Republic Day

ఓటు చోరీ కాదు.. రాహుల్ మెదడు చోరీ

Republic Dayరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే జరిగింది ఓటు చోరీ కాదని, ఆయన మెదడు చోరీ అని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు, జాబితాను నవీకరించేందుకు భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనే ప్రక్రియను చేపడుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా చనిపోయినవారిని, అక్రమ వలసదారులను, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు.

జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎన్. రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలను కూడా ఇచ్చింది. ప్రభుత్వాలు ఎలా నడవాలి, ప్రజాస్వామ్యం ఎలా కొనసాగాలి అనే దిశ, దశ ఈ రాజ్యాంగమే నిర్దేశించింది. కానీ దురదృష్టవశాత్తూ, మన రాజ్యాంగాన్ని మార్చేందుకు, అవహేళన చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, 1951 వరకు దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం లేదు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టాలి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన చేసిన వ్యక్తి ఆయనే. అంతేకాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే బాటలో ఇందిరాగాంధీ కూడా రాజ్యాంగాన్ని కాలరాయడానికి ప్రయత్నించారు. ఎమర్జెన్సీ విధించి దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులను జైళ్లలో పెట్టించారు. ఎదురు మాట్లాడితే జైలుకు పంపే సంస్కృతిని దేశంలోకి తీసుకొచ్చారు.

ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. అయినప్పటికీ, కొంతమందిని బుజ్జగించే రాజకీయాల కోసం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకువచ్చి, సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని నిర్వీర్యం చేసి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీశారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతుంటారు. కానీ పదేపదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. దేశ ప్రజలకు మేలు చేసేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 కేవలం మరో చట్టం కాదు. గ్రామ స్వరాజ్యానికి నిజమైన బలాన్ని ఇచ్చే చారిత్రాత్మక సంస్కరణ. ఈ చట్టం గ్రామ స్వరాజ్యానికి జీవం పోస్తుంది. అవినీతికి చెక్ పెడుతుంది. ప్రజాధనం ప్రజల చేతుల్లోకే చేరేలా చేసే బలమైన వ్యవస్థ ఇది. యూపీఏ పాలనలో పేదల కోసం ఉపాధి కల్పన పేరుతో అమలు చేసిన ఈ పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఫేక్ జాబ్ కార్డులు, ఫేక్ వర్కులు, మట్టితీసి మట్టివేసే పనులతో లెక్కలకందని భారీ కుంభకోణాలు కాంగ్రెస్ పాలనలో సాధారణంగా మారాయి. 2014 తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. నరేంద్ర మోదీ గారు MGNREGAలో సంస్కరణల దిశగా కీలక అడుగులు వేశారు. ఉపాధి, ఉత్పాదకత కలవాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఇదే వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 ఆత్మ. ఈ చట్టం గ్రామాలకు నిజమైన స్వయం పాలనాధికారాన్ని ఇస్తుంది. ప్రజాధనం ప్రజల పర్యవేక్షణలో ఖర్చయ్యే విధంగా వ్యవస్థను రూపొందిస్తుంది. కానీ ఈ చట్టంపై కాంగ్రెస్ గ్రామీణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగంపై, వీబీ–జీ రామ్ జీ చట్టంపై కాంగ్రెస్ వరుసగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నిజమైన గౌరవం కల్పించింది. నవంబర్ 21న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన ప్రదేశాలను ‘పంచతీర్థాలు’గా మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. 2019లో అధికరణం 370 రద్దు చేసి జమ్మూ–కాశ్మీర్‌ను పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన హింస నుంచి పారిపోయిన ముస్లిమేతర వ్యక్తులు — హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు — భారత పౌరసత్వం ఇవ్వడానికి 2019 పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)ను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది.” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కాసం వెంకటేశ్వర్లు, డా. బూర నర్సయ్య గౌడ్, బండ కార్తీక రెడ్డి, బిజెపి తమిళనాడు, కర్నాటక సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, తదితరులు పాల్గొన్నారు.