చర్లపల్లి టెర్మినల్‌తో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి వేగవంతం : మోదీ
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌తో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతమయ్యేందుకు పునాదులు పడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇందుకు ఈ స్టేషన్‌ను ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయాలన్నారు. జనవరి 6న ఆయన వర్చువల్‌గా చర్లపల్లి రైల్వే ష్టేషన్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చర్లపల్లి టెర్మినల్ వేదికపై నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా కిషన్ రెడ్డి వ్యవహరించడంతో భాగ్యనగర మణిహారంలో మరొక మణిపూసగా చేరింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సహకరించకపోయినా చర్లపల్లి టెర్మినల్‌ను పూర్తిచేసుకోవడం మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. భారతదేశానికి స్వాంతంత్ర్యం సిద్ధించిన తర్వాత తెలంగాణలోనే మొట్టమొదటి రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి టెర్మినల్ చరిత్రలో నిలిచిపోనుంది. ఇక్కడ ఆధునిక ప్లాట్‌ఫాం, లిఫ్ట్, ఎస్కలేటర్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్ విద్యుత్తు అంతా సూర్యశక్తి నుంచే వస్తుంది. ఈ స్టేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గిస్తుంది. ప్రతి రోజు సుమారు 24 రైళ్లు చర్లపల్లి టెర్మినల్ కేంద్రంగా రాకపోకలు సాగిస్తాయి. ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉండటంతో ఇక్కడ మరింత అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో గూడ్స్ రైళ్ల రాకపోకలకు కేంద్రంగా, హైదరాబాద్ పారిశ్రామిక అభివృద్ధికి ఈ టెర్మినల్ మరింత దోహదపడుతుంది.
తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా రూ.32 వేల కోట్లు కేటాయించి, 40 రైల్వేస్టేషన్లను, పలు రైల్వేలైన్లను ఆధునీకరించడం, 5 వందేభారత్ ట్రైన్లను కేటాయించింది. బిజెపి ప్రభుత్వం కేవలం ఒక్క 2024-25 బడ్జెట్‌లోనే రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి కోసం రూ.5,336 కోట్ల నిధులను కేటాయించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఏ ఒక్క సంవత్సరం బడ్జెట్‌లోనూ ఈ స్థాయిలో కేటాయింపులు జరపలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.720 కోట్లతో, నాంపల్లి రైల్వేస్టేషన్‌ను రూ.350 కోట్లతో ఆధునీకరిస్తున్నారు.
చర్లపల్లి టెర్మినల్‌తో పాటు జమ్మూ రైల్వే డివిజన్ ప్రారంభం, తూర్పు కోస్తా రైల్వే రాయగడ డివిజన్ భవన నిర్మాణానికి పునాదులు వేసే కార్యక్రమాల్లోనూ నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం యజ్ఞం జరుగుతోందని, బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. అన్ని ప్రాంతాలకు అత్యధిక వేగంతో కూడిన రైళ్లను నడపడంతోపాటు ప్రయాణికుడికి తొలిస్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు మరచిపోలేని ప్రయాణ అనుభూతిని మిగిల్చేలా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… ‘‘వికసిత్ భారత్ సంకల్పంలో రైల్వేల ప్రగతి కీలకం. రైల్వేలో సదుపాయాలు, యాత్రికులకు సౌకర్యాలు, దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వేతో అనుసంధానం, యువతకు ఉద్యోగాలు అనే నాలుగు అంశాలపై రైల్వేను అభివృద్ధి చేస్తున్నాం. ఉత్తరాన జమ్మూ, తూర్పున ఒడిశా, దక్షిణాన తెలంగాణలోని ఈ ప్రాజెక్టులతో ఆధునిక ప్రగతికి బాటలు పడ్డాయి. జమ్మూ డివిజన్ ద్వారా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, లేహ్, లద్దాఖ్ ప్రాంతాల ప్రజలకు లాభం చేకూరుతుంది. ఒడిశాలోనూ రూ.70 వేల కోట్లతో రైల్వే ఆధునికీకరణ జరుగుతోంది.
ఇవాళ ప్రజలకు ఎక్కువదూర ప్రయాణాలను సైతం తక్కువ సమయంలో పూర్తిచేసే ఆలోచనతో ఉన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా మేం పనిచేస్తున్నాం. దేశంలో ఇప్పటికే 50 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. ఇటీవల వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్‌రన్‌లో గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం చాలా సంతోషంగా కలిగింది. ఇది కేవలం ఆరంభం. తొలి బుల్లెట్ రైలు పరుగులు తీసేరోజు ఎంతో దూరంలో లేదు. ప్రయాణికులకు చక్కటి అనుభూతిని కల్పించే లక్ష్యంతో 1,300 అమృత్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో రైల్వే కనెక్టివిటీ పెరిగింది. కొత్తగా 30 వేల కి.మీ. రైలుమార్గం వేశాం. వేల సంఖ్యలో ఆర్‌వోబీలను, ఆర్‌యూబీలను నిర్మిస్తున్నాం. 2014వరకు దేశంలో 35 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. ఇవాళ దాదాపుగా 100 ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేసుకోబోతున్నాం. రైల్వేల రీచ్‌ను కూడా విస్తృతం చేస్తున్నాం. దీని ద్వారా సామాన్య ట్రాక్ లపై ఒత్తిడి తగ్గి.. ప్రజల ప్రయాణ సమయం తగ్గేందుకు వీలుంటుంది. విద్యుదీకరణలో నూరు శాతానికి దగ్గర్లో ఉన్నాం. కవచ్ ద్వారా రైలు ప్రమాదాలు తగ్గిస్తున్నాం. సరకు రవాణాకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మిస్తున్నాం. దీనివల్ల సాధారణ రైల్వే ట్రాక్‌లపై ఒత్తిడి తగ్గి, హైస్పీడ్ రైళ్లను నడిపించే అవకాశాలు పెరుగుతాయి. రైల్వే ద్వారా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నాం.
వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, రైల్వే స్టేషన్లపై సోలార్ ప్యానెళ్ల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి వంటి నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులను అవి అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి చేరవేస్తున్నాం. దీని వల్ల పారిశ్రామికీకరణకు కూడా ప్రోత్సాహం అందుతోంది. దేశంలో ఎక్స్‌ప్రెస్ వేలను, మెట్రో నెట్‌వర్క్‌లను వేగంగా పెంచుతున్నాం. పదేళ్ల క్రితం నాలుగు నగరాల్లోనే ఉన్న మెట్రోరైలు సేవలు ఇప్పుడు 21 నగరాలకు విస్తరించాయి. వాటి నెట్‌వర్క్ మొత్తం 1000 కి.మీ.లకు చేరింది. ఎయిర్‌పోర్టుల్లోనూ అత్యుత్తమ సేవలు లభిస్తున్నాయి. దేశంలో 2014లో 74 ఎయిర్‌పోర్టులు ఉంటే.. ఇప్పుడు 150కి చేరాయి’’ అని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్ పూర్తి చేయాలి: జి. కిషన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణానికి దోహదపడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు అప్రోచ్ రోడ్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక ఉత్తరాలు రాసినా స్పందించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్డును పూర్తి చేయాలి. చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సులభతరంగా వెళ్లేలా ప్రయాణికులకు ఉపయోగపడనుంది. రూ.413 కోట్లతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ రానున్న రోజుల్లో సరకు రవాణా విషయంలో ఎంతో ఉపయోగపడనుంది. ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా చర్లపల్లి నుంచి ఘట్‌కేసర్ వెళ్లనున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుంది.
సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టును తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. ఇన్నాళ్లు రైలు కూత వినపడని ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వేలైన్లు నిర్మించి డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చేపట్టింది. తెలంగాణలో డీజిల్‌తో నడిచే రైళ్లను దశలవారీగా నిలిపివేసి 100 శాతం విద్యుదీకరణ వైపు రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తోంది. రానున్న రోజుల్లో రైల్వే ప్రమాదాలను నివారించేలా, మరింత భద్రతను కల్పించేలా కవచ్ అనే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థను తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేలా 5 వందే భారత్ ట్రైన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న కాజేపీట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. కాజేపీట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో రైల్వే ఇంజిన్లు, రైల్వే వ్యాగన్లు, రైల్వే కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నారు. దీంతో సుమారు ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణలో 346 కి.మీ. మేర కొత్త రైల్వేలైన్లను వేగవంతంగా వినియోగంలోకి తీసుకొచ్చాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా కేంద్ర ప్రభుత్వం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు నిర్ణయించింది. అందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వేగవంతంగా రైల్వేలైన్‌ను విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి దర్శనం కోసం సుదూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ప్రయాణ వెతలను తీర్చేలా కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం.
రైల్వేలు ట్రాన్సుపోర్టు రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వేవ్యవస్థ గత పదేళ్లుగా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, విద్యుదీకరణ వంటి అనేక రకాలుగా వేగవవంతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్దఎత్తున ఏకకాలంలో రూ.1350 రైల్వేస్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో కొత్త మోడల్‌లో అభివృద్ధి చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్షా 20 వేల కోట్ల నిధులతో నేషనల్ హైవేలు నిర్మించాం. మరో రూ. 80 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నాం. రాష్ట్రంలో 33 జిల్లాలకు మొత్తం 32 జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేశాం. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.26 వేల కోట్లు వెచ్చిస్తోంది. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తూ, అండగా ఉంటుంది.’’ అని అన్నారు.
మోదీ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి: బండి సంజయ్
ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘గతంలో రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకుండా, ట్రాక్ లపై చెత్తాచెదారంతో నిండిపోయి ఉండేవి. దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వే, రోడ్లు, వైమానిక రంగాలు అభివృద్ధి చెందాలి. అమెరికా లాంటి దేశాలు కూడా ఈ మూడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. గత పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి కోసం రూ.32 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి గారి నేతృత్వంలో “స్వర్ణ చతుర్భుజి ప్రణాళిక”తో నేషనల్ హైవేలు నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా నిధులతో సహకరిస్తోంది. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.’’ అని అన్నారు.
మల్కాజ్‌గిరి రైల్వేలైన్లకు నిలయం: ఈటల రాజేందర్
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉన్నప్పటికీ 70-80 ఏళ్లు రైల్వే స్టేషన్లు పాతబడుతున్నప్పటికీ కేవలం రూ.5-10 కోట్లతో తూతూమంత్రంగా మెరుగులు దిద్దే పనులు జరిగాయి తప్పితే ఎక్కడా కూడా సంపూర్ణంగా అభివృద్ధి జరగలేదు. పెరిగిన జనాభా, వారి అవసరాలకు తోడుగా గొప్పగా నిర్మాణం జరగాల్సిన రైల్వేస్టేషన్లు దుర్గంధ పూరితంగా తయారయ్యాయి. నేడు దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పోటీపడే విదంగా మోడ్రన్ రైల్వేస్టేషన్లు నిర్మాణం జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం కాజీపేట-బల్లార్షా వరకు 4 లైన్ల నిర్మాణం చేపట్టింది. దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల విద్యుదీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం అనేక రైల్వేలైన్లకు నిలయం. రైల్వే ఆస్తులు, రైల్వే ఉద్యోగులకు నిలయంగా ఉంది. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇంత గొప్పగా నిర్మాణం జరగడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందనున్నాయి.’’ అని అన్నారు.

