స్వచ్ఛంద సేవతో అక్షరాస్యత విజయాలు
ప్రతి సమాజంలోనూ ఒక జ్ఞాన వలయం ఉంటుంది. దానిలో ఉన్నవారు చదవగలరు, అర్థం చేసుకోగలరు, తమ పనులు తాము చేసుకోగలరు. బయట ఉన్నవారు నిశ్శబ్దంగా ఉంటారు. మాట్లాడటానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులపై ఆధారపడతారు. ఈ రెండింటినీ వేరు చేసే రేఖ– అక్షరాస్యత. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో దియా బాయి చాలా సంవత్సరాలుగా ఆ వలయం వెలుపలే గడిపారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవాలన్నా లేదా ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆమె ఎవరైనా వచ్చి సహాయం చేసే వరకు ఓపికగా కూర్చునేవారు. ఇప్పుడు ఆమె తన పనులు తానే చేసుకోవడమే కాక, ఒకప్పుడు తమకు అందని ప్రయోజనాలను పొందేందుకు తన గ్రామంలోని ఇతర మహిళలకు కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. అక్షరాస్యత అనేది లెక్కించదగిన గణాంకం కాదు, జీవితాన్ని మార్చగలదని ఆమె కథ మనకు గుర్తుచేస్తుంది.
ఈ నమ్మకమే ‘ఉల్లాస్’కు దారితీసింది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా 2022లో ‘ఉల్లాస్’ (ULLAS-Understanding of Lifelong Learning for All in Society) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం నియత లేదా అధికారిక విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోయిన 15 ఏళ్లు పైబడిన వయోజనులకు విద్యావకాశాలు కల్పించడం. గతంలో చేసిన ప్రయత్నాలకు భిన్నంగా ఈ కార్యక్రమం ప్రతి వ్యక్తిని అభివృద్ధి చేయాలనే కర్తవ్య బోధతో నడుస్తోంది. ఈ భాగస్వామ్య భావనే సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ‘ఉల్లాస్’కు చోదకశక్తిగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమం పాఠశాలలను సాయంత్రం వేళల్లో సామాజిక చేతన కేంద్రాలుగా మారుస్తుంది. 26 భాషల్లో ప్రాథమిక పాఠ్య పుస్తకాలతో కూడిన మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తెస్తుంది. మారుమూల ప్రాంతాలకు చేరడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తుంది. పౌరులు స్వచ్ఛంద ఉపాధ్యాయులుగా సేవ చేస్తున్నారు. ఇది 2.8 కోట్ల మంది అభ్యాసకులు (నేర్చుకునేవారు), 45 లక్షల మంది వాలంటీర్లతో కూడిన ఉద్యమంగా మారింది.
ఆధునిక అక్షరాస్యత అంటే ఏమిటి?
తరతరాలుగా అక్షరాస్యత అంటే కనీసం ఒక వాక్యాన్ని చదవడం, రాయడం మాత్రమే. పూర్తిగా నిరక్షరాస్యత నుంచి కోట్ల మందికి బయటకి తీసుకురావడమే అతిపెద్ద సవాలుగా ఉన్న కాలానికి ఆ నిర్వచనం సరిపోతుంది. అయితే, సాంకేతికత, సమాచార వేగంతో కూడిన నేటి ప్రపంచంలో నేడు కంప్యూటర్ వాడకం, డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, ఆర్థిక నిర్వహణ, పౌర జీవితంలో పూర్తిగా పాల్గొనే సామర్థ్యం కూడా అక్షరాస్యతలో భాగంగా ఉండాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం అంతర్జాతీయ ఒప్పందాలు, జాతీయ విధానంలో కూడా కీలక భాగంగా ఉంది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4.6 ప్రకారం, 2030 నాటికి యువత, వయోజనులు అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానాన్ని సాధించాలి. జాతీయ విద్యా విధానం 2020 కూడా 100 శాతం అక్షరాస్యత సాధించడానికి వయోజన విద్య కోసం బలమైన, వినూత్న ప్రభుత్వ కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అక్షరాస్యత రేట్లు, తలసరి స్థూల జాతీయోత్పత్తి (GDP) మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఇది గుర్తించింది. ఆగస్టు 2024లో విద్యా మంత్రిత్వ శాఖ ‘ఉల్లాస్’ కార్యక్రమం కోసం ఈ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసింది. కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా నూతన విద్యావిధానం గణన నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అక్షరాస్యతలో చేర్చి కొత్త నిర్వచనం ఇచ్చింది.
అక్షరాస్యతలో మైలురాళ్ళు
- గ్రామీణ అక్షరాస్యత 2011లో 67.7 శాతం నుంచి 2023-24లో 77.5 శాతానికి పెరిగింది.
- మహిళా అక్షరాస్యత 65.4 శాతం నుంచి 74.6 శాతానికి పెరిగింది.
రాష్ట్రాలు తమను తాము సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాలుగా ప్రకటించుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మిజోరం ఈ ప్రకటన చేయగా, ఆ తర్వాత గోవా, త్రిపుర చేశాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్ కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్టు ప్రకటించింది. ఈ విజయాలను నిస్సందేహంగా సంతోషం కలిగించేవే అయినప్పటికీ ఈ కార్యక్రమం నిజమైన బలం సంఖ్యలలో లేదు, మానవ ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవకులు అక్షరాస్యత జ్వాలను ముందుకు తీసుకుపోతున్నారు.
- మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన యువ విద్యార్థిని మాండవి సోని తన పొరుగున ఉన్న 10 మంది బడుల్లో చేరే వరకు ఇంటింటికి తిరిగింది.
- గురుగ్రామ్‌కు చెందిన ప్రభుత్వ సెకండరీ స్కూల్ విద్యార్థి అన్షు కుమార్ వయోజనులకు చదవడం నేర్పించి, ఆపై వారికి ఎటిఎంలు, చెక్కులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఉపయోగించడం నేర్పాడు.
ఇటువంటి లక్షల ఉదంతాలు మన చుట్టూ జరుగుతున్నాయి. అక్షరాస్యతను ప్రభుత్వం ఒక్కటే సాధించదని, ఇతరుల కోసం తమ సమయాన్ని ఇచ్చే ప్రజల ద్వారా ఇది ముందుకు సాగుతుందని వారి అంకితభావం నిరూపిస్తుంది. నేను కూడా ఒక వాలంటీర్‌గా నమోదు చేసుకున్నాను, ఎందుకంటే ఇది మనమందరం పంచుకోవాల్సిన బాధ్యత. మనమందరం ‘జన్ జన్ సాక్షర్’ (ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు) స్ఫూర్తిని స్వీకరించి, ఒకరు కనీసం ఒకరికి నేర్పించాలి అనే సూత్రాన్ని పాటిద్దాం. నేటి అక్షరాస్యత కేవలం జనాభా లెక్కల పట్టికలో కొన్ని వరుసలు కాదు, ఇది ఒక స్థాయిని చేరుకోవడం. ఇది నిశ్శబ్దం నుంచి మాటల్లోకి, నిరీక్షణ నుంచి పనిలోకి, బయటే ఉండిపోవడం నుంచి అనుబంధంలోకి, భాగస్వామ్యంలోకి వేసే అడుగు. సమాజానికి ఎప్పుడూ ఒక పరిధి ఉంటుంది. మనం దాన్ని ఎంత విస్తృతం చేయగలం అనేది ముఖ్యమైన ప్రశ్న. ప్రతి అభ్యాసకుడు, ప్రతి వాలంటీర్, ప్రతి బోధనా చర్య ద్వారా మనం ఆ వలయాన్ని లేదా పరిధిని మరింత పెద్దది చేయవచ్చు. తద్వారా ఎవరూ బయటే మిగిలిపోకుండా చూసుకోవచ్చు.
జయంత్ చౌదరి,
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత సహాయ మంత్రి

