‘విమోచన దినం’పై ఓటు బ్యాంకు రాజకీయాలా?
ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వస్తే.. సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని, అందుకే తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో సెప్టెంబర్ 17 కూడా అంతే పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్య, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు, పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 550కి పైగా సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణాన్ని పూర్తి చేశారని, ఆయన అకుంఠిత దీక్ష, తిరుగులేని నాయకత్వమే నేటి భారతదేశ ఐక్యతకు పునాది అని స్పష్టం చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాటం చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను ఒక స్వతంత్ర దేశంగా ఉంచాలనే కుట్రతో నిజాం వ్యవహరించినప్పటికీ, ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ద్వారా సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసి భారత యూనియన్‌లో విలీనం చేశారని, చివరకు నిజాం నవాబు సర్దార్ పటేల్ ముందు తలవంచి లొంగిపోక తప్పలేదని తెలిపారు.
సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి దశాబ్దాలుగా పోరాడుతోందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక మజ్లిస్ పార్టీకి భయపడి విమోచన దినోత్సవాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. నిజాం పాలన కింద ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ చారిత్రక దినాన్ని ఎంతో ఘనంగా స్మరించుకుంటుంటే, తెలంగాణలో మాత్రం గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దీనిని విమోచన దినంగా నిర్వహించడానికి వెనకాడుతున్నాయని మండిపడ్డారు.
బిజెపి దశాబ్దాలుగా చేసిన పోరాటాలు, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా నిర్వహించడం ప్రారంభించిన తర్వాతే… నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు మార్చి వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితికి వచ్చాయని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అని పిలవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎందుకు అంత భయమని ఆయన నిలదీశారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి ‘ప్రజా వంచన’ ప్రభుత్వంగా మారిందని తీవ్రంగా దుయ్యబట్టారు.

