మోదీ సహకారంతో తెలంగాణ అభివృద్ధి
దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ జూన్ 10న ఒక కొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 4,399 రోజులు ప్రధాని పదవిలో కొనసాగి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించారు. ఈ ఘనత సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలు, విజయాలను కాంక్షించారు. ఇటు తెలంగాణలోనూ బిజెపి నాయకులు, కార్యకర్తలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని శ్రీమహాశక్తి ఆలయంలో, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ నార్సింగిలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు మోదీ యోగక్షేమాలను కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ పదేళ్ల పాలన దేశ దశను, దిశను మార్చేసిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీపై దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు గారు మాట్లాడుతూ.. “ప్రజాసేవ, సుపరిపాలన, దేశ భద్రత.. ఇలా ప్రతి విషయంలోనూ మోదీ దేశాన్ని ప్రపంచ వేదికపై తలెత్తుకునేలా చేస్తున్నారు. గత పన్నెండు ఏళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. ఆయన నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ వైపు దూసుకుపోతోంది.” మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండి, దేశానికి మరిన్ని ఏళ్లు సేవలందించాలని, దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేక హారతి, పూజలు నిర్వహించామని తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, లక్షల కోట్ల రూపాయల విలువైన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అందించిందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. 2014కు ముందు యూపీఏ కాలంలో కేంద్ర పన్నుల పంపిణీ రాష్ట్రాలకు కేవలం 32 శాతం మాత్రమే ఉండేదని, అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రాష్ట్రాలకు అధిక వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల పంపిణీని ఏకంగా 42 శాతానికి పెంచారని, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో ప్రస్తుతం రాష్ట్రాలకు 41 శాతం పన్నుల పంపిణీ కొనసాగుతోందని వివరించారు. దీనికి తోడు ఆర్థిక సంఘం సిఫారసులు, స్థానిక సంస్థలకు కేటాయింపులు కలిపి దాదాపు 49 శాతం వరకు కేంద్ర వనరులు రాష్ట్రాలకే చేరుతున్నాయని, ఇది దేశ చరిత్రలోనే రాష్ట్రాలకు జరిగిన అత్యధిక వనరుల బదిలీ అని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ద్వారా పన్నుల పంపిణీ, గ్రాంట్లు, ప్రత్యేక సహాయం రూపంలో గణనీయమైన నిధులు అందాయని, 2014 నుండి 2024 వరకు లక్ష కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ అందించిందని తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద తెలంగాణకు 2020-21లో రూ.358 కోట్లు లభించగా, 2025-26 నాటికి అది దాదాపు పది రెట్లు పెరిగి రూ.4,209 కోట్లకు చేరుకుందన్నారు. రైల్వే రంగంలో తెలంగాణకు పెద్దపీట దక్కిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం 2014-15లో రాష్ట్రానికి కేవలం రూ.258 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించగా, 2024-25లో అది రూ.5,336 కోట్లకు పెరిగిందన్నారు. సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి, హైదరాబాద్–బెంగళూరు వంటి మార్గాల్లో వందేభారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ కింద తెలంగాణలో 50 కు పైగా ప్రదేశాలను గుర్తించగా, వాటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు 69 కిలోమీటర్ల మేర పని చేస్తుండగా రెండో దశ విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, డబ్లింగ్ వేగంగా జరుగుతోందని, ప్రస్తుతం తెలంగాణలో రైల్వే మార్గాలు 100 శాతం విద్యుదీకరణ జరిగిందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 40కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. 2014 తర్వాత తెలంగాణలో మొత్తం 437 రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణమయ్యాయని తెలిపారు.
రోడ్డు, విమానయాన, విద్యా, వైద్య రంగాలలో కూడా తెలంగాణకు కేంద్రం పెద్దపీట వేసిందని రాంచందర్ రావు వివరించారు. ఉడాన్ పథకం కింద హైదరాబాద్ నుండి 22 కొత్త విమాన మార్గాలు ప్రారంభమయ్యాయన్నారు. రోడ్డు రవాణా రంగంలో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు గణనీయంగా పెరిగిందన్నారు. భారతమాల ప్రాజెక్టు, ఆర్థిక కారిడార్ల ద్వారా రాష్ట్రానికి మెరుగైన అనుసంధానం ఏర్పడిందని, హైదరాబాద్ – బెంగళూరు ఎకనామిక్ కారిడార్, సూరత్ – చెన్నై ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్ – విశాఖపట్నం కారిడార్ వంటి ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయన్నారు. విద్యా రంగంలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో కొత్త నవోదయ విద్యాలయాలు మంజూరై, విద్యా సదుపాయాలు విస్తరించాయన్నారు. బ్రాడ్‌కాస్టింగ్, మీడియా రంగంలో కొత్త ఎఫ్‌ఎం రేడియో సేవలు ప్రారంభమయ్యాయన్నారు. హైదరాబాద్‌లోని నైపర్ (NIPER)లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బీబీనగర్‌లో ఎయిమ్స్ (AIIMS) కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి నిదర్శనాలని తెలిపారు. పుణే–హైదరాబాద్ జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణ, హైదరాబాద్ ప్రాంతంలో వివిధ పైప్‌లైన్ ప్రాజెక్టులు, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మంచిర్యాల–వరంగల్ రైల్వే సెక్షన్, నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వంటి అనేక కీలక ప్రాజెక్టులు భారతమాల, ఇతర పథకాల కింద వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
రాష్ట్రంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 1.32 కోట్ల జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరుచుకున్నాయన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 92.4 లక్షల మంది, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 1.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తెలంగాణలో రూ.86,600 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయని, అటల్ పెన్షన్ యోజన కింద 26.9 లక్షల మంది సభ్యులుగా చేరారన్నారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించగా, తెలంగాణలో ఏకంగా 7.61 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని, దేశంలోనే అత్యధిక లబ్ధిదారులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద తెలంగాణలో 33.2 లక్షల కార్డులు జారీ అయ్యాయని, జల్ జీవన్ మిషన్ ద్వారా 53.9 లక్షల గ్రామీణ కుటుంబాలకు ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు అందించారని అన్నారు. ఉజ్వల యోజన కింద 11.8 లక్షల గ్యాస్ కనెక్షన్లు పేద కుటుంబాలకు అందాయని, జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణలో 182.7 లక్షల ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ ద్వారా తెలంగాణలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుండగా, తెలంగాణలో 30.4 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. “మోదీ అంటే అభివృద్ధి – అభివృద్ధి అంటే మోదీ” అని తాము బలంగా నమ్ముతున్నామన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా మోదీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు.

