వికసిత్ భారత్‌కు బాటలు వేస్తున్న స్వావలంబన
ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై పరిమిత పాత్ర పోషించిన భారత్ ఇప్పుడు తన స్వాభావిక సంపదలు, భారీ పరిశ్రమలను ఉపయోగించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 18 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో పోటీపడుతోంది. వేగంగా పెరుగుతున్న కీలక రంగాలు, అలాగే దేశ సహజ సంపద, సామర్థ్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2023లో 690 బిలియన్ (బిలియన్-వంద కోట్లు) డాలర్లుగా ఉన్న ఆదాయాన్ని 2030 నాటికి 2 ట్రిలియన్లకు (ట్రిలియన్-లక్ష కోట్లు) పెంచగల 18 కీలక రంగాలను గుర్తించారు. ఈ రంగాలు 2040 నాటికి అదనపు స్థూల దేశీయోత్పత్తిలో (GDP) దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉండగలవని అంచనా. ఎలక్ట్రానిక్స్ నుంచి స్వచ్ఛ ఇంధనం (గ్రీన్ ఎనర్జీ), రక్షణ రంగం వరకు భారతీయ పరిశ్రమలు కేవలం దేశాభివృద్ధికి మాత్రమే కాకుండా GDP 30 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసిన ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) అనే శతాబ్దాల నాటి స్వదేశీ ఆదర్శాన్ని కూడా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఈ వ్యూహంలో భారతదేశ జనాభా అత్యంత ముఖ్యమైన సానుకూల అంశం. దేశ జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు వారు ఉండడం, అలాగే 2025 ఆర్థిక సంవత్సరంలో GDPలో ప్రైవేట్ వ్యయం 61.4 శాతం కంటే ఎక్కువ ఉండటం వల్ల దేశీయ మార్కెట్ పరిమాణం వృద్ధిని ప్రోత్సహించి, ప్రపంచస్థాయిలో పోటీపడే శక్తిని పెంచుతుంది. 2030 నాటికి 7.5 కోట్ల మధ్యతరగతి, 2.5 కోట్ల ధనవంతుల కుటుంబాలు ఉంటాయని, ఇది జనాభాలో 56 శాతంగా ఉంటుందని అంచనా. ఇది వినియోగదారుల స్థాయిలో మునుపెన్నడూ లేని అధునాతనకు దారితీస్తుంది.
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ
ప్రపంచ చిప్ డిజైనర్లలో 20 శాతానికిపైగా భారత్‌లోనే ఉన్నారు. అయినప్పటికీ, దేశం సెమీకండక్టర్ అవసరాలకు దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం ‘భారత్ సెమీకండక్టర్ మిషన్’ కింద ఐదు సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపింది. వీటిలో మొత్తం పెట్టుబడి 18.15 బిలియన్ డాలర్లు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని విస్తరించడం, 5జి, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), విద్యుత్ వాహనాల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు కీలక భాగాలను ఉత్పత్తి చేయడం లక్ష్యం. 2030 నాటికి సెమీకండక్టర్ రంగాన్ని 150 బిలియన్ డాలర్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యవసాయం
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడానికి, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడానికి డిజిటల్ పరివర్తన ద్వారా ప్రయోజనం పొందవచ్చు. సేంద్రియ వ్యవసాయం, నిర్దిష్ట సాగు, స్మార్ట్ (పొదుపైన పద్ధతుల్లో) నీటిపారుదల వంటి డిజిటల్ సాంకేతికతలు రైతులకు సమాచార ఆధారిత అవగాహనలను కల్పిస్తాయి. తయారీ, వ్యవసాయ రంగాలలో డిజిటల్ టెక్నాలజీల వినియోగం స్వయంసమృద్ధిని పెంచుతుంది.
ప్రధాన తయారీ పరిశ్రమలు
ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశ రక్షణ రంగం వేగంగా స్వావలంబన సాధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రూ.1.27 లక్షల కోట్లకు చేరి, 2014-15తో పోలిస్తే దాదాపు 174 శాతం పెరిగింది. 2029 నాటికి రక్షణ ఉత్పత్తిని రూ.3 లక్షల కోట్లకు, ఎగుమతులను రూ.50,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ కీలక పరిశ్రమగా ఉద్భవించింది. నేడు భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో 99.2 శాతం దేశంలోనే తయారవుతున్నాయి. మనం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచాం. పునరుత్పాదక ఇంధన రంగం కూడా ప్రధాన వ్యాపారంగా మారింది. 100 గిగావాట్ల సౌర పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యం సాధించడం భారత్ ఆత్మనిర్భర్ లక్ష్యానికి అనుగుణంగా బలమైన, స్వయంసమృద్ధి గల సౌర తయారీ వ్యవస్థ అభివృద్ధిలో దేశం సాధించిన వేగవంతమైన పురోగతికి నిదర్శనం. ఈ ప్రోత్సాహం కారణంగా జూన్ 2025లో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సంవత్సరానికి 1.5 శాతం పెరిగింది. తయారీ రంగం 3.9 శాతం వృద్ధి చెందడం దీనికి ప్రధాన కారణం.
పెరుగుతున్న మధ్యతరగతి
భారతదేశ మధ్యతరగతి జనాభా 2040 నాటికి 59.7 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా. ఈ పెరుగుదల వ్యయ వృద్ధిలో 75 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంటుందని, కొత్త మార్కెట్ అవకాశాలను సృష్టిస్తుందని అంచనా.
స్థూల ఆర్థిక సూచిక పటిష్టం
అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా (పరిస్థితులకు స్పందించే గుణం) ఉంది. 2047 నాటికి స్థూలంగా మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, సగటు వార్షిక GDP వృద్ధి రేటు 9-10 శాతం ఉంటుందని అంచనా.
పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి
పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి 2035 నాటికి మార్కెట్లను పెంచుతుందని, ఉత్పాదకతను పెంచుతుందని, కోట్ల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. పట్టణ ప్రాంతాలు 2036 నాటికి భారతదేశ GDPలో 70 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ మార్పునకు మద్దతుగా 2030 వరకు మౌలిక సదుపాయాలపై ఏటా 290 బిలియన్ డాలర్లకు పైగా మనదేశం పెట్టుబడి పెట్టనుంది.
తయారీ, వాణిజ్య వైవిధ్యం: ‘భారత్‌లో తయారీ’, ‘ఉత్పత్తి-అనుబంధ ప్రోత్సాహకం’ (PLI) వంటి కార్యక్రమాలు తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్య ఆసియాతో సహా కొత్త దేశాలతో భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTAలు) కుదుర్చుకోవడం ద్వారా 2030 నాటికి ఎగుమతులను 2 ట్రిలియన్ డాలర్లను (రెండు లక్షల కోట్ల డాలర్లు) దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆటోమోటివ్ పరిశ్రమ: భారత్ ఆటోమొబైల్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారుతోంది. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 33 లక్షల వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అంతరిక్ష పరిశ్రమ: భారతదేశ అంతరిక్ష పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2030 నాటికి ప్రపంచ మార్కెట్‌లో 8-10 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది, 2047 నాటికి 15 శాతం మార్కెట్ వాటా సాధించాలని ఆశిస్తోంది.
సవాళ్లు, భవిష్యత్తు
ప్రపంచ ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు, యంత్రాలు, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ప్రధాన స్థానం ఆక్రమిస్తున్నాయి. అయినప్పటికీ మన ఎగుమతుల్లో వీటి వాటా తక్కువగా ఉంది. అధిక సాంకేతికత ఎగుమతుల్లో భారతదేశం వాటా మొత్తం ఎగుమతుల్లో కేవలం 6.3 శాతం మాత్రమే. చైనా (29 శాతం), దక్షిణ కొరియా (32 శాతం), వియత్నాం (34 శాతం) కంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. అయితే ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి చర్యలు ఈ పరిస్థితిని సరిదిద్దే అవకాశం ఉంది.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే, పట్టణాలకే పరిమితమైన ఉన్నత విద్యా వ్యవస్థను వికేంద్రీకరించాలి. ప్రాంతీయ, స్థానిక స్థాయిలో సంస్థాగత సామర్థ్యాల బలమైన నెట్‌వర్క్‌ను స్థాపించడానికి నిధులు అవసరం. నైపుణ్యాల పెంపు అవకాశాలను అందించడం ద్వారా ప్రతి పౌరుడిని స్వయంసమృద్ధి గల వ్యక్తిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. స్వయంసమృద్ధ భారత్ మరింత శక్తిమంతమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన భారత్‌కు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఇది ప్రపంచ శాంతి, అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
పంకజ్ జగన్నాథ్ జైస్వాల్

