Indian DEfence

ప్రపంచ రక్షణ శక్తిగా ఎదుగుతున్న భారత్‌

త 12 ఏళ్లలో వైమానిక, భూతల, నౌకాదళ రంగాల్లో భారత్ విశేష ప్రగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా దేశ రక్షణ రంగ విజయాలను కొనియాడారు. స్వదేశీ యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, రికార్డు స్థాయి రక్షణ రంగ ఉత్పత్తి దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి (ఆత్మనిర్భరత) దిశగా వేగంగా దూసుకుపోతోందనడానికి స్పష్టమైన నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణం భారత్ ను ప్రపంచ రక్షణ రంగ తయారీ కేంద్రంగా మార్చేందుకు బలమైన పునాదిని వేస్తోందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో భారత రక్షణ విధానం కేవలం ఆయుధాల కొనుగోలు స్థాయి నుంచి స్వదేశీ తయారీ, సాంకేతిక స్వయం సమృద్ధికి ప్రాధాన్యమిస్తూ వేగంగా రూపాంతరం చెందింది. రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర భారత్’ వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. దీని ఫలితంగా, ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, భారత్ తన దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. ప్రభుత్వ సమాచారం ప్రకారం, భారత్ రక్షణ సామర్థ్యాల పెంపుదల, సాంకేతిక అభివృద్ధి, సైనిక ఆధునీకీకరణపై నిరంతరం పెట్టుబడులు పెడుతోంది. అందుకే దేశం నేడు స్వదేశీ యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధనౌకలు, జలాంతర్గాముల ఉత్పత్తిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.

‌‌తేజస్: భారత గగనతలంలో సంచలనం 

భారత వైమానిక దళ వ్యూహాత్మక శక్తిలో స్వదేశీ యుద్ధ విమానం ‘తేజస్’ అత్యంత కీలకమైనదిగా నిలిచింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ విమానం, భారత్ వైమానిక నైపుణ్యానికి, సాంకేతికలో స్వావలంబనకు ప్రతీకగా మారింది. ఆధునిక యుద్ధ విమానాలను విజయవంతంగా తయారు చేయగల సామర్థ్యం కూడా భారత్ కు ఉందని తేజస్ నిరూపించింది. తేజస్ ఎంకే-1ఏ విమానాలు వాయుసేనలో చేరడం, ఎంకే-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతుండటంతో దేశంలో బలమైన స్వదేశీ యుద్ధ విమాన తయారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. దీనితో పాటు సి-295 రవాణా విమానాల కార్యక్రమం కూడా భారత ఏరోస్పేస్ రంగంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది.

‌‌క్షిపణి శక్తిలో భారత్ స్వయంసమృద్ధం

స్వదేశీ క్షిపణి సాంకేతికత భారతదేశ వ్యూహాత్మక బలంలో ప్రధానాంశంగా నిలిచింది. బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలు నేడు భారత రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా మారాయి. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగం; దీని అత్యాధునిక రకం ‘ఆకాశ్-ఎన్ జి’, శత్రువుల వైమానిక దాడులను తిప్పికొట్టడానికి వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలు, అత్యుత్తమ ట్రాకింగ్, ఆధునిక సాంకేతికతను కలిగి ఉంది. మరోవైపు గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ‘అస్త్ర’ క్షిపణి, యాంటీ-రేడియేషన్ క్షిపణి ‘రుద్రం’ భారతదేశ స్వదేశీ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి.

‌‌పినాక, అగ్ని-5: విస్తరిస్తున్న వ్యూహాత్మక బలం

భారత సైన్య ఫిరంగి దళం ఆధునికీకరణలో పినాక మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. దీని చలనశీలత, కచ్చితత్వం, స్వదేశీ డిజైన్ యుద్ధరంగంలో సైన్యం దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచాయి. మరోవైపు, అగ్ని-5 క్షిపణి భారత్ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి, భారతదేశ భద్రతా విధానంలో అత్యంత కీలకమైన స్థానాన్ని కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా మన వ్యూహాత్మక ప్రతిష్టను పెంచుతుంది.

‌పెరుగుతున్న నౌకాదళ శక్తి 

హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న వ్యూహాత్మక సవాళ్ల మధ్య భారత్ నౌకాదళాన్ని వేగంగా ఆధునికీకరిస్తోంది. స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, అణుశక్తితో పనిచేసే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ ఈ ప్రయాణంలో చారిత్రాత్మక మైలురాళ్లుగా నిలిచాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ నౌకానిర్మాణ సామర్థ్యానికి, సాంకేతిక నైపుణ్యానికి చిహ్నంగా నిలవగా, ఐఎన్ఎస్ అరిహంత్ దేశానికి అణు నిరోధక శక్తికి సంబంధించిన కీలకమైన మద్దతును అందించింది. ఇంకా ప్రాజెక్ట్-17ఏ స్టెల్త్ ఫ్రిగేట్లు, ప్రాజెక్ట్-15బి డిస్ట్రాయర్లు, కల్వరి-క్లాస్ జలాంతర్గాములు భారత నౌకాదళానికి ఆధునిక పోరాట సామర్థ్యాలను సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు సముద్ర రక్షణ రంగంలో భారతదేశాన్ని గణనీయంగా స్వయంసమృద్ధిగా, మరింత సమర్థంగా మార్చాయి.

‌‌రక్షణ రంగ ఉత్పత్తిలో రికార్డు వృద్ధి

సైనిక ఆధునికీకరణకు అత్యంత స్పష్టమైన నిదర్శనం రక్షణ రంగ ఉత్పత్తి గణాంకాలలోనే కనిపిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024-25) నమోదైన రూ.1.54 లక్షల కోట్లతో పోలిస్తే 15.6 శాతం పెరుగుదల. గత సంవత్సరాల సమాచారంతో పోల్చి చూసినప్పుడు ఈ విజయం మరింత అద్భుతంగా కనిపిస్తుంది; రక్షణ రంగ ఉత్పత్తి 2020-21లో రూ.84,643 కోట్లుగా ఉండగా, 2013-14లో ఇది కేవలం రూ.43,746 కోట్లు మాత్రమే. అంటే దాదాపు దశాబ్ద కాలంలో స్వదేశీ రక్షణ రంగ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది.

‌‌ప్రైవేట్ రంగం ముఖ్య పాత్ర 

రక్షణ పరిశ్రమలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగ వాటా అంతకుముందు ఏడాది ఉన్న 22 శాతం నుండి 24 శాతానికి పెరిగింది. విలువ పరంగా చూస్తే ప్రైవేట్ రంగ సహకారం రికార్డు స్థాయిలో రూ.42,000 కోట్లకు చేరుకుంది. రక్షణ రంగ తయారీలో భారతీయ ప్రైవేట్ పరిశ్రమలు కీలక పాత్ర పోషించడం ప్రారంభించాయని ఇది సూచిస్తుంది. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికీ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 76 శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ, పెరుగుతున్న ప్రైవేట్ రంగం భాగస్వామ్యం భవిష్యత్తుకు సానుకూల సంకేతంగా నిలుస్తోంది.

‌‌ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్న రక్షణ ఎగుమతులు

భారతదేశ రక్షణ సామర్థ్యాల ప్రభావం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో ప్రైవేట్ రంగం రూ.38,424 కోట్లకు పెరిగాయి. అంతర్జాతీయ వేదికపై భారతీయ రక్షణ ఉత్పత్తులు ఇప్పుడు అత్యంత సమర్థమైనవిగా, నమ్మదగినవిగా గుర్తింపు పొందుతున్నాయి. బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలు మొదలుకుని వివిధ రకాల ఇతర రక్షణ పరికరాల వరకు, భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన విస్తృత రక్షణ పారిశ్రామిక పునాదే ఈ విజయానికి కారణమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, పెరుగుతున్న ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, ఎగుమతి సామర్థ్యాల విస్తరణ కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రక్షణ రంగం సాధించిన విజయాలను పరిశీలిస్తే గత 12 ఏళ్లలో భారతదేశ రక్షణ గాథ కేవలం ఆయుధాలు, సైనిక వేదికల విజయాలకే పరిమితం కాలేదని స్పష్టమవుతుంది; ఇది ఆత్మవిశ్వాసం, స్వయంసమృద్ధి, జాతీయ సంకల్పానికి ప్రతీకగా మారింది. తేజస్ నుండి విక్రాంత్ వరకు, అగ్ని-5 నుండి బ్రహ్మోస్ వరకు, రికార్డు స్థాయి ఉత్పత్తి మొదలుకుని దూసుకుపోతున్న ఎగుమతుల వరకు, ప్రతి మైలురాయి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది: భారత్ రక్షణ రంగంలో కేవలం ఒక వినియోగదారుగా మాత్రమే కాకుండా, ఒక తయారీదారుగా, ఎగుమతిదారుగా ఎదుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచ రక్షణ శక్తిగా మార్చడానికి ఈ పరివర్తన ఒక బలమైన పునాది కాగలదు.

డాక్టర్ మయాంక్ చతుర్వేది