కృష్ణ జలాల్లో తెలంగాణకు అన్యాయం చిత్తశుద్ధి లేని పాలకులదే పాపం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా కృష్ణ, గోదావరి జలాల సాధనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సొంత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా మారాయి తప్పితే, తెలంగాణ ప్రజల నీటి అవసరాలు తీర్చాలన్న చిత్తశుద్ధి కనబడడం లేదు. తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకులను చూపించి ప్రజలను రెచ్చగొట్టారు, మరి తెలంగాణ సాధించాక పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కృష్ణ జలాల కింద ఎన్ని ఎకరాలు కొత్తగా సాగులోకి తెచ్చారంటే వారి వద్ద జవాబు లేకుండా పోయింది. అవినీతి, సాంకేతిక, రాజకీయ అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్పిస్తే ఈ రెండు పార్టీలు పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ ఉందన్న సోయి కూడా వీరికి లేకపోవడం శోచనీయం.
అధికారం కోసం ప్రజలకు అవసరం లేని అడ్డగోలు హామీలు ఇచ్చి, అవి తీర్చలేక, నిధులు లేవన్న సాకులు చూపుతూ ప్రాజెక్టులు కట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్టుల విషయంలో మసిబూసి మారెడుకాయ చేస్తున్నారు.
తెలంగాణ వచ్చే నాటికే ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 299 టీఎంసీల నీళ్లు రాష్ట్రం ఉపయోగించుకుంటున్నది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 511 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ వచ్చే నాటికే 299 టీఎంసీల నికర జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
- మేజర్ ప్రాజెక్టులు: నాగార్జున సాగర్ 105 టీఎంసీలు, ఆర్డీఎస్ 16 టీఎంసీలు, బీమా 20 టీఎంసీలు, జూరాల 18 టీఎంసీలు కలిపి మొత్తం 159 టీఎంసీలు ఉపయోగంలో ఉన్నాయి.
- మీడియం ఇరిగేషన్ రూపంలో కేటాయించిన నికర జలాలు : కోటిపల్లి, దిండి, కోయిల్ సాగర్, చిట్టివాగు, మూసీ, హైదరాబాద్ తాగునీరు, పీలేరు, పాకాల, వైరా, లంక సాగర్ వంటి మీడియం ప్రాజెక్టులకు 48.24 టీఎంసీల నీళ్లు ఉపయోగంలో ఉన్నట్లు నిర్ధారించారు.
- మైనర్ ఇరిగేషన్ కింద 90.82 టీఎంసీలు నికర జలాలు వాడుకుంటున్నట్టు నిర్దారించారు.
మేజర్ ఇరిగేషన్ కింద 159.94, మీడియం ఇరిగేషన్ కింద 48.24, మైనర్ ఇరిగేషన్ కింద 90.82 టీఎంసీలు.. మొత్తం కలిపి 299 టీఎంసీలు నికర జలాల రూపంలో తెలంగాణ వాడుకుంటున్నదని నిర్ధారించారు.
అయితే, ఉమ్మడి రాష్ట్రంలోనే నికర జలాల రూపంలో ఉపయోగంలో ఉన్న 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది అజ్ఞానమా? అతి తెలివితేటలా? వారే నిర్ణయించుకోవాలి. ఉపయోగంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టులకు ఎంత నీటి వినియోగం అవుతుందనే అంచనా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు- నెట్టెంపాడు 22 టీఎంసీలు, కల్వకుర్తి 25 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ 30 టీఎంసీలు కలిపి మొత్తం 77 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను వరద జలాల కింద కట్టుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులను 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేకపోయిందన్న దానికి వారి వద్ద జవాబు లేదు.
ఆంధ్రప్రదేశ్ వెలిగొండ వద్ద ట్విన్ టన్నెల్ రూపంలో 18 కిలోమీటర్లు పూర్తి చేసి, 53 టీఎంసీల రిజర్వాయర్ సిద్ధం చేసి, నీళ్లు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నది. ఇది చూసైనా బుద్ధి తెచ్చుకోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులను ఏమనాలి? వాళ్లు టన్నెల్స్ పూర్తి చేసి నీళ్లు తీసుకుపోతుంటే.. మన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎందుకు పూర్తికాలేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ను నత్తనడకన నడిపిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులను విమర్శించిన వారే రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చినా ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తవలేదు, అప్పటి మాటలు ఇప్పుడు మీకు సిగ్గుగా అనిపించడం లేదా?
ఆంధ్రప్రదేశ్ బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోతుందని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి, మరి బేసిన్ పరిధిలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయనందుకు వీరు ఎందుకు సిగ్గు పడడం లేదు?
తెలంగాణలో కృష్ణ నదిపై ఉన్న ఏకైక భవిష్యత్ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి. ఈ ప్రాజెక్టు కింద 120 టీఎంసీలు ఎత్తిపోసి, 12 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో 2015లోనే మొదలుపెట్టినా, ఇంతవరకు పూర్తిచేయలేదు. నీటి లభ్యత, ఇతర వివరాలను తగురీతిలో పొందుపర్చకపోవడంతో ఆ డీపీఆర్ వెనక్కు వచ్చింది. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి ఎటు కాకుండా చేశారు. ప్రతి సంవత్సరం జూరాల మిగులు జలాలు శ్రీశైలానికి పోతున్నాయి. శ్రీశైలం వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.
కృష్ణ పరివాహక ప్రాంతంలో అధికారికంగా 69 శాతం తెలంగాణలోనే ఉంది. 31 శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాజెక్టులు కట్టుకుంది, ఇంకా కట్టుకుంటున్నది. బేసిన్ ఆవల కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర హై, లో లెవల్ కెనాల్స్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఏపీ ముందుకు పోతుంటే మన తెలంగాణ పాలకులకు సోయి లేకుండా పోయింది.
ఆంధ్ర పాలకులు వాళ్ల ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతుంటే, మన నాయకులు మాత్రం వారిపై విమర్శలతోనే సరిపెట్టుకొని తమ చేతకానితనాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్ర నాయకులను విమర్శించడం కన్నా, సొంత రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఏవిధంగా పూర్తి చేయోలో ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. కట్ట కింది పొలం తెలంగాణదైతే, కొస పొలం ఆంధ్రప్రదేశ్ ది, కానీ తెలంగాణ వచ్చాక కూడా కట్ట కింద పొలం ఎండిపోతూ, కొస పొలానికి నీళ్లు పారుతున్నాయని ఏడిస్తే, ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే నైతిక హక్కు మీకు లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 811 టీఎంసీలు కేటాయింపు ఉంటే ఆంధ్ర పాలకులు 1150 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు కట్టారు. అంటే 350 టీఎంసీల నీటిని అధికంగా నిల్వ చేయగలిగేలా ప్రాజెక్టులు కట్టారు. అది వాళ్ల గొప్పతనం. ఈ 350 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కట్టారు. మరి తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతున్నా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ఆంధ్ర పాలకులు మన ప్రాంతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయని దద్దమ్మలు తెలంగాణ పాలకులు కావడం మన దురదృష్టం. 10 సంవత్సరాలు పాలించి కృష్ణ నదిపై ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని బీఆర్ఎస్ కు మాట్లాడే హక్కు లేదు. కాంగ్రెస్ కూడా కొత్త లిఫ్టు స్కీములు పెట్టి మరో కాళేశ్వరంలా మార్చకుండా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
తెలంగాణ పాలకులకు రాష్ట్రం విడిపోయినా కూడా తినే కాడ మాత్రం కంచం పొత్తు పోవడం లేదు. ఈ పొత్తులో ఇద్దరికీ ఒకే కాంట్రాక్టర్ వడ్డిస్తున్నాడు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభంలో పల్లేరు కాయలు కాసే నేల పన్నీరు అవుతుందన్న కేసీఆర్ మాటలు పనికిరాని మాటలుగానే మిగిలిపోయాయి. కృష్ణా నదిపై నెట్టెంపాడు 22 టీఎంసీలు, కోయిల్ సాగర్ 5 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ 40 టీఎంసీలు, కల్వకుర్తి 53 టీఎంసీలు, పాలమూరు దిండి కలిపి 120 టీఎంసీలు మొత్తం 240 టీఎంసీల నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. నికర జలాల రూపంలో 299 టీఎంసీలు, ఇంకా కట్టుకున్న ప్రాజెక్టులకు 241 టీఎంసీలు కలిపి 540 టీఎంసీలు తెలంగాణకు అవసరం ఉంది. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. స్వతంత్రం రాకముందే కాకతీయుల చెరువులు తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. కాకతీయులు 800 ఏళ్ల క్రితమే రిడ్జ్ టు వ్యాలీ సూత్రం ఆధారంగా లక్షల చెరువులు తెలుగు నేలపై నిర్మించారు. ఆ కాలంలోనే వాటర్ షెడ్స్, పాండ్స్, రాక్ ఫిల్ కట్టడాలు, గొలుసు కట్టు చెరువులు నిర్మించి తెలుగు నేలను సస్యశ్యామలం చేశారు. కాకతీయుల చిత్తశుద్ధిలో పావలా వంతైనా మన పార్టీలకు, నాయకులకు బాధ్యత లేకపోవడం సిగ్గుచేటు. తెలంగాణ గీతంలో కాకతీయుల పేరు తీసివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనం. కాకతీయులే లేకపోతే తెలంగాణకు ఉండే చరిత్ర ఏంటో చెప్పాలి. అన్నం పెట్టిన కాకతీయులకు సున్నం పెట్టిన కాంగ్రెస్ కు ప్రజలే గుణపాఠం చెప్తారు.
కాకతీయులు నిర్మించిన లక్షకు పైగా చెరువుల్లో నేడు చాలా వరకు కూరుకుపోయాయి, ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధానంగా కృష్ణా బేసిన్ లో మైనర్ ఇరిగేషన్ కింద 90 టీఎంసీల నికర జలాల ట్రిబ్యునల్ కేటాయింపును మనం తిరగతోడాల్సిన అవసరం ఉంది. చెరువుల ఆక్రమణల వల్ల, కూరుకుపోవడం వల్ల 90 టీఎంసీలను మనం వాడుకోవడం లేదు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే వేలాది చెరువులు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ 90 టీఎంసీల లెక్క సరైనది కాదని ట్రిబ్యునల్ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే మన ప్రభుత్వం వద్ద నీటి నిల్వ ఉండే చెరువులు, నీటి నిల్వ లేని చెరువులు, వాటి ఆయకట్టు తదితర వివరాలు లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా మైనర్ ఇరిగేషన్ ఆయకట్టు పూర్తి వివరాలతో రూపొందించాలి. మీడియం ఇరిగేషన్ ఆయకట్టు కింద కేటాయించిన 48 టీఎంసీలను కూడా వాడుకోవడం లేదు. మీడియం ఇరిగేషన్ ఆయకట్టు కూడా తగ్గిపోయింది. ప్రాజెక్టుల వారీగా కాకుండా నది బేసిన్ ఏరియా లెక్కగా కేటాయింపులు జరిపేలా ట్రిబ్యునల్ పై ఒత్తిడి తేవాలి.
అన్నిటికంటే ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు సమకూర్చి పూర్తిచేయాలి. ఎప్పుడైనా కట్టగలిగే వాని ద్వారానే ప్రాజెక్టులు నిర్మాణం అవుతాయి. లేదంటే వాళ్ల వైఫల్యాలను ఒప్పుకొని దిగిపోవాలి. జలయజ్ఞంలో చాలా ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ లో అనుమతి లేదు. కానీ పని మొదలు పెట్టుకొని పూర్తి చేసుకున్నారు. అది ఆంధ్ర పాలకుల తెగింపు. మరి మన పాలకులకు ఎందుకు ఆ తెగింపు లేదు? ఇప్పటికైనా రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ విధానం, పంటల మార్పిడి, వాటికి కావాల్సిన విద్యుత్, నీటి అవసరాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. కొత్త ప్రాజెక్టులు కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ముందు పూర్తి చేయాలి. ప్రభుత్వం మారినప్పుడు ప్రాజెక్టుల డిజైన్లు, లొకేషన్లు మార్చడం వల్ల తెలంగాణ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు దీనికి ఉదాహరణ.
తరాలు మారినా మన తెలంగాణ తలరాత మారడం లేదు. ప్రజలే చైతన్యవంతులై కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు రాజకీయంగా గుణపాఠం చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, వలసలు కొనసాగుతూనే ఉంటాయి. అప్పులు పెరిగి తెలంగాణ బిచ్చగత్తె అవుతుంది.
నరహరి వేణుగోపాల్ రెడ్డి,
బిజెపి నాయకులు

