదా? మహిళలకు ప్రతినెలా రూ.2,500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? ఏటా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇచ్చారా? నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్నారు కదా ఏమైంది? ఏడాదిలో లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు ఎందుకు చేయలేదు? పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానన్నారు కదా? వృద్ధులకు ప్రతినెలా రూ.4 వేల పెన్షన్, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా ఢంకా బజాయించి చెప్పారు ఏమైంది?’’ అని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ ఇంఛార్జీ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, తదితరులు హాజరయ్యారు.