మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం దాగుడుమూతలు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలతో దాగుడుమూతలు ఆడుతున్నది. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం, వ్యయం, నిర్వాసితుల పునరావాసానికి ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో బయటపెట్టకుండా రోజుకొక మాట చెబుతూ అంతర్గతంగా ప్రజలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.4100 కోట్ల డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం చెప్పడంతో ఈ ప్రాజెక్టు లోగుట్టు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న భాగానికే అంత అవసరమైతే ప్రాజెక్ట్ మొత్తానికి ఎంతవుతుందన్న అనుమానాలు పుడుతున్నాయి. మూసీ ప్రాజెక్ట్ ముసుగులో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసిందని స్పష్టం అవుతుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని నిరుపేదల భూములను ప్రపంచబ్యాంకుకు అప్పగించేందుకే ప్రభుత్వం కుట్ర పన్నిందా అన్న భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. అయితే, మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసి ప్రాజెక్టు కోసం కాకుండా మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని చెప్పే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తుంది. ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనలతో రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద పెద్ద భవంతులు కడుతామని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తున్నది. డీపీఆర్‌లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్లో మూసీ డీపీఆర్ ఉన్నదని ప్రభుత్వం అంగీకరించగా ఆ తర్వాత అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ప్రెస్మీట్లో డీపీఆర్ సిద్ధం కాలేదని ప్రకటించారు. అంతేకాకుండా, ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్టోబరులో డీపీఆర్ తయారీకి కాన్సార్షియంను ప్రభుత్వం నియమించింది. అయితే, మూసీ నది విషయమై పీపీఆర్ (ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేశామని, ఆ విషయాన్ని వెబ్సైట్లో కూడా పొందుపర్చామని శ్రీధర్‌బాబు అసెంబ్లీలో తెలిపారు. డీపీఆర్(డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇంకా సమర్పించలేదని, ప్రపంచబ్యాంక్ నిధులు ఇచ్చే అవకాశం ఉంటే తక్కువ వడ్డీకి తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇంకా ప్రపంచ బ్యాంకును సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఏదేమైనా ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు సంబంధం లేకుండా పోతుంది.
అసలు ఈ ప్రాజెక్ట్ వ్యయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతుంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో మాట్లాడుతూ రూ.50 వేల కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఆపై పక్షం రోజుల్లోనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ కార్యక్రమంలో రూ.71 వేల కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్నట్టు చెప్పారు. ఆపై మే చివర్లో మెయిన్‌హార్ట్ ప్రతినిధుల బృందం మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. జూలై 28న గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏకంగా లక్షన్నర కోట్ల అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. పారదర్శకత లేకుండా ఎందుకు దాపరికంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, అసెంబ్లీకి, పేద ప్రజలకు వేర్వేరు మాటలు చెబుతూ ఉండడంతో ప్రభుత్వ ఉద్దేశ్యంపై అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొంది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయంతో మొదలైన గందరగోళం అసెంబ్లీలోనూ కొనసాగింది. ఏకంగా అసెంబ్లీ వేదికగానే తలో మాట మాట్లాడుతున్నారు. ఈ ఏడాది జూలై నెలాఖరులో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూసీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధంగా ఉన్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇవే సమావేశాల్లో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ డీపీఆర్ సిద్ధం కాలేదని, ప్రాథమిక దశలోనే ఉన్నదని దశలవారీగా నిధులు వెచ్చిస్తామని సెలవిచ్చారు. మూసీ డీపీఆర్‌ను రూపొందించేందుకు టెండర్లను ఎంఆర్డీసీఎల్ జూన్ మొదటి వారంలో పిలిచింది. అదే నెల 24న బిడ్ల దాఖలు గడువు పూర్తయింది. జూలై 5న ప్రైస్ బిడ్లను తెరవగా ఎల్-1గా సాయి కన్సల్టెన్సీ ఎంపికైంది. కానీ ఎంఆర్డీసీఎల్ అధికారులు దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన 2024, జూలై 20న జీవో ఆర్టీ నంబర్ 325ని జారీ చేసి కన్సల్టెన్సీ టెండర్ల పరిశీలనకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సాయి కన్సల్టెన్సీకి ఎంపికైన టెండర్లను రద్దు చేసి, కొత్త టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రెండోసారి టెండర్లు పిలిచి రోజుల్లోనే మెయిన్‌హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు మూసీ మాస్టర్‌ప్లాన్ బాధ్యతల అప్పగింతకు నిర్ణయించింది. ఆపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 4న రూ.161 కోట్ల వ్యయంతో మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు బాధ్యతలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. మరునాడే ఆ కన్సార్షియంకు ఎంఆర్డీసీఎల్ అంగీకార పత్రం ఇచ్చారు.
ఇక్కడో విచిత్రమైన విషయం ఏందంటే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ బాధ్యతల అప్పగింతపై టెండర్లు కొనసాగుతున్న సమయంలోనే రేవంత్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక (పీపీఆర్)ను ఇచ్చింది. కన్సల్టెన్సీని ఎంపిక చేయకముందే సెప్టెంబరు 19న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట ఈ నివేదికను ప్రపంచ బ్యాంకుకు పంపారు. అందులో డిసెంబరులోనే ఈ ప్రాజెక్టు మొదలవుతుందని, ఈ మేరకు రూ.4100 కోట్ల రుణం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1,763 కోట్లు జత చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా 20వ కాలంలో మూసీ ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఉన్నది అని ప్రభుత్వమే అంగీకరించింది. ఓవైపు టెండర్లు కొనసాగుతుండగా మరోవైపు డీపీఆర్ ఉన్నదని ప్రభుత్వం పీపీఆర్లో పొందుపరచడమంటే ప్రపంచబ్యాంకుకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడమే కాగలదు. 15 వేల ఇళ్లకు మార్కింగ్ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం నిర్వాసితుల్లో నెలకొంది. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు. ప్రభుత్వం చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిర్వాసితులకు ఏం వస్తుందో స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాల్సి ఉంది.
ప్రవీణ్

