Rahul

వరుస పరాజయాలు ఎదురైనా.. కాంగ్రెస్‌లో కానరాని ఆత్మశోధన

భారతదేశపు అతి పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ 2014 నుంచి అత్యంత దారుణమైన ఎన్నికల ఫలితాలను చవిచూస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురవుతున్న పరాజయాలను పట్టించుకోని కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు తన చేతులతో సృష్టించిన వ్యవస్థను తప్పు పట్టడం, నిందలు వేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడమే కాకుండా పరాజయాలను అంగీకరించి, అవసరమైన ఆత్మపరిశీలన, అవసరమైన సంస్కరణలు చేపట్టే సంసిద్ధత, సామర్థ్యాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ పతనం ఎదో పరిస్థితుల ప్రభావం వల్ల కాదని, దానికి ఆ పార్టీలో లోతుగా పేరుకుపోయిన రుగ్మతలే కారణమని ఇప్పుడు స్పష్టం అవుతోంది. యూపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు తమ సీట్ల సంఖ్యా దృష్ట్యా లోక్‌సభలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒకసారి ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ మొదటి స్థానాన్ని కోల్పోతే ఆ పార్టీ పుంజుకోవడం దాదాపు అసాధ్యం అవుతోంది. అందుకు ఈ ఐదు రాష్ట్రాలే నిదర్శనం. ఈ రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటమో చాలా కాలంగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడమో జరుగుతోంది. దీనికితోడు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్నప్పటికీ, రాజకీయ ఎజెండాను తనంతట తాను నడిపించే స్థితిలో లేదు. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తోంది.

కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని సీట్ల సంఖ్యగా మార్చడంలో విఫలమవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం పరిస్థితిపై మరింతగా పట్టు కోల్పోతే నాయకులు, కార్యకర్తలు పార్టీలో కొనసాగడం మరింత కష్టమవుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లో తమకు భవిష్యత్తు లేదని వారు గ్రహిస్తారు. పార్టీ సిద్ధాంతాల స్ఫూర్తి, సందేశం కూడా వేగంగా ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి. పార్టీ రాజకీయ ఎజెండా, పదజాలం, దృష్టి, లక్ష్యం.. ఇవన్నీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు విసుగు తెప్పిస్తున్నాయి. పార్టీలో ఏ రంగంలోనూ ఎలాంటి సంస్కరణలు కనిపించడం లేదు. లౌకికవాదం, గంగా-జమునా తెహజీబ్, వామపక్ష ఉదారవాదం, వివిధ వర్ణాల సోషలిజం, కుల ఆధారిత రాజకీయ నినాదాలపై రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ అతిగా దృష్టి సారించడం వల్ల దేశంలోని యువతరానికి అవి దూరమయ్యాయి. ప్రపంచంలో ఉత్సాహంగా ముందుకు సాగాలనుకుంటున్న సామాన్య భారతీయులకు ఈ పరాయి నినాదాలు, సిద్ధాంతాలు పాతకాలానివిగా, కృత్రిమమైనవిగా అనిపిస్తాయి. 

‘ఇండీ’ కూటమిలో కూడా కాంగ్రెస్ ఏకాకిగా ఉంది. కూటమిలో ఎవరూ ఆ పార్టీ నాయకత్వాన్ని ఏ స్థాయిలోనూ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు యూపీఏ చచ్చిపోయింది. రెండేళ్ల క్రితం దాని స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీపై అకారణంగా వ్యతిరేకత తప్ప మరే విధమైన స్పష్టమైన ఫలితం లేదా దీర్ఘకాలిక ప్రణాళిక, కార్యక్రమం లేకుండా ఇండీ కూటమి ఏర్పడింది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా కాకుండా నెహ్రూ-గాంధీ వంశానికి చెందిన త్రిసభ్య కుటుంబ భూస్వామ్య రాజకీయాలకు ప్రతినిధిగా దిగజారిపోయింది.

2024 జూన్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వాస్తవ స్థితికి అద్దం పడుతున్నాయని రుజువైంది. 243 మంది సభ్యుల ఉన్న సభలో 99 సీట్లు సాధించడం భారత రాజకీయాల్లో పెను ప్రకంపనలుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమకు తాము గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. దేశ ఆలోచనా ధోరణి మారుతోందని, అందుకు అనుగుణంగా తన ప్రాధాన్యాలను వ్యూహాత్మకంగా మార్చుకున్నామని ఆ పార్టీ చెప్పింది. అయితే హర్యానా, జమ్ముకాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్, దిల్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రణాళిక, ఆకాంక్షలు, వాగ్దానాలు, ఆశలకు పూర్తి భిన్నమైన చిత్రాన్ని అందించాయి. ఈ ఫలితాలు కనీసం వచ్చే ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం తన పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్న వాస్తవాన్ని గ్రహించినట్టు లేదు. 

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల గుజరాత్ లో పర్యటించినప్పుడు సొంత పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ గుజరాత్ లో కాంగ్రెస్‌లోకి బిజెపి తన మనుషులను పంపిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ‘కలుపు మొక్కలను’ కనిపెట్టి ప్రక్షాళన చేయాలన్నారు. ఈ మాటలు సమావేశానికి హాజరైన రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు రుచించలేదు. ఆ తర్వాత ఆయన పార్టీలో కీలక సంస్కరణలు అవసరమని చెప్పారు గాని ఈ సంస్కరణలు ఎవరు ఎప్పుడు చేపడతారో మాత్రం చెప్పలేదు! ఇది చాలదన్నట్లు, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో జరిగిన అనేక స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయాలను చవిచూసింది, చూస్తూనే ఉంది. గత ఎనిమిది నెలలుగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అన్ని ప్రధాన ఉప ఎన్నికల్లో పొత్తులు, మిత్రపక్షాలతో సర్దుబాట్లతో సంబంధం లేకుండా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఊహించని, నిరాశాజనకమైన పనితీరు కనబరిచింది. ఇది పార్టీ పట్ల క్షేత్రస్థాయిలో ప్రజల వైఖరిని తెలియజేస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ పరాజయాలకు ఈవీఎంలను నిందించే అవకాశం లేదు, ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రధానంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగాయి. 

ఇటీవల ఎన్నికలు జరిగిన ఉత్తరాఖండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా బిజెపి చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా కూడా ఎక్కడా నిలబడలేదు. తాజాగా స్థానిక ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇప్పుడు అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలో గత ఎనిమిది నెలల కాలంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నాయి. మూడు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం 5 లేదా 6వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో కనుమరుగవుతున్న పార్టీకి ఈ ఏడాది మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్షే. 

దేశంలో భూస్వామ్య వారసత్వ రాజకీయాలు, భారీ స్థాయిలో అవినీతి, మైనారిటీల బుజ్జగింపు, దుష్పరిపాలన, అసమర్థ పాలనకు కాంగ్రెస్ పార్టీని ప్రతినిధిగా ప్రజలు భావిస్తారు. వీటితో పాటు రక్షణ విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, అవినీతి కుంభకోణాలు, చైనా యుద్ధంలో ఓటమి, పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించిన తర్వాత చర్చల్లో జాతీయ ప్రయోజనాలపై రాజీపడటం, సమాజంలో ఉగ్రవాదం, తీవ్రవాద శక్తుల పట్ల సానుభూతి కలిగించడం, బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి అక్రమ వలసలను ప్రోత్సహించడం వంటి అభియోగాలు కూడా ఆ పార్టీపై ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2014 మధ్య కాలంలో ‘హిందూ-ఉగ్రవాదం’ అనే తప్పుడు భావనను ప్రజల్లో ప్రవేశపెట్టడానికి పార్టీ అగ్ర నాయకత్వం తమపై ఎలా ఒత్తిడి తెచ్చిందీ, మార్గనిర్దేశనం చేసిందీ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే వెల్లడించారు. దీంతో ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయం దిగజారిపోయింది. బలహీనమైన, అసమర్థమైన పార్టీ నాయకత్వం ప్రజల్లో ఈ అభిప్రాయం మరింత బలపడేలా చేసింది. 

అశ్వనీ కుమార్ చురుంగూ