శక్తివంతమైన బిజెపి – అభివృద్ధి చెందిన భారత్
”అభివృద్ధి చెందిన భారత్” (వికసిత్ భారత్) నిర్మాణం మోదీ ప్రభుత్వ నినాదం మాత్రమే కాదు, బిజెపి లక్ష్యం కూడా. ఈ లక్ష్యం దిశగా సమర్థుడి నాయకత్వంలో దేశం సరైన పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా యావత్ దేశ ప్రజల నుంచి ”అభివృద్ధి చెందిన భారత్”కు విశేష మద్దతు వస్తోంది. ఈ మహాయజ్ఞంలో మీరూ భాగస్వాములవ్వండి. బిజెపికి మద్దతివ్వండి, బిజెపి సభ్యత్వం తీసుకొని మాతో చేతులు కలపండి. బిజెపి ఎంత శక్తిమంతమైతే, అభివృద్ధి చెందిన భారత్ కల అంత త్వరగా సాకారం అవుతుంది.
జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సాంస్కృతిక వారసత్వ సూత్రాల ఆధారంగా నిర్మితమైంది భారతీయ జనతా పార్టీ (బిజెపి). కార్యకర్తే పార్టీకి పునాది. బిజెపి అసలుసిసలైన కార్యకర్తల పార్టీ. ”ముందు దేశం, తర్వాత పార్టీ, చివరకు వ్యక్తిగతం” అని విశ్వసిస్తూ, ఆచరిస్తూ మనసా, వాచా, కర్మణా దేశానికి అంకితమైన పార్టీ బిజెపి. ఇందులో వ్యక్తి, కుటుంబం, వంశపారంపర్యాలకు తావు లేదు.
1951లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మార్గదర్శకత్వంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (బిజెఎస్) స్థాపించారు. కాలక్రమంలో దేశ రాజకీయ పరిణామాల మేరకు ఈ బీజేఎస్ 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా అవతరించింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ”ఏకాత్మ మానవవాదం” బిజెపి సైద్ధాంతికతకు పునాది. వ్యక్తి, సమాజం వేరువేరు కాదు, రెండింటిలో ఒకే ఆత్మ ఉంటుందని, వ్యక్తులు అభివృద్ధి చెందినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని స్పష్టం చేస్తున్న ఏకాత్మ మానవవాదాన్ని పార్టీ సిద్ధాంతంగా 1985లో బిజెపి అధికారికంగా స్వీకరించింది.
తమ పాలనను పటిష్టం చేసుకునేందుకు అభివృద్ధి పేరిట వలస పాలకులు భారత్ ను పాశ్చాత్తీకరించేందుకు ప్రయత్నించారు. మన సమాజంలో భారతీయతను పాదుకొల్పేందుకు బిజెపి కట్టబుడి ఉంది. ఘనమైన వారసత్వం కలిగిన మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు పునర్వైభవం తీసుకురావడం బిజెపి సంకల్పం. స్వదేశీ, సాధికారత, స్వావలంబన సాధించడమే అసలైన అభివృద్ధి అనేది బిజెపి భావన. ”లౌకికవాదం” పేరిట జరుగుతున్న వక్రీకరణలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అన్ని మతాలను సమానంగా గౌరవించే ”సర్వ ధర్మ సమ భావన”కు బిజెపి కట్టుబడి ఉంది.
బిజెపి పంచనిష్టలు
- జాతీయవాదం, జాతీయ సమగ్రత
- ప్రజాస్వామ్యం
- గాంధేయ సామ్యవాదం (దోపిడీలేని సమ సమాజ స్థాపనకై గాంధీ సూచించిన సామాజిక, ఆర్థిక విధానాలు)
- సర్వ ధర్మ సమ భావన
- విలువలతో కూడిన రాజకీయాలు
బిజెపి పంచనిష్టలకు ప్రతి కార్యకర్తా కట్టుబడి ఉంటారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా భారత రాజ్యాంగమే పార్టీకి శిరోధార్యం. రాజ్యాంగ పద్ధతుల్లోనే సామాజిక, ఆర్థిక ప్రగతి సాధ్యమని బిజెపి విశ్వసిస్తుంది. ”సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” – భారతీయులందరినీ కలుపుకొని పోతూ, అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ, అందరి విశ్వాసం చూరగొంటూ, అందరం కలిసి కృషి చేయాలన్నది బిజెపి విధానం. తద్వారా సామరస్యపూర్వక, శాంతియుత, అభివృద్ధి చెందిన భారతీయ సమాజాన్ని నిర్మించేందుకు బిజెపి అహర్నిశలు కృషి చేస్తుంది.
బిజెపితో సంక్షేమం, అభివృద్ధి, సాంస్కృతిక వైభవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కాదు, విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. గత పదేళ్లలో 4 కోట్ల మందికి సొంతింటి కల సాకారమైంది, 11 కోట్ల ఇండ్లల్లో నల్లాల ద్వారా తాగునీరు అందుతోంది, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి సదుపాయం ఏర్పడింది, 8 కోట్ల కుటుంబాలు కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్ కు మారాయి, దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందుతున్నాయి, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం భరోసా దక్కింది, ఇలా చెప్పుకుంటూ పోతే పేదల సంక్షేమం దిశగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. గత పదేళ్లలో 25 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు, వారి జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగయ్యాయి.
రైతు పెట్టుబడికి కనీసం ఒకటిన్నర రెట్లు దక్కేలా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను ఎప్పటికప్పుడు పెంచుతూ, ప్రతి రైతుకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తోంది. విపత్తుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉచితంగా పంట బీమా, ఎరువుల సబ్సిడీ, యూరియాకు వేపపూత వంటివెన్నో పథకాలు, కార్యక్రమాలు రైతులను శక్తిమంతం చేస్తున్నాయి.
మోదీ సారథ్యంలో అభివృద్ధిలోనూ భారత్ ముందంజ వేస్తోంది. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయంగా కితాబు అందుకుంటోంది. ‘భారతమాల’ కింద 83,000 కి.మీ జాతీయ రహదారులు నిర్మాణమయ్యాయి, రైల్వేల విద్యుదీకరణ 70 శాతానికి చేరుకుంది, అత్యాధునిక వందేభారత్ రైళ్లు పరుగులెడుతున్నాయి, నగరాల్లో మెట్రో రైళ్లు సేవలందిస్తున్నాయి, దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 150కి పెరిగింది, ఉడాన్ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానయానం అందుబాటులోకి వచ్చింది, పదేళ్ల క్రితం ఊహకు కూడా అందని అభివృద్ధి నేడు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది.
భారతీయ సాంస్కృతిక వైభవాన్ని పునర్ ప్రతిష్టించడంలోనూ మోదీ ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్య రామజన్మభూమిలో కొలువదీరిన బాలరాముడు నిత్య పూజలందుకుంటున్నారు. కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని మహాకాలుడి సన్నిధిలో నిర్మితమైన గ్రాండ్ కారిడార్, సోమనాథ్, కేదార్ నాథ్ ఆలయాల పునరుద్ధరణ కోట్లాది భక్తులకు సరికొత్త అధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. దిల్లీ ఇండియా గేట్ చెంత ప్రతిష్టించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. బిర్సా ముండా, లసిత్ బర్ఫుకాన్ వంటి తెరమరుగైన భారత యోధులనెందరినో ఇప్పుడు సగౌరవంతో స్మరించుకుంటున్నాం. విదేశాలకు తరలిన మన పురావస్తు సంపదను తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్నాం.
ఇప్పుడు సంక్షోభం చుట్టుముడితే ప్రపంచం భారత్ వైపు చూస్తుంది. భూమండలంలో ఎక్కడున్నా ప్రతి భారతీయుడి ఛాతి గర్వంతో ఉప్పొంగుతోంది. నేడు భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో ఉంది, విశ్వగురు దిశగా వడివడిగా అడుగులేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకుంఠిత దీక్ష, నిర్విరామ కృషి, సాహసోపేత నిర్ణయాలు, చారిత్రాత్మక చర్యల కారణంగా నేడు దేశం సంక్షేమంలో ముందంజ వేసింది, అభివృద్ధిలో దూసుకెళ్తోంది, సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో దేశ సమగ్రాభివృద్ధికి పాటు పడుతోన్న బిజెపిని బలోపేతం చేయండి, పార్టీ సభ్యులుగా చేరి ”అభివృద్ధి చెందిన భారత్” మహాయజ్ఞంలో భాగం అవ్వండి.

