మున్సిపోల్స్ బిజెపికి సువర్ణావకాశం

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారెంటీలు, వందల కొద్దీ అసాధ్యమైన హామీలు ఇవ్వడం వంటి కారణాలకు తోడుగా మూడు కులాలు- బీసీ, వక్కలిగ, ఎస్సీ వర్గాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యే అవకాశంగా చూపించి, ముఖ్యంగా వక్కలిగ సామాజిక పార్టీ జేడీ(ఎస్) నుంచి 6 శాతం ఓట్లు బదిలీ కావడం వల్ల అధికార పార్టీ బిజెపి ఓట్ల శాతం తగ్గనప్పటికీ ఓటమిపాలవడంతో, దాని ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీలో ఉత్సాహం నింపి, కాషాయ శ్రేణుల్లో నిరాశ కలిగించడంతో రాష్ట్రంలో కమలానికి తొలి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. రేవంత్ మాటల గారడీ, కాంగ్రెస్ బూటకపు హామీలు, అమ్ముడుబోయిన కొన్ని మీడియా గ్రూపులు, కొన్ని యూట్యూబ్ చానళ్ల బిజెపి-బీఆర్ఎస్ ఒక్కటే అన్న భయంకర విష ప్రచారంతో తెలంగాణలో కాంగ్రెస్ గద్దె నెక్కడంతో అధికారంలోకి వస్తుందనుకున్న బిజెపికి అవకాశం చేజారిపోయింది. అయితే, గద్దెనెక్కిన తొలిరోజు నుంచే కాంగ్రెస్ హామీలను బొంద పెట్టడం మొదలుపెట్టింది.

అయినప్పటికీ 2024 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ను బొందబెట్టి, అధికార కాంగ్రెస్ కు దీటుగా 8 లోక్ సభ స్థానాలు గెలుచుకొని, తెలంగాణలో బిజెపినే ప్రత్యామ్నాయం అని చాటుకుంది. తదనంతరం జరిగిన విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింట రెండు స్థానాలు గెలుచుకొని అధికార కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి, పోటీ చేసేందుకు ధైర్యం కూడా చేయని పరిస్థితి బీఆర్ఎస్ కు కల్పించి తెలంగాణలో బిజెపి తన బలాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వచ్చిన వ్యతిరేకతకు భయపడి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిన రేవంత్ ప్రభుత్వం హైకోర్టు మొట్టికాయలతో, కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చిన రూ.3000 కోట్ల నిధులు మురిగిపోయాతన్న భయంతో గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్, బీసీల కన్నా ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలను చొప్పించి బీసీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియను బొందపెట్టింది. అనుకోకుండా వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 30 శాతం ఓట్లున్న ఎంఐఎం బలంతో, పేరున్న స్థానిక రౌడీషీటర్ చిన్న శ్రీశైలం అండదండలతో, అధికార దుర్వినియోగంతో, మాటల గారడీతో గట్టెక్కింది. కానీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణంగా బొక్కబోర్లా పడడం, బిజెపి కూటమి అఖండ విజయం సాధించడం తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించింది. తదనంతరం జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేని కారణంగా నికరంగా ఏ పార్టీ ఎన్ని గెలిచాయో తెలియని పరిస్థితిలో, అధికార అండతో మేమే ఎక్కువ గెలిచామని కాంగ్రెస్ జబ్బలు చరుచుకోవడం మొదలుపెట్టింది. కానీ విద్యావంతులు ఎక్కువగా ఉండే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడం అంత సులభం కాదని భావించిన కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డాలని, మజ్లిస్, కమ్యూనిస్టులతో ‘బిజెపి బూచి’ని చూపి ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. 

గ్రామీణ ప్రాంతాల మాదిరిగా కాకుండా పట్టణ, నగర ప్రాంతాల్లో విద్యావంతులు, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్లు, డబ్బులకు అమ్ముడుపోని వాళ్లు ఉండడం, గత దశాబ్ద కాలానికి పైగా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అద్భుత విజయాల పట్ల అవగాహన ఉన్న ఓటర్లు ఉండడం వల్ల బిజెపికి గెలుపు అసాధ్యం అసలే కాదు, సుసాధ్యానికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ గతంలో కన్నా ఎంతో బలంగా ఉండడం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కన్నా ముందే మున్సిపల్ ఎన్నికల తయారీ మొదలుపెట్టడం, రాష్ట్రంలో సేవాభావం కల కార్యకర్తలు లక్షల్లో ఉండడం, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి గెలుపునకు ఉన్న ముఖ్య అవకాశాలుగా పార్టీ  భావిస్తుంది. సోషల్ మీడియాలో కూడా స్వచ్ఛందంగా పనిచేసే వేలాది కార్యకర్తలు, అభిమానులు బిజెపికి ఉండడం మరో కీలకాంశం. పాలస్తీనాలో ఇజ్రాయిల్ దాడుల్లో ముస్లింలు చనిపోతున్నారని భుజాన సంచులు తగిలించుకొని పార్లమెంటుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు బంగ్లాదేశ్, తదితర దేశాల్లో హిందువులపై జరుగుతున్న దారుణాల విషయంలో మాత్రం నోళ్లకు సీళ్లు వేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశీయంగా, దేశం బయట జరుగుతున్న చాలా సంఘటనలు తెలంగాణలో కూడా ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో హిందూ చైతన్యానికి కారణమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ పబ్లిగ్గా ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని చెప్పడం, తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ముస్లింల ఖబ్రస్థాన్ ల కోసమే ఉన్నదన్నట్టు మాట్లాడడం, తెలంగాణలో హిందువులకు కనువిప్పు కలిగే విధంగా, బిజెపి వైపు మళ్లే విధంగా జరిగిన వరుస సంఘటనలుగా మేధావులు భావిస్తున్నారు. 

ఈ సానుకూల పరిస్థితుల్లో సమర్థ, నిరంతరం కృషి చేసే నాయకత్వం, త్యాగభావన కలిగిన లక్షలాది కార్యకర్తలు, గణనీయ సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు బిజెపికి ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘోర వైఫల్యాలు వెంటాడుతుండడం, గత ప్రభుత్వ కుంభకోణాలు, కేసీఆర్ బిడ్డ కవిత పెట్టిన చిచ్చు బీఆర్ఎస్ ను చుట్టుముట్టడం, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి కలిసొచ్చే ఎన్నో ముఖ్యమైన అంశాలుగా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికలు బిజెపికి సువర్ణావకాశం అని చెప్పవచ్చు.