రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల స్వయం సమృద్ధ కార్యక్రమం
2026-27 మార్కెటింగ్ సీజన్‌లో రబీ పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీని ద్వారా రైతులకు వారి ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. అత్యధికంగా కుసుమ పువ్వుకు క్వింటాలుకు రూ.600, కాయధాన్యాలు (లెంటిల్స్) (మసూర్) క్వింటాలుకు రూ.300 చొప్పున మద్దతు ధర పెంచారు. రాప్‌సీడ్ & ఆవాలకు రూ.250, పప్పుధాన్యాలకు రూ.225, బార్లీకి రూ.170, గోధుమలకు రూ.160 చొప్పున పెంచారు. అక్టోబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పప్పుధాన్యాల స్వయం సమృద్ధ కార్యక్రమం అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెంపు సహా స్వావలంబన సాధించడమే ఈ వినూత్న కార్యక్రమం లక్ష్యం. దీన్ని 2025-26 నుంచి 2030-31 వరకూ రూ.11,440 కోట్ల అంచనా వ్యయంతో ఆరేళ్లపాటు అమలు చేస్తారు. భారతీయ పంటల సాగు వ్యవస్థలు, ఆహార పదార్థాల్లో పప్పుధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుగింజల ఉత్పత్తిదారు మాత్రమేగాక వినియోగదారు కూడా. జీవన ప్రమాణాలతో పాటు ఆదాయాల పెరుగుదల కారణంగా దేశంలో వీటి వినియోగం కూడా పెరిగింది. డిమాండుకు తగిన ఉత్పత్తి లేనందువల్ల పప్పుగింజల దిగుమతి 15 నుంచి 20 శాతం దాకా పెరిగింది. దేశీయ డిమాండ్ తీర్చే దిశగా ఉత్పత్తి పెంపు, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం సహా రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ఆరేళ్లపాటు “పప్పుధాన్యాల స్వయంసమృద్ధ కార్యక్రమం” అమలు చేస్తామని ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 2030-31 నాటికి పప్పుగింజల సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచడంతోపాటు ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు, దిగుబడిని హెక్టార్ కు 1130 కిలోలకు పెంపు ఈ కార్యక్రమ లక్ష్యాలు. ఇందు కోసం రైతులకు 126 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను పంపిణీ చేస్తారు. ఈ దిశగా రైతులకు 88 లక్షల విత్తన కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. సుస్థిర పద్ధతులు, ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహిస్తూ నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాలతో రైతులు, విత్తన సాగుదారుల సామర్థ్య వికాసానికి కృషి చేస్తారు. ‘పీఎం-ఆశా’ కింద ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్) ప్రకారం ప్రధానంగా కంది, మినుము, సెనగ పంటలను గరిష్ఠ స్థాయిలో కొనుగోలు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే రాష్ట్రాల్లో తమతో ఒప్పందం కుదుర్చుకునే రైతుల నుంచి ‘నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్’ సంస్థలు నాలుగేళ్లపాటు 100 శాతం పంటను కొంటాయి.
తెలంగాణకు 4 కేవీలు
రానున్న తొమ్మిది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల పెరుగుతున్న విద్యా అవసరాలను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి మొత్తం ఆర్థిక వ్యయం రూ.5,862.55 కోట్లుగా అంచనా. మంజూరైన మొత్తంలో రూ.2,585.52 కోట్లు మూలధన వ్యయం కోసం, రూ.3,277.03 కోట్లు కార్యాచరణ వ్యయం కోసం కేటాయించారు. మొదటిసారిగా అన్ని 57 కేంద్రీయ విద్యాలయాలను జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా, మూడు సంవత్సరాల ప్రాథమిక ప్రీ-ప్రైమరీ తరగతులైన బాలవాటికలను కలిగి ఉంటాయి. సమతుల్య ప్రాంతీయ కవరేజీపై దృష్టి సారించి, 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 20 కేంద్రీయ విద్యాలయాలు లేని జిల్లాల్లో, 14 ఆకాంక్షాత్మక జిల్లాల్లో, నాలుగు వామపక్ష తీవ్రవాదం (LWE) ప్రభావిత ప్రాంతాల్లో, ఐదు ఈశాన్య, కొండ ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. హోం మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన ఏడు కేవీలను, రాష్ట్ర/యూటీ అధికారులు స్పాన్సర్ చేసిన 50 కేవీలను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఆమోదించింది. ఇందులో భాగంగా తెలంగాణకు నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఇవి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల (చెల్గల్), వనపర్తి (నాగవరం శివారు) జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు ఇవి తోడుగా నిలవనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా మారుమూల ప్రాంతాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
బీఆర్‌సీపీ మూడో దశకు ఆమోదం
బయోమెడికల్ రీసెర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (BRCP) మూడో దశను కొనసాగించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మూడో దశ (2025-26 నుంచి 2030-31 వరకు), అలాగే తరువాతి ఆరు సంవత్సరాల వరకు (2031-32 నుంచి 2037-38 వరకు) బయోటెక్నాలజీ విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ DBT), బ్రిటన్ కు చెందిన వెల్‌కం ట్రస్ట్ (WT)లతో పాటు ఎస్‌పీవీ, ఇండియా అలయన్స్‌ల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. రూ.1500 కోట్ల మొత్తం వ్యయంతో 2030-31 వరకు అనుమతించిన ఫెలోషిప్, గ్రాంట్లను మంజూరు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనిలో రూ.1,000 కోట్లను DBT, రూ.500 కోట్లను యూకేకు చెందిన WT సమకూరుస్తాయి. ఈ కార్యక్రమం అత్యాధునిక బయోమెడికల్ రీసెర్చ్ కృషిలో అగ్రగామి శాస్త్రవేత్తలకు తోడ్పడుతుంది.
యూకేకు చెందిన వెల్‌కం ట్రస్టుతో DBT భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని 2008-2009లో బయోమెడికల్ రీసెర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (BRCP)ని ప్రారంభించింది. దీనికోసం DBT, వెల్‌కం ట్రస్ట్ ఇండియా అలయన్స్ పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (SPV)ని ఏర్పాటు చేశారు. ఇది బయోమెడికల్ రీసెర్చ్‌లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో భారత్‌లోనే రీసెర్చ్ ఫెలోషిప్పులను అందిస్తోంది. దీని తరువాత, విస్తారిత పోర్ట్‌ఫోలియోతో రెండో దశను 2018, 19లో అమలు చేశారు. మూడో దశలో, ఈ కింద పేర్కొన్న కార్యక్రమాలను అమలు చేయాలని ప్రతిపాదించారు:
i.) మౌలిక, రోగ చికిత్సలకు సంబంధించిన (క్లినికల్), ప్రజారోగ్యం పరంగా ప్రారంభ కెరియర్, మధ్య స్థాయి రీసెర్చ్ ఫెలోషిప్పులు. ఇవి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించినవీ, ఒక శాస్త్రవేత్తకు పరిశోధన ప్రధాన కెరియర్లో మొదటి దశలకు ఉద్దేశించినవీ.
ii.) సహకార ప్రధాన గ్రాంట్ల కార్యక్రమం. భారత్‌లో పటిష్ఠ పరిశోధన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న ప్రారంభ, మధ్య స్థాయి సీనియర్ స్థాయి కెరియర్ పరిశోధకుల కోసం ఉద్దేశించిన రెండు, మూడు పరిశోధక బృందాలకు కెరియర్ డెవలప్‌మెంట్ గ్రాంట్లు, కెటలిటిక్ కొలాబరేటివ్ గ్రాంట్లను అందించడం ఈ కార్యక్రమంలో భాగం.
iii) ముఖ్య పరిశోధన ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన రీసెర్చ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం. మూడో దశలో మెంటార్‌షిప్పు, నెట్‌వర్కింగ్, ప్రజలను భాగస్వాములను చేయడం.. వీటిని బలపరచడంతో పాటు కొత్త, నవోన్మేష జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యాలను అభివృద్ధిప రుచుకోవడంపై కూడా దృష్టి పెడతారు.
ఒకటో దశ, రెండో దశలు భారత్‌ను అంతర్జాతీయ స్థాయి కలిగిన బయోమెడికల్ సైన్సుకు సరికొత్త కూడలిగా నిలిపాయి. విజ్ఞానశాస్త్రంలో భారత్ పెట్టుబడులను పెంచుతుండడంతోనూ, ప్రపంచ జ్ఞాన ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర అంతకంతకూ పెరుగుతుండడంతోనూ వ్యూహాత్మక ప్రయత్నాల్లో ఒక కొత్త దశను ఆవిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఒకటో, రెండో దశలతో లభించిన ప్రయోజనాలను స్ఫూర్తిగా తీసుకొని, మూడో దశ ఇక జాతీయ ప్రాధాన్యాలతో పాటు ప్రపంచ ప్రమాణాలకు కూడా తులతూగే ప్రతిభావంతులకు అండదండలను అందించడం, సామర్థ్య సాధన, రూపాంతరణ (ట్రాన్స్‌లేషన్) ప్రక్రియలపై దృష్టి సారించనుంది.
డీఏ, డీఆర్ పెంపు
ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (DA), పింఛనుదారులకు కరువు భృతి (DR)ని ప్రస్తుతమున్న 55% రేటుకు మరో 3% పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 01.07.2025 నుంచి దీనిని అమలు చేస్తారు. కరువు భత్యం, కరువు భృతి.. రెండింటి పెంపు వల్ల ఖజానాపై ఏటా రూ.10083.96 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఈ పెంపు వల్ల సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారు. ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం DA, DR లను పెంచారు.

