అంబేద్కర్ రాజ్యాంగ మార్గమే బిజెపి ధ్యేయం – ధర్మం – దిశ
అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలో నడవడం బిజెపి ధ్యేయం – ధర్మం – దిశ అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ స్మారకాలను ‘పంచతీర్థాలు’గా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబేద్కర్‌ను విశ్వవ్యాప్తంగా గౌరవించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. డిసెంబర్ 6న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. గౌతం రావు, వేముల అశోక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించేది బిజెపి అయితే.. ఉల్లంఘించేది కాంగ్రెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించింది. అయితే ఈ రాజ్యాంగాన్ని వరుసగా ఉల్లంఘించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ విధించి మౌలిక హక్కులను తొక్కిన ఘనత కూడా కాంగ్రెస్‌కే సొంతం. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వని పార్టీ కాంగ్రెస్. 1955లో నెహ్రూకు, తరువాత ఇందిరా గాంధీకి భారతరత్న ఇచ్చినా, రాజ్యాంగ నిర్మాత, నిష్కళంక దేశభక్తుడు అంబేద్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. భారత రాజ్యాంగానికి, సామాజిక న్యాయ సంస్కరణలకు డాక్టర్ అంబేద్కర్ అసమానమైన కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ ఆయనకు దక్కాల్సిన గుర్తింపును ఇవ్వలేదు. 1990లో బిజెపి మద్దతుతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు మరణానంతరం భారతరత్న లభించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి ప్రజలను మోసం చేసింది. బీసీలకు అన్యాయం జరుగుతుందని బాధపడి బీసీ యువకుడు ఈశ్వర్ చారి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా బాధాకరం. యువత రాష్ట్ర ప్రభుత్వం మోసాలను, అన్యాయంపై పోరాడాలి, కానీ ప్రాణాలు తీసుకోవద్దు. బతికి పోరాడితేనే మార్పు తేవచ్చు. చావు కాదు, చైతన్యమే సమాజాన్ని మార్చుతుంది. అంబేద్కర్ ఆలోచనలను అనుసరించే బాధ్యత మనందరిదీ.” అని అన్నారు.

