Sardar Patel

రైతు ఉద్యమకారుడిగా పటేల్

ల్లభాయ్ పటేల్ భారతదేశ చరిత్రలో ‘ఉక్కు మనిషి’గా, దేశ సమైక్యతా నిర్మాతగా, 500కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన వ్యక్తిగా చిరస్మరణీయుడు. అయితే, ఆయన జాతీయ స్థాయిలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఎదగకముందు అక్షరాలా నేలతో, రైతులతో మమేకమై జీవించారు. ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు, వారి మధ్యనే పెరిగారు, వారి కోసమే పోరాడారు. చివరకు వ్యవసాయ ఉద్యమాలలో అసాధారణ నాయకత్వం ద్వారానే ఆయన ‘సర్దార్’ (నాయకుడు) అనే బిరుదును సంపాదించారు. ఆయన తొలి రాజకీయ ప్రయాణం ముఖ్యంగా గుజరాత్‌లోని రైతుల పోరాటాలతో ముడిపడి ఉంది. పటేల్‌ను కేవలం రైతుల నాయకుడిగా అర్థం చేసుకోవడం ద్వారా ఆయన రాజకీయ చైతన్యం గురించే కాకుండా క్రమశిక్షణ, ఆచరణాత్మక దృక్పథం, అచంచలమైన ధైర్యం వంటి ఆయన గుణాలను గురించి కూడా మనం తెలుసుకోవచ్చు.

భూమి పుత్రుడు 

వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నదియాద్ అనే చిన్న పట్టణంలో పాటిదార్ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఝవేర్‌భాయ్ పటేల్, బరోడా గైక్వాడ్ సైన్యంలో పనిచేశారు, తల్లి లాడ్‌బాయి మత విశ్వాసాలు, నిజాయితీ, కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి. రుణభారం, కరువు, భూస్వాములు, బ్రిటిష్ అధికారులపై ఆధారపడటం వంటి గ్రామీణ జీవితంలోని రోజువారీ కష్టాలను చూస్తూ పటేల్ పెరిగారు. ఈ అనుభవాలు ఆయనలో రైతులపై లోతైన సానుభూతిని కలిగించాయి. దేశానికి అన్నం పెట్టే రైతులు బ్రిటిష్ పాలనలో మాట్లాడలేని వారిగా మిగిలిపోయారు.

పటేల్ న్యాయవాద వృత్తిని చేపట్టి అహ్మదాబాద్‌లో అత్యంత విజయవంతమైన బారిస్టర్‌లలో ఒకరైనప్పటికీ, ఆయన వ్యవసాయ ప్రపంచంతో తన బంధాన్ని ఎప్పుడూ తెంచుకోలేదు. ఆయన పదునైన తెలివితేటలు, ధైర్యం రైతులు, న్యాయవాదులతో సహా అందరిలో గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. అయితే, మహాత్మా గాంధీని కలిసినప్పుడు, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలోకి ఆకర్షితుడైనప్పుడు ఆయన జీవితంలో పెద్ద మార్పు సంభవించింది. గాంధీ ప్రభావంతో పటేల్ తన శక్తిని, క్రమశిక్షణను సామాన్య ప్రజల – ముఖ్యంగా రైతుల – సమస్యల పరిష్కారానికి మళ్లించారు.

ఖేడా సత్యాగ్రహం: ఒక నాయకుడి ఆవిర్భావం 

రైతు నాయకుడిగా పటేల్ మొట్టమొదటి ప్రధాన పాత్ర 1918 నాటి ఖేడా సత్యాగ్రహంలో కనిపించింది. గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులు తగినంత వర్షపాతం లేకపోవడంతో తీవ్రమైన పంట నష్టంతో సతమతమయ్యారు. తీవ్ర నష్టం ఉన్నప్పటికీ, బ్రిటిష్ వలస పాలకులు భూమి శిస్తులను మాఫీ చేయడానికి నిరాకరించారు. దీనికి వ్యతిరేకంగా గాంధీ ఒక అహింసాయుత ప్రతిఘటనను ప్రతిపాదించారు – ప్రభుత్వం ఊరట కల్పించే వరకు ఏ ఒక్క రైతు కూడా పన్ను చెల్లించకూడదు. ఈ సత్యాగ్రహాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బాధ్యతను వల్లభాయ్ పటేల్ స్వీకరించారు. ఆయన పల్లెపల్లెకూ తిరిగి బ్రిటిష్ అధికారులకు భయపడుతున్న రైతులను చైతన్యపరిచారు. ఆయన ప్రశాంతమైన వాదన, న్యాయ పరిజ్ఞానం, చెక్కుచెదరని సంకల్పం వారు సంఘటితం కావడానికి ప్రేరేపించాయి. 

నెలల తరబడి, జప్తులు, బెదిరింపులు జరిగినప్పటికీ ఖేడా రైతులు దృఢంగా నిలబడి పన్నులు చెల్లించడానికి నిరాకరించారు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చింది. ఆ సంవత్సరానికి పన్నును నిలిపివేయడానికి, జప్తు చేసిన భూములను తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విజయం పటేల్‌ను గుజరాత్‌లో ఒక హీరోగా మార్చింది. రైతులు ఆప్యాయంగా ఆయనను ‘సర్దార్’ అని పిలవడం మొదలుపెట్టారు, ఇది నాయకత్వం, గౌరవాన్ని సూచించే బిరుదు. ఖేడా ఉద్యమం కేవలం శిస్తు నిరసన కాదు; అది గ్రామీణ గుజరాత్ చైతన్యం, దానికి పటేల్ మార్గదర్శకుడయ్యారు. గాంధీ అహింసను, సంస్థాగత క్రమశిక్షణను కలపగల ఆయన సామర్థ్యాన్ని ఈ ఉద్యమం నిరూపించింది.

బార్డోలి సత్యాగ్రహం: కీలక పోరాటం

ప్రజా నాయకుడిగా పటేల్ ఆవిర్భావానికి ఖేడా ప్రతీక అయితే బార్డోలి ఆయనకు రైతు నాయకుడిగా పట్టాభిషేకం చేసింది. 1928లో సూరత్ జిల్లాలోని బార్డోలి తాలూకాలో భూమి శిస్తును ఏకంగా 22 శాతం పెంచుతున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. పంటలు సరిగా పండక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సమయంలో ఈ పెంపు రైతులపై పిడుగుపాటు అయింది. రైతులు అప్పటికే పటేల్‌ను తమ నిరసనకు నాయకత్వం వహించమని కోరారు. పటేల్ రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయమని తేల్చారు. ప్రభుత్వాధికారులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించడానికి నిరాకరించడంతో, ఆయన ఒక పద్ధతి ప్రకారం అహింసాయుత ప్రతిఘటనను చేపట్టారు. ఆయన ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేశారు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. స్పష్టమైన క్రమశిక్షణ నియమాలను నిర్దేశించారు– హింస వద్దు, బెదిరింపు వద్దు, ఉద్యమాన్ని వదిలిపెట్టవద్దు. ఎలాంటి బెదిరింపులు వచ్చినా పన్నులు చెల్లించవద్దని రైతులకు సూచించారు.

ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ప్రతీకార చర్యలకు దిగింది. భూములు, పశువులు, ఆస్తులను జప్తు చేసి, వాటిని వేలం కూడా వేసింది. అయినా రైతులు పటేల్ సూచనలను పాటిస్తూ, అద్భుతమైన ఐక్యతతో దృఢంగా నిలబడ్డారు. పటేల్ స్వయంగా ప్రశాంతంగా ఉంటూ, అధికారులతో చర్చలు జరుపుతూ, ఉద్యమం స్థైర్యాన్ని కోల్పోకుండా చూసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయం రైతులకు అనుకూలంగా మారడం, ఇంతటి సంఘటిత ధిక్కారాన్ని అణచివేయలేమని బ్రిటిష్ అధికారులు గ్రహించడంతో పరిస్థితి మారింది. చివరికి ప్రభుత్వం పన్ను శిస్తు పెంపుదలను రద్దు చేయడానికి, జప్తు చేసిన భూములను తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బార్డోలి భారతీయ ఆత్మగౌరవానికి, గ్రామీణ ప్రజల ధైర్యానికి ప్రతీకగా మారింది. పటేల్ నాయకత్వాన్ని గాంధీ బహిరంగంగా అంగీకరించిన సందర్భం కూడా ఇదే. ఆయనను ‘బార్డోలి సర్దార్’ అని పిలిచారు. భారతీయ రైతులను ఇకపై బెదిరించలేమని పటేల్ బ్రిటిష్ వారికి చూపించారని దేశవ్యాప్తంగా పత్రికలు కీర్తించాయి.

రైతుల సాధికారత-పటేల్ సిద్ధాంతం

సర్దార్ పటేల్ నాయకత్వం కేవలం నిరసనలకు, ఉద్యమాలకే పరిమితం కాదు. అది గౌరవం, క్రమశిక్షణ, సాధికారత గురించి కూడా. భారతదేశ బలం దాని గ్రామాల్లోనే ఉందని, అయితే ఆ బలం ఐక్యత, విద్య, స్వావలంబన ద్వారా మాత్రమే బయటికి వస్తుందని ఆయన నమ్మారు. అజ్ఞానం, అప్పులు, పరాధీనత నుంచి విముక్తి పొందకపోతే స్వాతంత్య్రం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన గుజరాత్‌లో రైతులకు పదేపదే గుర్తుచేశారు. కేవలం వాక్చాతుర్యంపై దృష్టి సారించిన సమకాలీన నాయకులకు భిన్నంగా పటేల్ విధానం చాలా వాస్తవికంగా ఉండేది. ఆయన సహకార వ్యవసాయం, నీటిపారుదల అభివృద్ధి, న్యాయమైన పన్నుల విధానాన్ని నొక్కి చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు అహ్మదాబాద్ మున్సిపల్ సంస్థలకు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయన పారిశుధ్యం, నీటి సరఫరా, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. ఇవన్నీ రైతులకు నేరుగా సంబంధించిన సమస్యలు. భూ సంబంధాలపై కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన రైతుల హక్కులకు మద్దతు ఇచ్చినా భూమిని హింసాత్మకంగా పునఃపంపిణీ చేయాలని పిలుపునిచ్చిన విప్లవకారుడు కాదు. అందుకు బదులుగా చర్చలు, ఒప్పించడం, నైతిక ఒత్తిడి ద్వారా సంస్కరణ జరగాలని ఆయన నమ్మారు. ఆయన వ్యవసాయ సిద్ధాంతం గాంధీ ధర్మకర్తృత్వ ఆదర్శం ద్వారా ప్రభావితమైంది. భూయజమానులు, ధనవంతులు తమ కింద పనిచేసే వారి క్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన విశ్వసించారు.

రైతు నాయకుడి నుంచి దేశ నిర్మాతగా

ఖేడా, బార్డోలిలలో పటేల్ విజయం ఆయన్ను గాంధీ అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకరిగా నిలబెట్టింది. ఇది భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన భవిష్యత్తు పాత్రకు పునాది వేసింది. రైతుల ఉద్యమాలలో పదునుతేలిన ఆయన సంస్థాగత నైపుణ్యాలు సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఎంతో ఉపయోగపడ్డాయి. స్వాతంత్య్రం తరువాత ఆయన భారతదేశపు మొదటి ఉప ప్రధాన మంత్రిగా, హోంమంత్రిగా పనిచేసినప్పుడు తన పూర్వపు వ్యవసాయ ఉద్యమాలలో చూపించిన అదే స్పష్టత, దృఢత్వం, ఆచరణాత్మక దృక్పథాలను ప్రదర్శించారు. ఆయన భారతదేశాన్ని పెద్ద ‘బార్డోలి’గా – పాలకుల ద్వారా విభజించబడిన, ఐక్యత, క్రమశిక్షణ అవసరమైన భూమిగా – చూశారు. సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడం, అనేక విధాలుగా ఆయన రైతుల ఉద్యమాలలో అలవరచుకున్న నాయకత్వ గుణాల కొనసాగింపే. మొదట ఒప్పించడం, అవసరమైతే దృఢంగా ఉండటం, సమష్టి శక్తిపై తిరుగులేని నమ్మకం.. ఇవే ఆ గుణాలు. 

రైతు నాయకుడిగా సర్దార్ పటేల్ వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఖేడా, బార్డోలిలలో ఆయన పోరాటాలు కేవలం స్థానిక ఉద్యమాలు కాదు; అవి ప్రజాస్వామ్య ప్రతిఘటన, ఆత్మగౌరవం పాఠాలు. సాధారణ రైతులు కూడా ఏకమై క్రమశిక్షణతో ఉంటే ఒక మహా సామ్రాజ్యం శక్తిని సవాలు చేయగలరని ఆయన చూపించారు. సాధారణ రైతు కొడుకు నుంచి భారతదేశ ఐక్యతా శిల్పిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయాణం ఆధునిక చరిత్రలోని అత్యంత అద్భుతమైన గాథలలో ఒకటి. ఖేడా, బార్డోలి సత్యాగ్రహాలలో ఆయన నాయకత్వం గ్రామీణ ప్రజలను మేల్కొల్పడమే కాకుండా, క్రమశిక్షణతో కూడిన, అహింసాయుత ప్రతిఘటనకు ఒక ఆదర్శాన్ని అందించింది. పటేల్ రైతు నాయకుడిగా, గొంతులేని వారికి గొంతుకై నిలిచారు; జాతీయ నాయకుడిగా ఆయన ముక్కలైన దేశానికి రూపునిచ్చారు.

ఈ రెండు పాత్రలలోనూ ఆయన సందేశం ఒక్కటే – ధైర్యం, సంస్థాగత నిర్మాణం, సచ్చీలత అతిపెద్ద అన్యాయాలను కూడా అధిగమించగలవు. ఖేడా, బార్డోలి పొలాలలో పటేల్ భారతదేశ స్వాతంత్య్ర బీజాలను నాటారు. దిల్లీలో ఐక్య గణతంత్ర రాజ్యాన్ని నిర్మించడం ద్వారా ఆయన ఆ పోరాటం ఫలాలను దేశానికి అందేలా చేశారు. అందువల్ల, రైతు నాయకుడిగా సర్దార్ పటేల్ చరిత్ర కేవలం భారతదేశ గతంలో ఒక అధ్యాయం కాదు – నిజమైన నాయకత్వ మూలాలు ఎల్లప్పుడూ నేలలోనే ఉంటాయని అది మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.