Health

ఆరోగ్య రంగంలో సమూలమైన మార్పులు

ప్రజలందరికీ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఒక దేశపు అత్యంత కీలకమైన పెట్టుబడులలో ఒకటి. ఆరోగ్యకరమైన జనాభా కేవలం సామాజిక సంక్షేమానికే కాక దేశ ఆర్థిక వృద్ధి, ఉత్పాదకత, జాతీయ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుంది. గత పన్నెండేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన చరిత్రలోనే ఆరోగ్య రంగాన్ని సమూలంగా మార్చివేసే ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టింది. అందరికీ సరసమైన, అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది. అలాగే ఆరోగ్య రక్షణ పరిధిని విస్తరించింది, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లింది, స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేసింది, ప్రపంచ ఆరోగ్య రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపింది. 

ఆరోగ్య రంగంలో పరివర్తన వైద్య విద్య, మానవ వనరులు అనే మూలస్తంభాలను బలోపేతం చేయడంతోనే ప్రారంభమవుతుంది. ఒక పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు తగిన సంఖ్యలో వైద్యులు, నిపుణులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైద్య విద్య మౌలిక సదుపాయాల భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2014లో భారతదేశంలో 842 వైద్య కళాశాలలు ఉండేవి. 2026 నాటికి ఆ సంఖ్య 2,100 దాటింది. ఇది 2.5 రెట్ల పెరుగుదల. ఈ విస్తరణ వైద్య విద్యను ఆశించే విద్యార్థులకు, ముఖ్యంగా గతంలో ఇటువంటి సంస్థలు లేని ప్రాంతాలకు మరింత దగ్గర చేసింది. దీనివల్ల లభించిన అవకాశాల పెరుగుదల కూడా అంతే విశేషంగా ఉంది. ఎంబిబిఎస్ సీట్లు 2014లో 51,348 ఉండగా, 2026 నాటికి 1.28 లక్షలకు పెరిగాయి. అదే సమయంలో పీజీ వైద్య సీట్లు 31,185 నుండి 85,822కు పెరిగాయి. ఈ అద్భుతమైన విస్తరణ ద్వారా భారత్ పెరుగుతున్న ఆరోగ్య అవసరాలను తీర్చగల, పట్టణ, గ్రామీణ భారతమంతటా నాణ్యమైన సంరక్షణ అందించగల శిక్షణ పొందిన వైద్య నిపుణుల సంఖ్యా పెరుగుతుంది. సామర్థ్యాల పెంపుతో పాటు, భారత్ చాలాకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని నిరంతర ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. 

తరతరాలుగా కోట్లాది భారతీయ కుటుంబాలపై భారీ భారాన్ని మోపిన క్షయవ్యాధి నియంత్రణలో విశేషమైన పురోగతి నమోదైంది. ముందస్తు గుర్తింపు, విస్తృత పరీక్షలు, మెరుగైన చికిత్స లభ్యత, సాంకేతిక కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం ద్వారా భారతదేశం క్షయ రహిత దేశంగా మారే దిశగా వేగంగా తన ప్రయాణిస్తోంది. దీని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. నమోదు కాని టీబీ కేసుల సంఖ్య 93.33 శాతం తగ్గగా, టీబీ సోకే రేటు 21 శాతం తగ్గింది. ఇది ప్రపంచ తగ్గుదల వేగం కంటే రెట్టింపు. చికిత్స పరిధి 2015లో 53 శాతంగా ఉండగా, 2024 నాటికి 92 శాతానికి గణనీయంగా పెరిగింది. టీబీ నియంత్రణ కార్యక్రమాల కింద 20 కోట్లకు పైగా వ్యాధి సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు పరీక్షలు చేశారు. అలాగే ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద 28 లక్షల మందికి పైగా రోగులను గుర్తించారు. నిర్దిష్ట కార్యక్రమాలు, క్షేత్రస్థాయి విస్తరణతో కూడిన స్థిరమైన ప్రభుత్వ విధానం ప్రజారోగ్యంలో స్పష్టమైన మార్పును ఎలా సాధించగలవో ఈ విజయాలు నిరూపిస్తున్నాయి. భారతదేశ విజయాలు కేవలం టీబీ నియంత్రణకే పరిమితం కాలేదు. ఒకప్పుడు ప్రధాన ప్రజారోగ్య సవాళ్లుగా నిలిచిన వ్యాధులు క్రమంగా నిర్మూలన దిశగా సాగుతున్నాయి. 2024 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ‘ట్రాకోమా రహిత’ దేశంగా ప్రకటించింది. తద్వారా ఆగ్నేయాసియాలో ఈ మైలురాయిని సాధించిన మూడవ దేశంగా భారత్ నిలిచింది. మలేరియా కేసులు 80 శాతానికి పైగా తగ్గగా, మలేరియా సంబంధిత మరణాలు 78 శాతం తగ్గాయి. ఈ విజయాల ఆధారంగా భారతదేశం ఇప్పుడు క్షయ, కుష్టు వ్యాధి, లింఫాటిక్ ఫైలేరియాసిస్ (బోదకాలు), తట్టు (మీజిల్స్), రుబెల్లా, కాలా-అజార్ వ్యాధుల నిర్మూలనకు చురుగ్గా కృషి చేస్తోంది. ఈ విజయాలు నిఘా వ్యవస్థలు, ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, చివరి మైలు వరకు ఆరోగ్య సేవలను అందించే వ్యవస్థల బలోపేతాన్ని సూచిస్తాయి.

కోవిడ్-19 మహమ్మారి ఆధునిక కాలంలోనే అత్యంత పెద్ద ప్రజారోగ్య సవాలును విసిరింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను రక్షించాల్సిన బాధ్యత ఎదురైనప్పుడు, భారతదేశం అసాధారణమైన వేగం, స్థాయి, ఆవిష్కరణలతో స్పందించింది. దేశం ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే రెండు స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి, తన శాస్త్రీయ, ఉత్పాదక సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు. భారతదేశం ఒకే రోజులో 2.5 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించి అద్భుతమైన రికార్డును సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయం శాస్త్రీయ ఆవిష్కరణలు, డిజిటల్ వేదికలు (ప్లాట్‌ఫారమ్‌లు), సమర్థమైన లాజిస్టిక్స్ (రవాణా, బట్వాడా సదుపాయాలు), ప్రజల భాగస్వామ్యం వల్ల ఉత్పన్నమయ్యే శక్తిని తెలియజేసింది. 

భారతదేశ ఆరోగ్య రంగ పరివర్తనలో ఒక ముఖ్య లక్షణం స్వదేశీ ఆవిష్కరణల పెరుగుదల. దేశ ఆరోగ్య రంగంలో ఇప్పుడు దేశీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలో సరసమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని భారత్ సంతరించుకుంది. భారత్ క్యాన్సర్ చికిత్స కోసం దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సీఏఆర్-టీ సెల్ థెరపీ అయిన ‘నెక్స్కార్19’ ని పరిచయం చేసింది, ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన సీఏఆర్-టీ చికిత్సలలో ఒకటిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎమ్మారై యంత్రం అభివృద్ధి రోగనిర్ధారణ ఖర్చులను తగ్గించి, అధునాతన ఇమేజింగ్ సాంకేతికతను అందుబాటులోకి రానున్నదన్న భరోసా కల్పిస్తోంది. 2024 లో ‘నాఫిత్రోమైసిన్’ న్యుమోనియాను నివారించడానికి అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మాక్రోలైడ్ యాంటీబయాటిక్‌గా అవతరించింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ 10,000 జీనోమ్‌లను విజయవంతంగా సీక్వెన్స్ చేసి, కచ్చితమైన వైద్యం, జీనోమిక్ పరిశోధనలకు విలువైన పునాదిని వేసింది. అంతేకాకుండా, భారత్ మూడు దశాబ్దాల విరామం తర్వాత పెన్సిలిన్ జి ఉత్పత్తిని పునఃప్రారంభించింది. ఇది ఔషధ రంగంలో స్వయం సమృద్ధిని, సరఫరా గొలుసులను బలోపేతం చేసింది. కొత్త సాంకేతికతలు ఆరోగ్య సేవలు అందించే విధానాలలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో కృత్రిమ మేధ (ఏఐ)ను భాగం చేయడం ద్వారా భారత్ వ్యాధి నిర్ధారణ, పరిశోధన, వ్యాధి నిఘా, రోగుల సంరక్షణ కోసం కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తోంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద సేకరించిన డేటాను ఉపయోగించి ఏఐ ఆరోగ్య సాధనాలకు పదునుపెడుతోంది. ఆరోగ్యం కోసం జాతీయ ఏఐ వ్యూహాన్ని ముందుగా అమలు చేసిన దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలలో భారతదేశం ఒకటి. ఈ ప్రయత్నాలకు అదనంగా, ఐఐటీ కాన్పూర్, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘బోధ్’ (బెంచ్‌మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్‌ఫారమ్ ఫర్ హెల్త్) ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను పరీక్షించడానికి, ప్రమాణాలను నిర్దేశించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కలిసి మరింత సమర్థమైన, సమాచార ఆధారిత ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు పునాది వేస్తున్నాయి.

బయోటెక్నాలజీ, ఔషధ రంగాలలో పెరుగుతున్న భారత ప్రాబల్యం ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా భారత్ ఆవిర్భావాన్ని సూచిస్తోంది. చాలా కాలంగా ‘ప్రపంచ ఔషధశాల’గా గుర్తింపు పొందిన భారతదేశం, ఇప్పుడు బయోఫార్మాస్యూటికల్ (జీవ ఔషధాలు), బయోటెక్నాలజీ ఆవిష్కరణలకు అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. వ్యూహాత్మక పెట్టుబడులు, సహాయక విధాన చట్రాలు, వృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఈ మార్పులను నడిపిస్తున్నాయి. జీవన శాస్త్రాలలో పరిశోధన, ఆవిష్కరణలు, వాణిజ్యకరణను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ‘బయోఫార్మా శక్తి’ కోసం రూ.10,000 కోట్లను కేటాయించింది. 2014 లో సుమారు 1,0000 కోట్ల డాలర్లుగా ఉన్న భారతదేశ బయో ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి సుమారు 19,500 కోట్ల డాలర్లకు విస్తరించింది, ఇది 2030 నాటికి 30,000 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 11,800కి పైగా బయోటెక్ స్టార్టప్‌ లతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. 

ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు భారతదేశం అందిస్తున్న సహకారం సాటిలేనిది. దేశం ప్రపంచంలోని యాంటీ-రెట్రోవైరల్ మందులలో దాదాపు 70 శాతం, యూనిసెఫ్ సేకరించే వ్యాక్సిన్‌లలో 55 నుంచి 60 శాతం సరఫరా చేస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఔషధ ఎగుమతులు 3,100 కోట్ల డాలర్లను దాటాయి, ఇది ప్రపంచవ్యాప్త దేశాలకు సరసమైన ధరలలో మందులను సరఫరా చేసే విశ్వసనీయ భాగస్వామిగా భారత్ పాత్రను మరింత బలోపేతం చేసింది. ఈ విజయాలన్నీ స్థిరమైన ప్రభుత్వ పెట్టుబడుల మద్దతుతో సాధ్యమయ్యాయి. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, వైద్య విద్య, సాంకేతికత వినియోగం, ఆరోగ్య సేవలకు దీర్ఘకాలిక నిబద్ధత అవసరమని గుర్తించిన మోదీ ప్రభుత్వం క్రమంగా ఆరోగ్య రంగంపై వ్యయాన్ని పెంచింది. 2026-27 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.1,06,530 కోట్లు కేటాయించారు. ఇది 2014-15 లోని రూ.35,163 కోట్ల కంటే 203 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ గణనీయమైన పెంపు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, మానవ వనరులను విస్తరించడానికి, సేవలను మెరుగుపరచడానికి, ఆరోగ్య సేవలు ప్రతి పౌరుడికి చేరేలా చూడడానికి ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

నివారణాత్మక ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కేవలం చికిత్సపైనే దృష్టి పెట్టకుండా, వ్యాధులు రాకముందే వాటిని నివారించడంలో భారత్ ఎక్కువగా పెట్టుబడి పెడుతోంది. యువతులను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే లక్ష్యంతో ప్రారంభించిన HPV (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇందుకు ఒక ముఖ్య ఉదాహరణ. ఈ కార్యక్రమం కింద 14 సంవత్సరాల వయస్సు గల 1.15 కోట్ల మంది బాలికలు 90 రోజుల దేశవ్యాప్త కార్యక్రమం ద్వారా ఉచిత హెచ్ పివి పొందుతారు. గరిష్ట స్థాయిలో కవరేజీని సాధించడానికి దీన్ని రోపొందించారు. HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అమలు చేసిన 160కి పైగా దేశాల సరసన చేరడం ద్వారా భారతదేశం సర్వికల్ క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి, భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఒక ప్రధానమైన అడుగు వేస్తోంది. ఇవన్నీ ఆరోగ్య సంరక్షణ రంగంలో చోటుచేసుకుంటున్న సమూలమైన మార్పును వెల్లడిస్తాయి. విస్తరించిన వైద్య విద్య, బలమైన వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న వ్యాక్సినేషన్, స్వదేశీ ఆవిష్కరణలు, కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీలో అద్భుత ప్రగతి, అధిక ప్రభుత్వ పెట్టుబడులు, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి.. ఇవన్నీ దేశ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయి.

ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కానీ గత పన్నెండేళ్ల పురోగతి ఒక ఉమ్మడి లక్ష్యం కోసం విధానం, సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రజా భాగస్వామ్యం కలిసి పని చేసినప్పుడు ఏమి సాధ్యమవుతుందో నిరూపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం కేవలం ఆరోగ్య సేవలను విస్తరించడం మాత్రమే కాదు; ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలను నెరవేర్చగల మరింత సమగ్రమైన, పటిష్టమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది. ఆరోగ్యకరమైన భారతదేశానికి పునాది పడింది, ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కొద్దిమందికి మాత్రమే లభించే విశేష హక్కు కాదు, అందరికీ అందుబాటులో ఉండే ఒక హక్కుగా మారే భవిష్యత్ దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.

అమిత్ మాలవీయ,
బిజెపి ఐటీ సెల్ నేషనల్ కన్వీనర్