Amit Shah

సమిష్టి కృషితో నక్సలిజం అణచివేత! పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా

Amit Shahదేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట చర్యలపై మార్చి 30న లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నిబంధన 193 కింద జరిగిన ఈ చర్చలో ఆయన మాట్లాడుతూ, నక్సలిజం అణిచివేతలో సాధించిన విజయాలను, దాని వెనుక ఉన్న రాజకీయ వైఫల్యాలను ఎండగట్టారు. 2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుంచి పూర్తి విముక్తి పొందిందని షా ప్రకటించారు. దశాబ్దాల కాలంగా దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారిన వామపక్ష తీవ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన దృఢ సంకల్పంతో అణచివేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నక్సలిజం చరిత్ర, దాని వెనుక ఉన్న శక్తులు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమగ్రమైన వివరాలు ఇచ్చారు.

తప్పుడు కథనాలకు కాలం చెల్లింది

అమాయక గిరిజనుల హక్కుల కోసం, వారికి న్యాయం చేసేందుకే తాము పోరాడుతున్నామనే ఒక తప్పుడు కథనాన్ని వామపక్ష తీవ్రవాదులు, వారి మద్దతుదారులు ఇన్నాళ్లూ ప్రచారం చేశారని అమిత్ షా మండిపడ్డారు. ప్రస్తుతం బస్తర్ ప్రాంతంలో నక్సలిజం దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, అక్కడ ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేయడం, రేషన్ షాపులు ప్రారంభించే దిశగా భారీ కార్యక్రమం మొదలైందని ఆయన వెల్లడించారు. నక్సలిజం తరపున వకాల్తా పుచ్చుకునే వారు, 1970 నుండి ఈ అభివృద్ధి పనులు అక్కడ ఎందుకు జరగలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎర్ర ఉగ్రవాదమే అభివృద్ధికి అడ్డంకి 

2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఇల్లు, గ్యాస్ కనెక్షన్, తాగునీరు, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా, 5 కిలోల ఉచిత బియ్యం అందుతున్నాయని హోం మంత్రి పేర్కొన్నారు. అయితే, ఎర్ర ఉగ్రవాద పీడ కారణంగా ఈ అభివృద్ధి ఫలాలు బస్తర్ ప్రజలకు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. “అభివృద్ధి లేనందువల్ల అక్కడ వామపక్ష ఉగ్రవాదం రాలేదు; వామపక్ష ఉగ్రవాదం ఉన్నందువల్లే అక్కడ అభివృద్ధి జరగలేదు. నేడు ఆ అవరోధం తొలగిపోయింది, బస్తర్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.

ఆయుధాలు పడితే తగిన శాస్తి

ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని, ఆయుధాలు పట్టిన వారు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమిత్ షా హెచ్చరించారు. తమ ప్రభుత్వం అత్యంత సున్నితమైనదని, సమస్యలను వినడానికి సిద్ధంగా ఉంటుందని, కానీ వామపక్ష తీవ్రవాదులు తమ అక్రమ పాలనను కొనసాగించేందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో 60 ఏళ్ల పాటు పాలించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, గిరిజనులను అభివృద్ధికి ఎందుకు దూరం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

12 రాష్ట్రాల ‘రెడ్ కారిడార్’ విషాదం

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్, కేరళ, కర్ణాటకలోని కొన్ని భాగాలు, ఉత్తరప్రదేశ్‌లోని 3 జిల్లాలతో కలిపి మొత్తం 12 రాష్ట్రాల్లో విస్తరించిన ‘రెడ్ కారిడార్’ వల్ల 12 కోట్ల మంది ప్రజలు దశాబ్దాల పాటు పేదరికంలో మగ్గారని అమిత్ షా తెలిపారు. సుమారు 20,000 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. నక్సలిజానికి మూలం అభివృద్ధి లోపం కాదు, అది ఒక సిద్ధాంతపరమైన సమస్య అని.. 1969లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడం కోసం నాటి అధికార పార్టీ నేత వామపక్ష సిద్ధాంతాన్ని అంగీకరించడమే దీనికి పునాది అని ఆయన విశ్లేషించారు.

మోదీ పాలనలో చారిత్రక మార్పులు

నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారని, అయితే 2014 తర్వాతే దానికి పరిష్కారం లభించిందని అమిత్ షా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, జీఎస్టీ అమలు, పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), మహిళా రిజర్వేషన్లు వంటి అసాధ్యమైన పనులను మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసిందని గుర్తు చేశారు. గత 12 ఏళ్లు దేశానికి అత్యంత శుభప్రదమని, నక్సల్స్ రహిత భారత్‌ను నిర్మించడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. నక్సలిజం అణిచివేతలో సాధించిన ఘనత అంతా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు, రాష్ట్ర పోలీసులకు, స్థానిక గిరిజనులకే దక్కుతుందని అమిత్ షా ప్రశంసించారు.

తుపాకీ గొట్టం సిద్ధాంతంపై విమర్శలు

“తుపాకీ గొట్టం ద్వారానే అధికారం లభిస్తుంది” అనే మావోయిస్టు నినాదాన్ని ఆయన ఎండగట్టారు. వీరికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే వీరి లక్ష్యమని మండిపడ్డారు. దేశద్రోహులను అమరవీరులైన భగత్ సింగ్, బిర్సా ముండాతో పోల్చడం తగదని.. నక్సల్స్ ఆదర్శం బిర్సా ముండా కాదు, కేవలం ‘మావో’ మాత్రమేనని దుయ్యబట్టారు.

భౌగోళిక పరిస్థితుల ఆసరా

నక్సల్బరీ, బస్తర్ వంటి ప్రాంతాల్లో తలసరి ఆదాయం, అక్షరాస్యత ఇతర ప్రాంతాలతో సమానంగా ఉన్నప్పటికీ, అక్కడి దట్టమైన అడవులు, నదులు, కొండలు నక్సల్స్ దాక్కోవడానికి అనువుగా ఉండటం వల్లే తీవ్రవాదం పెరిగిందని అమిత్ షా గణాంకాలతో వివరించారు. అంటే ఇది పేదరికం వల్ల వచ్చిన సమస్య కాదని ఆయన నిరూపించారు. హింసను నమ్మే నక్సల్స్ కు కాలం చెల్లిందని, ‘ప్రజా కోర్టుల’ పేరిట వారు సాగిస్తున్న అరాచకాలను ఉపేక్షించబోమని హోం మంత్రి స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామని, చర్చలకు సిద్ధమని ప్రకటించారు. “మా విధానం స్పష్టం – ఆయుధాలు వీడిన వారితో చర్చలు, కాల్పులు జరిపే వారికి బుల్లెట్లతోనే సమాధానం” అని ఆయన తేల్చి చెప్పారు.

కమ్యూనిస్టు పార్టీల ఆవిర్భావంపై ప్రశ్నలు

కమ్యూనిస్ట్ పార్టీల ఏర్పాటు వెనుక విదేశీ శక్తుల ప్రమేయాన్ని ఆయన ప్రస్తావించారు. 1925లో సోవియట్ యూనియన్ స్ఫూర్తితో సీపీఐ ఏర్పడిందని, ఆ తర్వాత 1964లో సోవియట్ రష్యా-చైనా మధ్య వివాదం కారణంగా చైనా మద్దతుతో సీపీఐ-మార్క్సిస్ట్ ఏర్పడిందని తెలిపారు. 1969లో పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ, సాయుధ విప్లవం లక్ష్యంగా సీపీఐ (ఎంఎల్) ఆవిర్భవించిందని వివరించారు. పరాయి దేశాల సిద్ధాంతాలతో పుట్టిన పార్టీలు దేశ సంక్షేమాన్ని ఎలా కోరుకుంటాయని ఆయన ప్రశ్నించారు.

నక్సలిజం చరిత్ర – 1925 నుండి 2026 వరకు

సీపీఐ (మార్క్సిస్టు) పార్టీ సాయుధ విప్లవం, పార్లమెంటరీ రాజకీయాల వ్యతిరేకత అనే రెండు లక్ష్యాలతో ఆవిర్భవించిందని, నేటి మావోయిస్టులు వారేనని హోం మంత్రి పేర్కొన్నారు.

  • 1975: కాంగ్రెస్ మద్దతుతో ఎంసీసీ (మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్) ఏర్పడి బీహార్, జార్ఖండ్‌లలో విస్తరించింది.
  • 1980: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పీపుల్స్ వార్ గ్రూప్ ఆవిర్భవించింది.
  • 1982: దళిత-కిసాన్ సాయుధ పోరాటమే లక్ష్యంగా బీహార్‌లో సీపీఐ (ఎంఎల్) పార్టీ యూనిటీ ఏర్పడింది.
  • 2004: పీడబ్ల్యూజీ, ఎంసీసీ విలీనమయ్యాయి.
  • 2014-2026: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కఠిన చర్యల వల్ల నేడు వీరి ఆట ముగిసింది.

“దీనిని అన్యాయంపై పోరాటంగా అభివర్ణించి కీర్తించవద్దు. వీరు ఓట్ల ద్వారా కాకుండా తూటాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూశారు. అమాయక పౌరులను రక్షించేందుకు ప్రభుత్వం బలగాలను ప్రయోగించింది, ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి,” అని షా అన్నారు.

అర్బన్ నక్సల్స్ ద్వద్వవైఖరి 

అర్బన్ నక్సల్స్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయుధాలు ధరించి తిరుగుతున్న మావోయిస్టులు అన్యాయంపై పోరాడుతున్నారని, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని, వారిని చంపకూడదని, వారి పట్ల సానుభూతి చూపాలని అర్బన్ నక్సల్స్ వాదిస్తుంటారని ఆయన మండిపడ్డారు. నక్సల్స్ దాడుల్లో వికలాంగులుగా మారిన రైతుల గురించి గానీ, దేశ రక్షణలో వీరమరణం పొందిన 5,000 మందికి పైగా భద్రతా దళాల జవాన్ల గురించి గానీ, వారి వితంతువులు, అనాథలైన వారి పిల్లల గురించి ఏ ఒక్క మేధావి కూడా కనీసం ఒక్క మాట రాయడం లేదని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. “వీరి మానవత్వం కేవలం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చేతుల్లో ఆయుధాలు పట్టుకుని తిరిగే వారి కోసమేనా? నక్సల్స్ ఆయుధాలకు బలవుతున్న సామాన్య పౌరుల పట్ల వీరికి మానవత్వం లేదా? ఇటువంటి ద్వంద్వ వైఖరిని మేం అంగీకరించం” అని ఆయన స్పష్టం చేశారు. వీరు మానవతావాదులు కాదని, నక్సలైట్ల మద్దతుదారులని ఆయన విమర్శించారు. పేద ప్రజల చేతుల్లో ఆయుధాలు పెట్టి, తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలని చూస్తున్న వారి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు.

సాల్వా జుడుం 

సాల్వా జుడుం ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ.. 2005లో నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మద్దతుతో ప్రారంభమైన ప్రజా ఉద్యమమిదని హోంమంత్రి తెలిపారు. గిరిజన యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించి, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు వారికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన మహేంద్ర కర్మను తర్వాతి కాలంలో నక్సలైట్లు పొట్టనబెట్టుకున్నారని గుర్తు చేశారు. అయితే, 2011 జూలై 5న నందిని సుందర్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ… నక్సలైట్లపై దేశం సాగిస్తున్న ఈ పోరాటం చట్టవిరుద్ధమని పేర్కొని, తక్షణమే ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిందని అమిత్ షా వివరించారు. దీని ఫలితంగా ఆయుధాలు వెనక్కి తీసుకున్నారని, ఆ తర్వాత నక్సలైట్లు సాల్వా జుడుంతో సంబంధం ఉన్న వారిని వెతికి మరీ చంపేశారని ఆయన ఆరోపించారు. ఇదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తర్వాతి కాలంలో విపక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మారారని, దేశంలోని శాంతిభద్రతలను గౌరవించే వారు సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఎప్పటికీ ఎంపిక చేయరని ఆయన అన్నారు. “ఒక వ్యక్తి న్యాయమూర్తి హోదాలో ఉండి, రాజ్యాంగ పరమైన గౌరవప్రదమైన వస్త్రాలు ధరించి, తన వ్యక్తిగత సిద్ధాంతాలను తీర్పుగా మార్చి వేలమంది అమాయక గిరిజనుల మరణానికి కారణమైతే, ఆ తీర్పును మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల సంక్షేమం కంటే ఏ సిద్ధాంతం గొప్పది కాదు” అని అమిత్ షా పేర్కొన్నారు.

పదేళ్లలో సాధించిన ప్రగతి 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుండి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాధించిన అభివృద్ధిని అమిత్ షా గణాంకాలతో వివరించారు:

  • రవాణా: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 17,589 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, ఇప్పటికే 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.
  • అనుసంధానత: దాదాపు రూ.6,000 కోట్ల వ్యయంతో 5,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశామని, మరో రెండు పథకాల కింద 8,000 4G టవర్లను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
  • బ్యాంకింగ్ సేవలు: గత 12 ఏళ్లలో 1,804 బ్యాంక్ బ్రాంచ్‌లు, 1,321 ఏటీఎంలు ఏర్పాటు చేశామని, 37,850 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించామన్నారు. అలాగే 6,025 పోస్టాఫీసులను ప్రారంభించినట్లు తెలిపారు.
  • విద్య, నైపుణ్యం: 259 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించామని, వీటితో పాటు 46 ఐటీఐలు, 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి కోసం గత 12 ఏళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
  • సంక్షేమం: ప్రజా సంక్షేమ కార్యకలాపాల కింద ఆరోగ్య శిబిరాలు, మందుల పంపిణీ కోసం రూ.212 కోట్లు ఖర్చు చేశామని, గిరిజన యువత కోసం ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించామని తెలిపారు.
  • భద్రత: ఎస్.ఆర్.ఇ పథకం కింద రాష్ట్రాలకు గత 10 ఏళ్లలో రూ.3,000 కోట్లు, ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద రూ.5,000 కోట్లు అందించినట్లు చెప్పారు.

“మేం మావోయిస్టులతో చర్చలు జరపలేదు, వారిని ఏరివేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. 1970 నుండి ఇవన్నీ ఎందుకు జరగలేదు? గత ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడల్లా నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడి అడ్డుకునేవారు. మేం ఆ పేలుళ్లకు పాల్పడే వారిని తుదముట్టించాం, అందుకే ఇప్పుడు అక్కడ అభివృద్ధి సాధ్యమవుతోంది” అని అమిత్ షా అన్నారు. 

రాజకీయ సంకల్పం 

2014 నుంచి అనుసరిస్తున్న స్పష్టమైన విధానం, బలమైన రాజకీయ సంకల్పం కారణంగానే నేడు దేశం నక్సలిజం రహితంగా మారిందని అమిత్ షా ప్రకటించారు. కాశ్మీర్ అయినా, ఈశాన్య రాష్ట్రాలైనా లేదా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైనా.. దేశంలో ఎక్కడా చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని, వాటిపై ఉక్కుపాదం మోపామని ఆయన వెల్లడించారు.

సమగ్ర వ్యూహం – మెరుగైన సమన్వయం

నక్సలిజం నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి సమన్వయం ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాల పాలన యంత్రాంగాలు, పోలీసు వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF), రాష్ట్ర పోలీసుల మధ్య సహకారాన్ని మెరుగుపరిచామన్నారు. క్షేత్రస్థాయి వరకు నిఘా సమాచారాన్ని చేరవేసే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం ఆయుధాలపైనే కాకుండా, ఎన్ఐఏ, ఇడి, నిఘా సంస్థల ద్వారా నక్సలైట్ల నిధుల సరఫరా, మద్దతు వ్యవస్థలను దెబ్బతీసేలా అన్ని విభాగాలతో సమన్వయంతో ఒక వ్యూహాన్ని అనుసరించామని అమిత్ షా వివరించారు. గతంలో ప్రభుత్వ ఉనికి లేని ప్రాంతాల్లో నేడు పంచాయతీలు ఏర్పడ్డాయని, అభివృద్ధిని ప్రతి గ్రామానికి చేర్చామని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం ‘సంపూర్ణ ప్రభుత్వం’ విధానాన్ని, భద్రత కోసం ‘అన్ని విభాగాల’ విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు.

కీలక మైలురాళ్లు: 2019 నుంచి 2026 వరకు

అమిత్ షా తన ప్రసంగంలో మూడు ముఖ్యమైన తేదీలను ప్రస్తావించారు: 20 ఆగస్టు 2019, 24 ఆగస్టు 2024, 31 మార్చి 2026. 2019లో హోం శాఖలో జరిగిన కీలక సమావేశంలో పోలీసు యంత్రాంగం ఆధునికీకరణ, మాజీ నక్సలైట్లను పోలీసు దళాల్లో చేర్చుకోవడం వంటి వ్యూహాలకు రూపకల్పన చేశారు.

  • బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు 2024 లోపే దాదాపు నక్సల్ రహితంగా మారాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లో గత ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కొంత జాప్యం జరిగిందని, అయితే 2024 జనవరిలో అక్కడ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకలాపాలు వేగవంతం చేశామని చెప్పారు.
  • 24 ఆగస్టు 2024న ప్రకటించినట్లుగానే, 31 మార్చి 2026 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలనే లక్ష్యాన్ని చేరుకున్నామని ఆయన గర్వంగా ప్రకటించారు.

భద్రతా విజయాలు

మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనలో సాధించిన పురోగతిని మంత్రి వివరించారు:

  • పోలీసు స్టేషన్లు: 596 కట్టుదిట్టమైన పోలీసు స్టేషన్ల నిర్మాణం.
  • ప్రభావిత జిల్లాలు: 2014లో 126గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య నేడు కేవలం రెండుకు పడిపోయింది. అత్యంత ప్రభావిత జిల్లాల సంఖ్య 35 నుంచి సున్నాకు చేరింది.
  • క్యాంపులు: గత 6 ఏళ్లలో 406 కొత్త CAPF క్యాంపులు, 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు.
  • ఎన్‌కౌంటర్లు: 2024, 2025, 2026 సంవత్సరాల్లో కలిపి మొత్తం 706 మంది నక్సలైట్లు హతమయ్యారు. 2,218 మందిని అరెస్టు చేయగా, 4,839 మంది లొంగిపోయారు.

టెక్నాలజీ, కార్యకలాపాలు

డ్రోన్ సర్వైలెన్స్, శాటిలైట్ ఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ ట్రాకింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడి నక్సల్ నెట్‌వర్క్‌ను ఛేదించామని అమిత్ షా తెలిపారు. బీహార్‌లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’, జార్ఖండ్‌లో ‘ఆపరేషన్ థండర్ స్టార్మ్’, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ వంటి విజయవంతమైన ఆపరేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ‘బ్లాక్ ఫారెస్ట్’ ఆపరేషన్ 21 రోజుల పాటు 45 డిగ్రీల ఎండలో కొనసాగిందని, దీనివల్ల మావోయిస్టుల ప్రధాన కోట బద్దలైందని పేర్కొన్నారు.

తుడిచిపెట్టుకుపోయిన నాయకత్వం

మావోయిస్టుల సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని హోం మంత్రి స్పష్టం చేశారు.

  • 21 మంది సెంట్రల్ కమిటీ సభ్యులలో 12 మంది హతం కాగా, మిగిలిన వారు లొంగిపోయారు లేదా అరెస్టయ్యారు.
  • బసవరాజు, హిడ్మా, గజురెల్ల రవి, కడారి సత్యనారాయణ రెడ్డి వంటి అగ్రశ్రేణి నేతలు హతమయ్యారు.
  • వేణుగోపాల్, వాసుదేవ్ వంటి సీనియర్లు లొంగిపోయారు.

పునరావాస ప్యాకేజీ, అభివృద్ధి

లొంగిపోయిన వారికి రూ.50,000 తక్షణ ప్రోత్సాహకం, నెలకు రూ.10,000 చొప్పున 36 నెలల పాటు ఆర్థిక సాయం, పక్కా ఇళ్లు, నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నక్సల్ రహితమైన ప్రతి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం రూ.1 కోటి కేటాయిస్తున్నామన్నారు. బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పాండుమ్ వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన సంస్కృతిని, క్రీడలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు.

విపక్షాలపై తీవ్ర విమర్శలు

నక్సలైట్లకు మద్దతు ఇస్తున్న మేధావులు, మానవ హక్కుల ముసుగులో ఉన్నవారిపై అమిత్ షా విరుచుకుపడ్డారు. 15,000 మంది పిల్లల జీవితాలను నాశనం చేసిన నక్సలైట్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. యూపీఏ హయాంలోని జాతీయ సలహా మండలి (NAC) సభ్యులు నక్సలైట్లకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో నక్సల్ సానుభూతిపరులు పాల్గొన్నారని, హిడ్మా వంటి హంతకులకు మద్దతుగా నినాదాలు చేసిన వీడియోలను విపక్ష నేతలే పంపిణీ చేశారని ఆయన విమర్శించారు. 20,000 మంది మరణాలకు వామపక్ష భావజాలమే కారణమని, దీనికి ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెబుతారని అమిత్ షా అన్నారు.